ఎస్పీని కలిసి బయటకు వస్తున్న తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
సాక్షి, అనంతపురం సెంట్రల్: ఓటమి భయం వెంటాడటం వల్లే రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి పరిటాల సునీత తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. రాప్తాడులో పాతిక వేల ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ గెలవబోతోందనే విషయాన్ని మంత్రి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. నియోజకవర్గంలో టీడీపీ నేతలు సాగిస్తున్న అరాచకాల గురించి ఆదివారం సాయంత్రం అనంతపురంలో ఎస్పీ అశోక్‌కుమార్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి వివరించారు. తాము రెచ్చగొట్టే పనులు చేస్తున్నామని, కక్షలకు ఆజ్యం పోస్తున్నామని ఎటువంటి ఆధారం లేకుండానే మంత్రి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో గొర్రెల కాపరులను తమ పొలాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నామని చెబుతుండడం బాధాకరమన్నారు. తమ గ్రామంలో 600 మంది గొర్రెల కాపరులుంటే అన్ని ఓట్లూ తమకే పడుతాయని, టీడీపీ నేతలు సైతం మా భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పారు. రెండు రోజుల క్రితం తమ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వ చ్చిన తమ పార్టీ నాయకుడు నరేందర్‌రెడ్డి వాహనంలో జెండా కర్రలు దొరికాయని కేసులు నమోదు చేయించారన్నారు. దీన్ని టీడీపీ నాయకుడు సోషల్‌మీడియాలో షేర్ చేయడం, ఇదే విషయాన్ని బలపరుస్తూ మంత్రి పరిటాల సునీత ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు.
ముఖ్య నాయకులను పొట్టనపెట్టుకున్నారు!
రాప్తాడు నియోజకవర్గంలో కనీసం ప్రతిపక్ష పార్టీ జెండా కర్రలు కూడా పట్టుకొని తిరిగే పరిస్థితి కల్పించకుండా టీడీపీ నాయకులు గత ఐదేళ్ల కాలంలో వైఎస్సార్‌సీపీ ముఖ్యమైన నాయకులను పొట్టన పెట్టుకున్నారని ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. నిరాధాయుడైన రాప్తాడు మండల కన్వీనర్ ప్రసాద్‌రెడ్డిని తహసీల్దార్ కార్యాలయంలో దారుణంగా హత్య చేశారన్నారు. కందుకూరు శివారెడ్డి, ఆత్మకూరు కేశవరెడ్డిలను వేటకొడవళ్లతో నరికి చంపారన్నారు. ఆ సమయంలో వారి వద్ద వైఎస్సార్‌సీపీ జెండా కర్రలున్నా ప్రాణాలతో బయటపడేవారని అన్నారు. సదరు హత్య కేసుల్లో నిందితులకు పరిటాల శ్రీరామ్ ఆశ్రయం కల్పిస్తున్నాడని, తమ వద్ద సాక్షాలున్నాయని స్పష్టం చేశారు.
సదరు కేసుల్లో బాధిత కుటుంబాలు రాతపూర్వకంగా పరిటాల శ్రీరామ్, బాలాజీ, పరిటాల కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. గతంలో పరిటాల రవి పీపుల్స్ వార్, ఆర్వోసీ సంస్థలు ఏర్పరుచుకొని హిట్‌లిస్టులు ప్రకటించి మరీ కాంగ్రెస్ నేతలను హత్య చేసిన చరిత్ర వారిదని తెలిపారు. రక్త చరిత్ర సినిమాలో కూడా ఇదే చూపించారన్నారు. ప్రస్తుతం ఓటమి అంగీకరించలేక రక్త చరిత్ర–3 ద్వారా ప్రత్యర్థులను హత్య చేయడానికి పన్నాగం పన్నుతున్నారన్నారు. సాగునీరు ఇవ్వకపోవడంతో పంటలు పండక 20వేల మంది వలసలు పోయారన్నారు.
ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు
వైఎస్సార్‌సీపీ కార్యకర్త వడ్డే రాజయ్యను పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారని, ప్రకాష్‌రెడ్డిని పదిరోజుల్లో చంపుతామని శ్రీరామ్ హెచ్చరించినా, సునీత తమ్ముడు మురళి మహిళలపై రాళ్లు రువ్వినా, ముకుందనాయుడు అనే వ్యక్తి పరిటాల సునీత సమక్షంలోనే ఎస్సీ, బీసీలకు వార్నింగ్‌లు ఇచ్చినా, హత్య కేసుల్లో బాధిత కుటుంబాలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు లేకపోవడం బాధాకరమన్నారు. తెల్లకాగితంలా బతుకుతున్న తమపై బురుదజల్లే కార్యక్రమాలు పరిటాల సునీత ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజారాం, నాయకులు ప్రసాద్‌రెడ్డి, నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment