సాక్షి, గన్నవరం : ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేయడం శుభపరిణామమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గుంటూరులో జరిగే కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ నేతలు రాంమాధవ్, యూపీ మంత్రి సిద్ధార్థ సింగ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు శనివారం గన్నవరం చేరుకున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు గన్నవరం విమానాశ్రయంలో వారికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాంమాధవ్ మాట్లాడుతూ...‘ రాష్ట్రంలో చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారు. చివరికి ఫ్లెక్సీల మీద కూడా తమ కుటుంబానికి చెందినవారి ఫోటోలను మాత్రమే వేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో విడిపోవడం మాకు నష్టం లేదు. మాతో విడిపోయిన తర్వాత టీడీపీ విషప్రచారం చేస్తోంది. ఎవరిది ధర్మ పోరాటమో ప్రజలే నిర్ణయిస్తారు. నరేంద్ర మోదీ ఇమేజ్ వలనే దేశంలో బీజేపీ బలంగా ఉంది.
కాంగ్రెస్ వ్యతిరేక విధానాలతో పుట్టిన టీడీపీ చివరకు కాంగ్రెస్‌లోనే కలిసిపోయింది. రాహుల్ గాంధీ, చంద్రబాబు చేతులు కలపడాన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. అభివృద్ధి ప్రధాన అంశంగా 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2019లో కూడా అదే ఉత్సాహంతో ముందకు వెళ్తాం. ఏపీకి హోదా విషయాన్ని పక్కనపెడితే ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాం.ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి టీడీపీ స్వార్థ ప్రయోజనం కోసం దుష్ప్రచారం చేస్తోంది.’ అని ధ‍్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment