అఖిలేష్, మాయావతి, రాహుల్ (ఫైల్)
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓ ఉమ్మడి ఫ్రంట్‌గా ఏర్పడేందుకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయా? ప్రతిపక్షాల ప్రయత్నాలకు తొలి పరీక్ష ఉత్తరప్రదేశ్ నుంచే ఎదురుకానుంది. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఏప్రిల్ నెలలో పది సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు తమ విభేదాలను విస్మరించి చేతులు కలుపుతాయా?
ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు 31 మంది సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తుండగా, వారిలో తొమ్మిది మంది సభ్యత్వం ఏప్రిల్ రెండో తేదీతో ముగిసి పోతుంది. బీఎస్‌పీ చీఫ్ మాయావతి తన రాజ్యసభ సభ్యత్వానికి గత జూలై నెలలోనే రాజీనామా చేశారు. దీంతో మొత్తం పది సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. రిటైర్ అవుతున్న తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో సమాజ్‌వాది పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు, నరేష్ అగర్వాల్, జయాబచ్చన్, కిరణ్మయ్ నందా, అలోక్ తివారీ, మునావర్ సలీం, దర్శన్ సింగ్ యాదవ్‌లు, బీజేపీ సభ్యుడు వినయ్ కటియార్, బీఎస్పీ సభ్యులు మొహమ్మద్ అలీ, కాంగ్రెస్‌కు చెందిన ప్రమోద్ తివారీలు ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 312 మంది సభ్యుల బలం కలిగిన బీజేపీ సులభంగా ఎనిమిది రాజ్యసభ సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. 47 మంది సభ్యులు కలిగిన సమాజ్‌వాది పార్టీ ఒక్క రాజ్యసభ సీటును గెలుచుకోగలదు. పదవ సీటును గెలుచుకోవాలంటే మూడూ పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేయాల్సిందే. ఈ విషయంలో మూడు పార్టీలు ఒక అవగాహనకు వస్తాయన్నది ప్రశ్న. తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి బీఎస్పీ ముందుకు వస్తే మంచిదని సమాజ్‌వాది పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మాయావతి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని బీఎస్పీ నాయకుడు సతీష్ శర్మ తెలిపారు. ఉమ్మడి అభ్యర్థి విషయంలో నిర్ణయం చొరవ తీసుకోవాల్సింది ఆ రెండు పార్టీలేనని అసెంబ్లీలో అంతగా బలంలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
ఏదిఏమైనా ఇప్పుడు ఓ అవగాహనకు వచ్చినట్లయితే గోరఖ్‌పూర్, ఫుల్పూర్ లోక్‌సభ స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికలకు, 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఏకమయ్యేందుకు దోహదపడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. గతవారమే యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ 17 పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంట్ లోపల, బయట వివిధ సమస్యలపై పోరాటం జరిపేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకతాటిపైకి రావాలని చర్చించారు. ఈ సమావేశానికి కూడా బీఎస్పీ గైర్హాజరవడం పలు సందేహాలకు దారితీసింది. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏకం కావాలంటే ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయడం అవసరం.
Comments
Please login to add a commentAdd a comment