లక్నో : రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని ఓడించడానికి ఎస్పీ, బీఎస్పీ కూటమి చాలా అవసరమని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఆదివారం మీడియాతో ముచ్చటించిన అఖిలేష్ పలు అంశాలను ప్రస్తావించారు. ఎస్పీ, బీఎస్పీ కూటమిపై మాట్లాడుతూ...‘ప్రస్తుత పరిస్థితిలో కూటమి అవసరం చాలా ఉంది. నేను కూటమిని నడిపించగలనని విశ్వసిస్తున్నా. బీఎస్పీతో కలిసి పనిచేయడానికి నేను అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు.
ఇద్దరిలో ఎవరు సీనియర్, జూనియర్ అనేది ముఖ్యంకాదని, ఇద్దరి లక్ష్యం బీజేపీని ఓడించడమేనని స్పష్టంచేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన గోరఖ్‌పూర్, పుల్‌పూర్ ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్ధుల గెలుపునకు మాయావతి కీలకంగా వ్యవహరించారని, మాయావతి సహకరించడంతోనే యోగి సొంత నియోజకవర్గంలో గెలుపు సాధ్యమైందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ కూటమిని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌కు 100 సీట్లు ఇస్తే వారు మాకు మిగిలిన 300 స్థానాల్లో మద్దతు తెలిపారని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ ప్రభావం, మిత్ర పక్షాల సహాయంతో 325 సీట్లతో విజయం సాధించి యోగి సీఎం కాగలిగారని అన్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ఓటమి చెందినప్పటికీ మా కూటమి మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. బీఎస్పీ అభ్యర్థిని గెలిపించడానికి మాయావతి తీవ్రంగా శ్రమించారని, ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నా.. బీజేపీ అధికారం బలంతో మోకాలోడ్డిందని విమర్శించారు. ఎస్పీ అభ్యర్థి జయా బచ్చన్ ఓటమి చెందినా... బీఎస్పీ అభ్యర్థి విజయం సాధించాలని ఆమె తనని కోరారని దానికి తాను అంగీకరించలేదని అఖిలేష్ తెలిపారు. మరో నెల రోజుల్లో మండలిలో తన పదవి కాలం ముగుస్తుండటంతో తిరిగి పోటిచేయట్లేదని ప్రకటించారు. కాగా మండలిలో ఏప్రిల్ 26న 13 మంది సభ్యులకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో బీఎస్పీకి అవకాశం ఇస్తూందా? అన్నది పార్టీ నిర్ణయిస్తుందని అఖిలేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment