
దర్భార్ షూటింగ్‌లో రజనీకాంత్, మురుగదాస్(పాత ఫోటో)
కోలీవుడ్ టాప్ దర్శకుల్లో ఏఆర్ మురుగదాస్ ఒకరు. అజిత్ కథానాయకుడిగా దీనా చిత్రంతో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆయన వరుసగా పలు చిత్రాలతో విజయపథంలో కొనసాగుతూ వచ్చారు. అయితే ఏఆర్ మురుగదాస్‌ను ఒకసారిగా డౌన్ ఫాల్ చేసిన చిత్రం దర్బార్. ఆ చిత్ర కథానాయకుడు రజనీకాంత్. భారీ అంచనాల మధ్య విడుదలైన దర్బార్ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. దీంతో మూడేళ్లుగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మెగా ఫోన్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. దర్బార్ దెబ్బతో తదుపరి విజయ్ హీరోగా చేయాల్సిన చిత్రం వెనక్కి వెళ్లిపోయింది.
కాగా ఇటీవల ఓ భేటీలో రజనీకాంత్ తో చేసిన దర్బార్ చిత్రం ఫ్లాప్ కావడానికి కారణాన్ని సుమారు మూడేళ్ల తర్వాత ఏఆర్ మురుగదాస్ బయటపెట్టారు. రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసే అవకాశం తనకు ఫిబ్రవరి నెలలో వచ్చిందనీ, జూన్ నెల ముంబాయిలో వర్షాల సీజన్ కావడంతో అలా చిత్ర షూటింగును హడావుడిగా పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ఎందుకంటే ఆగస్టులో రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు చెప్పారన్నారు. తాను రజనీకాంత్‌కు వీరాభిమానిని. దీంతో ఆయనతో చిత్రాలు చేసే అవకాశాన్ని ఏ కారణంగాను వదులుకోకూడదని భావించానన్నారు.
రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవడంతో ఆ సమయంలో దర్బారే ఆయన చివరి చిత్రం అనే ప్రచారం జరిగిందన్నారు. దీంతో ఫిబ్రవరిలో రజనీకాంత్ చిత్రాన్ని దర్శకత్వం వహించే అవకాశం రావడం మార్చి నెలలో షూటింగ్ ప్రారంభించి జూన్ నెలకంతా చిత్రాన్ని పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీంతో ఎలాగైనా రజనీకాంత్ చిత్రం చేసి హిట్ కొట్టాలని భావించానని, అయితే సరైన ప్రణాళిక లేకపోవడంతో దర్బార్ చిత్రం ఫ్లాప్ అయ్యిందని చెప్పారు. సాధారణంగా షూటింగ్‌కు ముందు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకు చాలా సమయం అవసరం అవుతుందన్నారు. అది దర్బార్ చిత్రానికి లేకపోయిందని మురుగదాస్ పేర్కొన్నారు.