సాక్షి, చెన్నై: తాను రాజకీయాలోకి రావడం ఖాయమని, కాలమే దీన్ని నిర్ణయించిందని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. అభిమానులతో ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలోపే సొంతంగా కొత్త పార్టీ స్థాపిస్తానని తెలిపారు. తమిళనాడులోని 234 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. యుద్ధం చేస్తా, గెలుపోటములు దేవుడి దయ అని వ్యాఖ్యానించారు. యుద్ధం చేయకపోతే పిరికివాడు అంటారని పేర్కొన్నారు. డబ్బు కోసమో, పేరు కోసమో రాజకీయాల్లోకి రావడం లేదని.. అవన్నీ తనకు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు. దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టిపోయావని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు తనకు మనస్తాపం కలిగించాయన్నారు.
గెలిస్తే విజయం.. లేదంటే మరణం
వ్యవస్థను మార్చే సమయం వచ్చిందని, పార్టీ ఏర్పాటులో అభిమానులదే కీలకపాత్ర అని రజనీకాంత్ అన్నారు. తనకు కార్యకర్తలు వద్దని, రక్షకులు కావాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని, తనకు తమిళ ప్రజల దీవెనలు కావాలని అభ్యర్థించారు. కొన్ని రాజకీయ పార్టీలు తమిళ రాజకీయాలను భ్రష్టు పట్టించాయని వాపోయారు. ఇప్పటికీ తాను రాజకీయాల్లోకి రాకపోతే ప్రజలకు అన్యాయం చేసిన వాడిని అవుతానని అభిప్రాయపడ్డారు. రాజకీయాలంటే తనకు భయం లేదని, ఎన్నికల యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. రాజకీయాలు చేయడం అంత సులువు కాదని, ‘గెలిస్తే విజయం.. లేదంటే మరణం’ అని వ్యాఖ్యానించారు. సమయం లేకపోవడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు.
రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటన
అభిమానుల సంబరాలు
రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ స్పష్టత ఇవ్వడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా కాల్చి, పరస్పరం స్వీట్లు పంచుకుని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తలైవా పొలిటికల్ ఎంట్రీతో తమిళ రాజకీయాల్లో మార్పులు వస్తాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment