
తమిళనాడు,పెరంబూరు: నాకు రాజకీయాలు సరిపడవు, సినిమాలే చాలు. ఇలా అన్నది ఎవరో తెలుసా?.. స్వయంగా మన తలైవా రజనీకాంత్. ఈయన ఇటీవల రాష్ట్రంలోని రజనీ ప్రజాసంఘం జిల్లా కార్యదర్శులతో స్థానిక కోడంబాక్కంలోని శ్రీరాఘవేంద్ర కల్యాణ మంటపంలో భేటీ అయిన విషయం తెలిసిందే. రజనీకాంత్ రాజకీయ పార్టీ గురించి ప్రకటన చేస్తారని ఆసక్తిగా ఎదురు చూశారు. తీరా భేటీ అనంతరం తానుఒక్క విషయంలో మోసపోయానని, అదేమిటన్నది త్వరలోనే చెబుతానని మీడియాతో చెప్పారు. రజనీ పార్టీ సంగతేమోగానీ, ఆయన ఏ విషయంలో మోసపోయారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాగా రజనీకాంత్ మోసపోయానన్న వ్యాఖ్యలకు కారణాలు ఇప్పుడు వెలుగు చూశాయి. రజనీకాంత్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఒక ప్రముఖుడు ఆ విషయాలను బయటపెట్టారు. సమావేశంలో పాల్గొన్న రజనీ ప్రజా సంఘం జిల్లా కార్యదర్శులు బీజేపీ పార్టీ గురించి, కమలహాసన్ పార్టీ మక్కళ్‌కట్చితో పొత్తు గురించి చర్చించుకున్నారు. నటుడు రజనీకాంత్ వారి పని తీరుపై ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని సభ్యులుగా చేర్చమని చెప్పాననీ, అది ఇంత వరకూ జరగలేదని అన్నారు.
నా అదేశాన్ని పాటించడంలో ఎందుకింత అలసత్వం అని ప్రశ్నించారు. బూత్‌కమిటీలకు ఇంకా సభ్యులను నిర్వహించలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేను చెబితేనే కొన్ని పనులు చేస్తున్నారని అన్నారు. మీలో మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? అలా గొడవలు పడడం ఇకపై మానుకోవాలి. లేకుంటే అలాంటి వారిని దయా దాక్షిణ్యలు చూపకుండా తొలగిస్తాను అని హెచ్చరించారు. నేను బీజేపీ మద్దతుదారుడిని కాదనీ, అదే విధంగా కమలహాసన్ పార్టీ మక్కళ్ కట్చితో పొత్తుపై మీ అభిప్రాయం ఏంటనీ రజనీకాంత్ అనడంతో అక్కడ ఉన్నవారంతా షాకయ్యారని ఆ వ్యక్తి చెప్పారు. అదే విధంగా తాను ముఖ్యమంత్రిని కాదు, తనతో కలిసి రాజకీయాల్లోకి వచ్చేవారెవరికీ డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉండకూడదు.. ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న వారందరికీ పదవులు లభించకపోయినా బాధ పడకూడదు.. ఈ నిబంధనలను అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తేనే పార్టీని ప్రారంభిద్దాం.. ఎవరికైనా ఇందుకు అభ్యంతరం ఉంటే సమస్యలేదు.. తనకు రాజకీయాలు సరిపడవు, సినిమాలే చాలు అని ఒక వారంలో ప్రకటిస్తానను అని రజనీకాంత్ చెప్పడంతో సమావేశంలోని వారందరూ ఖంగుతిన్నారని ఆ వ్యక్తి వెల్లడించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా రజనీకాంత్‌ను మినహా వేరెవరినూ ఊహించకోలేమని, అటాంటిది రజనీకాంత్ వ్యాఖ్యలు తమకు షాక్ ఇచ్చాయని కార్యదర్శులు పేర్కొనట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు పార్టీ గురించి తలైవా ఎలాంటి ప్రకటన చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
23న రజనీ సాహసాల చిత్రం
కాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇటీవల వైల్డ్ విత్ వేర్‌గ్రిల్స్ పేరుతో రూపొందిన అబ్వేంచర్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అడవిలో క్రూరమృగాలతో, విషసర్పాలు, వింత జంతువుల మధ్య సాగే సహాస పయనమే వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ పేరుతో రూపొందిన డాక్యుమెంట్రీ చిత్రం. బెర్‌గ్రిల్స్ ఇంతకు ముందు వైల్డ్ విత్ మోది పేరుతో ప్రదానమంత్రి నరేంద్రమోదితో ఈ అడ్వేంచర్ పయనాన్ని చేయించారు. తాజాగా రజనీకాంత్‌తో చిత్రీకరించారు. కాగా రజనీకాంత్ అడవుల్లో చేసిన సాహస పయనంతో కూడిన డాక్యుమెంట్రీ చిత్రం ఈ నెల 23వ తేధీన రాత్రి 8 గంటలకు డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం కానుంది. కాగా ఆ సాహస చిత్ర టీజర్‌ను నిర్వాహకులు ఆదివారం విడుదల చేశారు. నిమిషం నిడివి కలిగిన ఈ ట్రైలర్‌లో అడవుల్లో రజనీకాంత్ నటించిన అడ్వేంచర్ సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో రజనీ చేసిన సహస పయనంతో కూడిన వైల్డ్ విత్ బెర్‌గ్రిల్స్ డాక్యుమెంట్‌పై మరింత ఆసక్తి నెలకొంది.