
మాట్లాడుతున్న లక్ష్మీపార్వతి. చిత్రంలో ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి, అంధవరపు సూరిబాబు
శ్రీకాకుళం అర్బన్: అలవిగాని ఆరొందల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ఏ ఒక్కటీ నెరవేర్చని విషయాన్ని ప్రజలు గ్రహించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. అధికారం కోసం నాడు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కే కాదు ప్రజలకూ వెన్నుపోటు పొడిచిన ఘన చరిత్ర ప్రపంచంలో చంద్రబాబు ఒక్కడికే సొంతమని విమర్శించారు. వయస్సు పెరిగిన కొద్దీ మార్పు వస్తుందని ప్రజలు భ్రమ పడవద్దని, ఆయన బుద్ధి ఎప్పుడూ మారని రీతి అని వ్యంగ్యంగా అన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆమె మాట్లాడారు. చంద్రబాబు చెప్పేదొకటి, చేసేది మరొకటి అన్నారు. తొలినుంచీ ఆయన అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారని విమర్శించారు. రైతుల రుణమాఫీ రూ.84 వేల కోట్లు కాగా వడ్డీతో కలిపి రూ.లక్ష కోట్లు దాటిందన్నారు. కేవలం రూ.25 వేల కోట్లు ఇచ్చి మొత్తం అయిపోయిందన్నట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రత్యేక విభజన చట్టం ద్వారా హక్కుగా వచ్చిన ప్రత్యేక హోదాను పోలవరం ప్రాజెక్టులో కమీషన్లు కోసం తాకట్టుపెట్టిన చరిత్ర చంద్రబాబుదేనని ఆరోపించారు. పోలవరమే కాదు వంశధార నిర్వాసితులకూ తగిన న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూడున్నరేళ్ల అవినీతి పాలనతో చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని అధఃపాతాళానికి నెట్టేశారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలూ ఆయన్ను కలిసి తమ సమస్యలు మొరపెట్టుకుంటున్నారని చెప్పారు. ప్రజల సమస్యలను తీర్చడానికి అన్నివిధాలా ఆలోచించి ప్రకటించిన నవరత్నాల్లాంటి హామీలు అమలైతే ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. అందుకు జగన్ నాయకత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
చంద్రబాబు పాలన అధ్వానం: కృష్ణదాస్
♦ వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు పాలన అధ్వానంగా ఉందన్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు మాత్రం తాను నీతి, నిప్పు అని చెప్పుకుంటున్నారని, అది నేతిబీరకాయలో నెయ్యి మాదిరేనని వ్యాఖ్యానించారు. ఆయన అవినీతిపాలనకు కాలం దగ్గర పడిందని, ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
హామీలకే పరిమితం:రెడ్డి శాంతి
♦ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం ఇన్‌చార్జ్ రెడ్డి శాంతి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో గత మూడున్నరేళ్ల కాలంలో జిల్లాకు తొమ్మిదిసార్లు వచ్చినా హామీలు, శంకుస్థాపనలకే పరిమితమయ్యారని చెప్పారు. జిల్లాలో నాలుగు లక్షలకు పైగా జనాభా వలసబాట పడుతుంటే వారి సంక్షేమానికి తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. టీడీపీ నేతల మోసాలను ప్రజలు నిలదీయడానికి సిద్ధమయ్యారని చెప్పారు. స్నేహపూరిత వాతావరణంలో జరగాల్సిన ‘జన్మభూమి–మాఊరు’ గ్రామసభలను ప్రభుత్వం పోలీసు పహారా మధ్య నిర్వహించడమే దీనికి నిదర్శనమని అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మామిడి శ్రీకాంత్, శ్రీకాకుళం నగర గౌరవాధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరి, నేతలు మూకళ్ల తాతబాబు, కోరాడ రమేష్, తంగుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment