
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. తలైవా రాజకీయాల్లోకి రావడం ‘ఈవెంట్ ఆఫ్ ది సెంచరీ’ అని అభివర్ణించిన వర్మ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రజనీని ఆదర్శంగా తీసుకొని అన్నిస్థానాల్లో పోటీచేయాలని తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నాడు.
‘రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఈ శతాబ్దపు అత్యున్నత ఘటన (ఈవెంట్ ఆఫ్‌ది సెంచరీ).. రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పే సందర్భంలో రజనీ స్క్రీన్‌పై కనిపించే సూపర్ స్టార్ కన్నా వెయ్యిరెట్లు ప్రభావితంగా కనిపించారు. తమిళనాడులోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పిన తలైవా ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పీకే(పవన్ కళ్యాణ్) ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలి’ అని వర్మ సూచించాడు.
చెడిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. సత్యం, కార్యం, అభివృద్ధి (ట్రూత్, వర్క్, గ్రోత్).. తమ పార్టీ మూల సూత్రాలుగా ఉంటాయని అభిమానులతో రజనీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment