రాజకీయాల్లోకి నా భార్యా, బిడ్డలు రారు | rebelstar ambarish talk about next elections | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి నా భార్యా, బిడ్డలు రారు

Published Tue, Nov 28 2017 8:08 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

rebelstar ambarish talk about next elections - Sakshi

సాక్షి, బెంగళూరు: ‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హైకమాండ్‌ మరోసారి టికెట్‌ ఇస్తే పోటీచేస్తా, అంతేకానీ నేను కాకుండా నా భార్యకానీ, కుమారుడు కానీ ఎన్నికల్లో పోటీ చేయరు’ అని ఎమ్మెల్యే, శాండల్‌వుడ్‌ రెబల్‌స్టార్‌ అంబరీష్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయ్యేందుకు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణాకు అంబరీష్‌ వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘నేను ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న విషయాన్ని హైకమాండ్‌ నిర్ణయిస్తుంది. టికెట్‌ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయమంటే చేస్తాను. లేదంటే లేదు. ప్రజలు కోరుకుంటేనే రాజకీయాల్లో ఉండడం సాధ్యమవుతుంది.’ అని అన్నారు. 

ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చురుగ్గా ఉండడం లేదు, పార్టీ మారే ఆలోచన ఉందా? ఏ పార్టీ నుంచి అయినా ఆహ్వానం అందిందా? అన్న ప్రశ్నకు అంబరీష్‌ సమాధానమిస్తూ...‘నాకు జేడీఎస్, బీజేపీ నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రతిరోజూ వారితో కలిసి మాట్లాడుతుంటాను. భోజనం చేస్తుంటాను. ఇందులో రాజకీయాలకు చోటు లేదు’ అని అన్నారు. కాగా, నటి రమ్యా మండ్య నుంచి పోటీ చేస్తానంటే తాను స్వాగతిస్తానని అంబరీష్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం రమ్యా స్టార్‌ క్యాంపెయినర్‌ అని, కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌ను జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారని అన్నారు. రమ్యాకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ టికెట్‌ ఇస్తే ఆమె తరఫున ప్రచారం చేయాల్సి ఉంటుందని అంబరీష్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement