
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ విడుదల చేసిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రచార గీతం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇంటర్‌నెట్‌లో ఆ పాటను విన్న వారి, చూసిన వారి సంఖ్య ఇప్పటివరకు 70 లక్షలు దాటింది. దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ ప్రచారగీతం ఈ స్థాయిలో ఆకర్షించడం ఆల్‌టైం రికార్డుగా చెబుతున్నారు. ఈ పాట విడుదలైన అనతి కాలంలో విపరీతంగా జనసామాన్యంలోకి కూడా వచ్చేసింది. లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువతీయువకుల నోళ్లల్లో ఈ పాట నానుతూ ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. రోజులు గడిచే కొద్దీ ఇంటర్‌నెట్‌లో చూసేవారి సంఖ్య లక్షల్లో పెరుగుతోందంటే ఈ పాట ప్రజల్లో ఎంత ఆదరణ పొందిందో స్పష్టమవుతోంది. ఈ పాట ఒక్క ఏపీలోనే కాక.. పొరుగు రాష్ట్రాల్లోని జగన్ అభిమానులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంతగా అందరినీ ఆకట్టుకున్న ఈ గీతాన్ని ప్రఖ్యాత సినీ రచయిత సుద్దాల అశోక్‌తేజ రచించారు. ఈ పాటకు ఫిదా చిత్ర సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చగా.. గాయకుడు మనో ఆలపించారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత పుత్తా ప్రతాపరెడ్డి తెలిపారు. ఓ ప్రాంతీయ పార్టీ ప్రచారగీతం ఇంతగా ఆదరణ పొందడం రాష్ట్రంలో రాగల పెనుమార్పులకు సంకేతం కావచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ద్వితీయ, తృతీయ స్థానాల్లో జాతీయ పార్టీల పాటలు
మొదటి స్థానంలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ పాట ఉంటే.. ద్వితీయ, తృతీయ స్థానాల్లో జాతీయ పార్టీల గీతాలు ఉన్నాయి. అలాగే, 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విడుదల చేసిన ‘సబ్‌కో స్వాగత్ హై తయ్యార్..’ అంటూ విడుదల చేసిన హిందీ ప్రచారగీతం ఇప్పటివరకూ అత్యధిక వీక్షకులను ఆకట్టుకుంది. ఈ గీతాన్ని అప్పట్లో 47 లక్షల మంది తిలకించారు. తాజాగా, బీజేపీ ప్రచార గీతం ‘మైభీ చౌకీదార్ హూ..’ అనే గీతాన్ని 9,44,000 మంది ఇంటర్‌నెట్‌లో తిలకించారు. మరోవైపు.. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ పాటను లక్షలాది యువతీయువకులు తమ మొబైల్ రింగ్ టోన్లుగా అమర్చుకోవడం చూస్తే దీనికి ఎంతగా ఆకర్షితులవుతున్నారనేది అంచనా వేయవచ్చు. ఈ పాటకు వస్తున్న ఆదరణపై జాతీయ ఆంగ్ల చానెళ్లు ప్రత్యేక కథనాలను కూడా ప్రసారం చేశాయి.