ఏపీలో అవినీతి తారస్థాయికి చేరింది | Ravindra Babu Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

ఏపీలో అవినీతి తారస్థాయికి చేరింది

Published Tue, Feb 19 2019 3:20 AM | Last Updated on Tue, Feb 19 2019 4:17 AM

Ravindra Babu Fires On Chandrababu Govt - Sakshi

సోమవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ నివాసంలో ఎంపీ రవీంద్రబాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో అవినీతి తారాస్థాయికి చేరిందని, ఒకే ఒక్క సామాజిక వర్గానికి చంద్రబాబు సర్కార్‌ ఉపయోగపడుతోందని అమలాపురం టీడీపీ ఎంపీ రవీంద్రబాబు మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు మేలు జరగడం లేదన్నారు. విభజన నాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్‌ ఒక్క శాతం కూడా అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు లేకుండా వ్యక్తిగత అజెండాను పట్టుకొని అమరావతి, పోలవరం అంటూ గ్రాఫిక్స్‌ను సృష్టించి బస్టాండ్, ఎయిర్‌పోర్టుల్లో, ఆఖరికి ఢిల్లీలో కూడా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన రవీంద్ర బాబు, ఆయన అనుచరులతో కలసి సోమవారం ఉదయం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నివాసానికి వెళ్లి పార్టీలో చేరారు. రవీంద్రబాబుకు కండువా కప్పి జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయి రెడ్డి, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, ఇటీవలే టీడీపీ ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

జగన్‌ వల్లే రాష్ట్రాభివృద్ధి, ప్రత్యేక హోదా సాధ్యం
ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక మగధీరుడు వైఎస్‌ జగన్‌ అని రవీంద్ర బాబు కొనియాడారు. రాష్ట్రంలోని 25 మంది ఎంపీలతో రాజీనామాలు చేయిస్తే కేంద్రం దిగి వచ్చి ఏపీకి రావాల్సిన హోదా సహా మిగతా హామీలన్నీ నెర వేరుతాయని జగన్‌ చెప్పినా సీఎం చంద్రబాబు పెడచెవిన పెట్టారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి దీక్ష చేస్తే దాన్ని చంద్రబాబు హాస్యాస్పదంగా చిత్రీకరించారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి, ప్రత్యేక హోదా, దళితుల సంక్షేమం జగన్‌ వల్లే సాధ్యమని నమ్మి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు రవీంద్ర బాబు తెలిపారు. దాదాపు రూ. 3 వందల కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్‌లో భవనాలకు మరమ్మతులు చేయించుకున్న చంద్రబాబు.. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కును వదులుకొని ఏడాదిలోపే అమరావతికి పారిపోయి వచ్చారని మండిపడ్డారు. పార్లమెంట్‌లో అనర్గళంగా మాట్లాడినా, తన నియోజకవర్గానికి రైల్వేలైన్‌తో పాటు రూ. 100 కోట్ల నిధులు సాధించి పనులు చేయించినా దళితుడిననే ఒకే ఒక్క కారణంతో తన పేరు కూడా పేపర్లలో రాయకుండా చేశారని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని, ప్యాకేజీని మగ పిల్లాడితో పోల్చి ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టించారని చెప్పారు. హోదాను తుంగలో తొక్కి చివరికి ప్యాకేజీని కూడా సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీతో నాలుగున్నరేళ్లు సంసారం చేసి.. తరువాత వ్యభిచారం అని తెగదెంపులు చేసుకొని విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా కుంటుపడిందని, ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. 
వైఎస్‌ జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న రవీంద్రబాబు. చిత్రంలో అవంతి, విజయసాయిరెడ్డి తదితరులు  

ప్రజలను మభ్యపెట్టే యత్నం 
జగన్‌కు జనాల్లో ఆదరణ పెరిగిపోతుండడంతో నల్ల చొక్కా వేసుకొని తాము చేసిందే సబబు అనేలా చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ ఒడిలో కూర్చొని నవ నిర్మాణ దీక్ష, కాంగ్రెస్‌ ఒడిలో కూర్చొని ధర్మపోరాట దీక్ష అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఏపీకి చేసిన అన్యాయం అందరికీ తెలుసని, తెలంగాణలో కాంగ్రెస్‌తో పోటీ చేసిన చంద్రబాబుకు భంగపాటు ఎదురైందని గుర్తు చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి సరిపడే ముఖ్యమంత్రి కాదని, ఆయన వల్ల రాష్ట్రం బాగుపడదన్నారు. ఏపీకి కావాల్సినవన్నీ వస్తాయని, కాంగ్రెస్, బీజేపీ సహా 23 పార్టీల మెడలు వంచానని చంద్రబాబు అబద్ధాలు చెప్పారన్నారు. బాబు చెప్పే అబద్ధాలను నమ్మడం వల్లే జగన్‌తో కలిసి నడవడం ఆలస్యమైందని చెప్పారు. ఏపీకి దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో మేలు చేశారన్నారు. అదే బాటలో పయనించాలని జగన్‌ పోరాడుతున్నారని, దళితులు, బీసీలు, మైనార్టీల గురించి జగన్‌ ప్రసంగాలు వింటుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయని తెలిపారు. రాష్ట్రానికి మోక్షం కలగాలన్నా, పేదరికం పోవాలన్నా జగన్‌ అధికారంలోకి రావాలన్నారు. నాడు అంబేడ్కర్‌ చెప్పినవే ఇప్పుడు జగన్‌ చెబుతున్నారని, ఆయన వల్లే అందరికీ మేలు జరుగుతుందని రవీంద్రబాబు అభిప్రాయపడ్డారు.

బాబు కుటిల నీతి తెలుసు
చంద్రబాబు కుటిల నీతి తనకు తెలుసని, ఏ వర్గం వారు విమర్శిస్తే.. అదే వర్గం వారితో తిరిగి తిట్టించడం బాబు ఆనవాయితీ అని రవీంద్రబాబు చెప్పారు. బాబు మాటలు నమ్మి దళిత సోదరులు తనపై విమర్శల దాడి చేయవద్దని సలహా ఇచ్చారు. తన మనస్సాక్షి అంగీకరించకే తెలుగుదేశం పార్టీని వీడినట్టు వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement