జగన్‌ను విమర్శించే అర్హత కోట్లకు లేదు | BY Ramaiah Fair On Kotla Surya Prakash Reddy Kurnool | Sakshi
Sakshi News home page

జగన్‌ను విమర్శించే అర్హత కోట్లకు లేదు

Published Thu, Nov 29 2018 12:50 PM | Last Updated on Thu, Nov 29 2018 12:52 PM

BY Ramaiah Fair On Kotla Surya Prakash Reddy Kurnool - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి లేదని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు.  పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో కోట్ల కుటుంబానికి విలువలు ఉన్నాయని, టీడీపీ ఇచ్చే ఒకటి, రెండు సీట్ల కోసం వాటిని దిగజార్చుకోవద్దని సూచించారు.

టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తులో ఎంపీ అవుతానని సూర్యప్రకాష్‌రెడ్డి కలలు కంటున్నారని, పొత్తులో పోటీ చేస్తే ఆయన చిత్తవడం ఖాయమన్నారు. 2014లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేయడంతో కొన్ని ఓట్లయినా పడ్డాయని, విలువలు లేకుండా రాజకీయాలు చేస్తే 2019లో ఆ ఓట్లు కూడా పడబోవని గుర్తించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీని 2014లోనే ప్రజలు తిరస్కరించారని, మళ్లీ ఆ పార్టీని ఆదరించే ప్రసక్తే లేదన్నారు.


ఆనాడు రామారావుకు.. ఈనాడు టీడీపీకి వెన్నుపోటు... 
సీఎం చంద్రబాబునాయుడు రామారావుకు వెన్నుపోటు పొడిచి ఆయన దివంగతులయ్యేలా చేశారని బీవై రామయ్య గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని  తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచారని  విమర్శించారు. ఆత్మగౌరవ నినాదంతో స్థాపించిన టీడీపీని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాళ్ల దగ్గర పెట్టి తెలుగువారి ఆత్మభిమానాన్ని చంపేశారన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు ఏమాత్రం విలువలు లేవని, కేవలం అధికారమే పరమాధిగా సాగుతున్నాయని విమర్శించారు.

తెలంగాణలో 13 సీట్లకే టీడీపీని పరిమితం చేసి రాహుల్‌గాంధీతో సీఎం చంద్రబాబునాయుడు వేదికను పంచుకోవడంపై సొంత పార్టీలోనే తీవ్ర నిరసన వ్యక్తమవుతోందన్నారు. ఆ రెండు పార్టీల పొత్తును ప్రజలు అంగీకరించడంలేదని, ఓటమి తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పర్ల శ్రీధర్‌రెడ్డి, కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ జిల్లాల ప్రధాన కార్యదర్శులు కరుణాకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, మనోహర ఆచారి, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీతో పొత్తు ఉండబోదని ప్రకటించగలవా? 
టీడీపీ–కాంగ్రెస్‌ పొత్తు ఉండే ప్రసక్తే లేదని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి,  కేఈ కృష్ణమూర్తి చెబుతూ వచ్చారని రామయ్య గుర్తు చేశారు. కేఈ కృష్ణమూర్తి.. ఏకంగా కాంగ్రెస్‌తో  టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటానని ప్రకటించారన్నారు. కాంగ్రెస్, టీడీపీ అధ్యక్షులు చెట్టాపట్టాల్‌ వేసుకొని తిరుగుతున్నారని, ఒకే వేదికను పంచుకుంటున్నా.. తెలంగాణలో పొత్తు పెట్టుకున్నా.. వీరికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటాయని టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజు, మంత్రి యనమల రామకృష్ణుడు, రాహుల్‌గాంధీ దూతగా అమరావతికి వచ్చిన అశోక్‌గెహ్లాట్‌ ప్రకటించినా..వీరికి వినిపించలేదా అన్ని ప్రశ్నించారు. కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డికి దమ్ము ఉంటే టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు ఉండబోదని ప్రకటించాలని సవాల్‌ విసిరారు.  

అవినీతి సామ్రాట్‌ను సీఎం చేయాలనుకుంటున్నావా? 
టీడీపీ అధినేత అంత అవినీతి పరుడు దేశంలోనే లేరని గతంలో విమర్శించిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి.. టీడీపీతో పొత్తు అనగానే చంద్రబాబు నీతిమంతుడు అయ్యారా అని బీవై రామయ్య ప్రశ్నించారు. ఎక్కడైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార పక్షాన్ని విమర్శిస్తారని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విచిత్రమైన పరిస్థితి ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైనే ఆరోపణలు చేయడం కాంగ్రెస్, జనసేనతోపాటు కొన్ని పార్టీలకు అలవాటైందన్నారు.

వీరందరికీ ప్రజా సమస్యలపై ఏమాత్రం ధ్యాస లేదన్నారు. తమ పార్టీ అధినేత ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వంపై దండయాత్ర చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏడాదిగా ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారన్నారు. ప్రతి రోజూ వేలాది మంది ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం కాకుండా అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయఢంకా మోగించి జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పొత్తులో ఎంపీ కావాలనుకుంటున్న కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కలలు కల్లలుగానే మిగిలిపోతాయని, ఆ రెండు పార్టీలను ప్రజలు ఛీ కొడతారన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement