
సాక్షి,న్యూఢిల్లీ: మహిళల భద్రత విషయంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశంగా తయారైందన్న రాయిటర్స్ నివేదికపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. దేశంలో మహిళలకు భద్రత పూర్తిగా కరువైందనీ, హింసాకాండలో అఫ్గనిస్తాన్, సిరియా, సౌదీ అరేబియాలను మించి మరింత ప్రమాదకరంగా మారిందన్న రాయిటర్స్ నివేదికపై ఆయన స్పందించారు. ఈ సందర్బంగా మోదీ ఫిట్‌నెస్ వీడియోను టార్గెట్ చేసిన రాహుల్ ఈ మేరకు ట్విటర్‌లో ఒక పోస్ట్ పెట్టారు. మహిళలపై హింస, అత్యాచారాల విషయంలో దేశం ప్రథమస్థానంలో నిలవడం సిగ్గు చేటైన విషయంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తన దాడిని ఎక్కుపెట్టారు. ప్రధాని అందమైన, సురక్షితమైన పచ్చటి మైదానాల్లో ప్రధాని యోగా వీడియోలను తీసుకుంటోంటే, మహిళలపై అత్యాచారాలు, హింసాకాండలో దేశం ఇతర దేశాలను అధిగమించి పోతోందంటూ మండిపడ్డారు. ఇది దేశానికి ఎంత అవమానకరమంటూ రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా భారతదేశంలోలోని మహిళలు ఎక్కువగా లైంగిక హింసకు గురవుతున్నట్టు, మహిళలకు భద్రత లేకుండా పోతోందని థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. అమ్మాయిలను కిడ్నాప్ అయ్యే అవకాశాలు ఎక్కువని తేల్చింది.అంతేకాదు వీటిని నిరోధించడంలో చట్టాలు, న్యాయ వ్యవస్థ విఫలం అయ్యాయని కూడా పేర్కొంది. ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం, సెక్స్ బానిసలుగా మార్చేయడం, వ్యభిచార కూపంలోకి దింపడం లాంటి కార్యకలాపాలు ఎక్కువని సర్వే తేల్చింది.
దేశంలో స్త్రీల భద్రత గతంలో ఎన్నడూ లేని రీతిలో అట్టడుగు స్థాయికి చేరిందని రాయిటర్స్ తెలిపింది. ఏడేళ్ల క్రితం నిర్వహించిన సర్వేలో (2011) భారత్ నాలుగో స్థానంలో ఉంది. 2030 నాటికి మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న హింసను పూర్తిగా అరికట్టాలని స్వేచ్ఛగా బతికేలా వారికి అవకాశం కల్పించాలని మూడేళ్ల క్రితం ప్రపంచ దేశాల నేతలు ప్రతిన బూనారు. కానీ ప్రపంచంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారని రాయిటర్స్ అధ్యయనం తేల్చింది. మహిళల భద్రతపై సర్వే తేల్చిన అంశాలపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment