పెరంబూరు: రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి అటు అభిమానులు, ఇటు రాజకీయ వాదులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశాన్ని వాయిదా వేస్తూ రావడం ఆయన అభిమానుల్లో నైరాశ్యానికి దారి తీస్తుందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణరావ్ మాత్రం ఆలస్యం అమృతమే నంటున్నారు. రజనీకాంత్ కంటే ఆయన రాజకీయ ప్రవేశం గురించి సత్యనారాయణరావ్‌నే ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈయన ఏ సందర్భంలో అయినా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం తథ్యం అనే మాటనే వాడుతుంటారు. తాజాగా శనివారం కూడా ఇదే పాట పాడారు. తిరుచ్చి, ఒలైయూర్ సమీపంలోని కుమారమంగళంలో రజనీకాంత్ తల్లిదండ్రులకు ఆయన అభిమానులు స్మారక మంటపాన్ని కట్టించారు. రెండు నెలల క్రితం దీని ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది.
కాగా ఈ స్మారక మంటపం మండలపూజా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రజనీ సోదరుడు సత్యనారాయణరావ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురవాలని, వ్యవసాయం బాగా పండాలని ఈ పూజా కార్యక్రమంలో కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలు తమపై చూపుతున్న ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటామన్నారు. తమ తల్లిదండ్రుల స్మారక మంటపాన్ని సందర్శంచడానికి రజనీకాంత్ దర్బార్ చిత్ర షూటింగ్ ముగించుకుని వస్తారని చెప్పారు. అదే విధంగా ఈ నెల 23న రాజకీయ రంగప్రవేశం గురించి ఆయన మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని అన్నారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారని అన్నారు. రాజకీయ ప్రవేశం గురించి రజనీకాంత్ కచ్చితంగా వెల్లడిస్తారని, ఆ తరువాత ప్రజలకు మంచే జరుగుతుందని అన్నారు. ఆయన పలు రకాల పథకాలను సిద్ధం చేశారని తెలిపారు. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం ఆలస్యం అయినా అది మంచికేనని, రాజకీయాల్లోకి రావడం మాత్రం పక్కా అని సత్యనారాయణరావ్ వక్కాణించారు.
Comments
Please login to add a commentAdd a comment