జైపూర్ : వసుంధరా రాజే ప్రభుత్వానికి రాజస్థాన్ హైకోర్టులో ఊహించని ఝలక్ తగిలింది. ఓబీసీ రిజర్వేషన్ బిల్లుపై స్టే విధిస్తూ గురువారం న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నాలుగు కులాలను ముఖ్యంగా గుజ్జర్లను లక్ష్యంగా చేసుకుని అక్కడి బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను 5 శాతానికి పెంచింది.
ఈ మేరకు గత నెల చివరి వారంలో అసెంబ్లీలో బిల్లును పాస్ చేసింది కూడా. బంజారా, బల్దియా, లబానా- గదియా లోహర్, గదోలియా- గుర్జర్, గుజార్, రైకా, రెబరి, దెబసి, గదారియా, గాద్రి, గాయారి కులాలకు వీటిని వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం కోటా 50 శాతానికి మించి ఉండకూడదు. కానీ, ఇక్కడ తాజా పెంపుతో అది 54 శాతానికి చేరింది. అందుకే స్టే విధిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
గతంలోనే వసుంధరా రాజే ప్రభుత్వం ఒకసారి ఇలాంటి ప్రయత్నం చేసి న్యాయస్థానం నుంచి మొట్టికాయలు వేయించుకుంది. 2015లో వెనుకబడిన కులాల ప్రత్యేక చట్టం-2015 ద్వారా వారి రిజర్వేషన్లను 21 నుంచి 26 పెంచేందుకు యత్నించింది. అయితే కోర్టు ఆ చట్టాన్ని కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ యేడాది మే19న మరోసారి ప్రత్యేక వర్గంలోకి వారిని చేరుస్తూ ఓబీసీ జాబితాను తయారు చేసింది. అయితే ఆ సమయంలో గుజ్జర్ నేతలు కొత్త చట్టంపై తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కారు. చర్చల్లో తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రభుత్వం నడుచుకోవట్లేదంటూ ఆందోళన బాట పట్టారు. దీంతో చర్చల ద్వారా వారిని బుజ్జగించిన సీఎం వసుంధరా రాజే బిల్లును పాస్ చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment