
సాక్షి, అమరావతి : శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో టీడీపీ అడ్డుతగలడం దారుణమన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను స్వాగత్తిస్తున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి సందర్భంలోనూ టీడీపీ అడ్డుపడటం దురదృష్టకరమన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ భాగంగా రాపాక వరప్రసాద్ మాట్లాడారు. అసెంబ్లీలో మేధావులు, డాక్టర్లు, ఐపీఎస్ అధికారులు ఉండగా.. ఇక పెద్దల సభ ఎందుకంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నా అని అన్నారు. ఇంతమంది రాజకీయ ప్రముఖులు ఉన్నాక.. మళ్లీ మండలి అవసరం లేదని రాపాక స్పష్టం చేశారు.
శాసనసభలో రాపాక మాట్లాడుతూ.. ‘154 మంది శాసన సభ్యలు ఆమోదం తెలిపిన బిల్లును మండలి తిరస్కరించడం దురదృష్టకరం. ఇంగ్లీష్ మీడియం బిల్లును కూడా మండలిలో టీడీపీ అడ్డుకుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆయన స్థాయికి దిగజారి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా మండలి చైర్మన్ షరీఫ్‌ను కూడా ఆయన ప్రభావితం చేశారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపుతున్నాను అని చెప్పడానికి చైర్మన్ ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ విధంగా చేయడం చంద్రబాబుకు సరికాదు.
అన్నాతమ్ముడిలా.. కలిసి జీవించే మాల, మాదిగలను రెండుగా చీల్చిన చరిత్ర చంద్రబాబు నాయుడిది. బ్రిటీష్ సాంప్రదాయాలను పాటిస్తూ విభజించి పాలించే అనే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. గడిచిన ఆరు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. సీఎం జగన్ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నారు. ముఖ్యంగా విద్యాభివృద్ధి కొరకు సీఎం జగన్ చేపడుతున్న చర్యలు అభినందనీయం. అన్ని వర్గాలు, ప్రాంతాలను అయన సమానంగా చూస్తున్నారు’ అని తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment