
రమేష్ జర్కిహోలి (పాత చిత్రం)
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరిపారన్న వదంతులపై మంత్రి రమేష్ జర్కిహోలి స్పందించారు. తమ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్నదాంట్లో వాస్తవం లేదన్నారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌తో సంప్రదించారని మంత్రి ట్విస్ట్ ఇచ్చారు. శనివారం ఆయన బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలో చేరడం లేదన్నారు. తామ కూటమి (కాంగ్రెస్-జేడీఎస్) అధికారంలో ఉన్న కారణంగా బీజేపీ నేతలో కాంగ్రెస్‌లో చేరికపై యత్నిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రయోజనం కలిగిందని, ఆయనను ఎవరు పరామర్శించినా అందులో తప్పులేదని మంత్రి రమేష్ అభిప్రాయపడ్డారు.
కాగా, కర్ణాటక కేబినెట్‌లో చోటు దక్కలేదని ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఢిల్లీ స్థాయిలో పంచాయితీ పెట్టిన మాజీ మంత్రి, బీదర్ జిల్లా బబలేశ్వర్ ఎమ్మెల్యే ఎంబీ పాటిల్, సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఇటీవల సిద్ధరామయ్య ధర్మస్థలంలో చికిత్స తీసుకుంటున్న సమయంలో పరామర్శించడానికి కుదరలేదని, శనివారం ఆయన యోగక్షేమాలు తెలుసుకునేందుకు బాదామి వచ్చినట్లు పాటిల్ తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని పాటిల్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment