రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : యువతకు పెద్ద పీఠ వేసే క్రమంలో సీనియర్లు తప్పుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ప్రభావం చూపుతోంది. గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు శాంతారామ్ నాయక్ మంగళవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆదివారం ప్లీనర్ సమావేశంలో రాహుల్ ప్రసంగిస్తూ.. ‘కాంగ్రెస్‌లో యువ రక్తానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని.. అవసరమైతే సీనియర్లు స్వచ్ఛందంగా త్యాగాలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు . ఆ ప్రసంగానికి లోబడే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు 72 ఏళ్ల శాంతారామ్ చెప్పారు. బుధవారం తన రాజీనామా లేఖను నేరుగా రాహుల్ గాంధీకే పంపించనున్నట్లు ఆయన వెల్లడించారు.
‘రాహుల్ ప్రసంగం అనంతరం అక్కడికక్కడే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా.. కానీ, అది సరైన సమయం, వేదిక కాదని భావించి ఇప్పుడు చేశాను. పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నా అధ్యక్షుడి అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా’ అని శాంతారామ్ మీడియాకు తెలిపారు. కాగా, గుజరాత్ పార్టీ చీఫ్ భరత్‌సిన్హా సోలంకి కూడా రాజీనామా యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాతే రాజీనామా చేయాలని భావించినప్పటికీ.. కార్యకర్తల ఒత్తిడి నేపథ్యంలో వెనక్కి తగ్గారు. ఇదే బాటలో మరికొందరు నేతలు కూడా పయనించే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment