పుట్టిందిక్కడే.. నేనే సాక్ష్యం | Retired Nurse Rajamma Vavathil Says i Witness to Rahulgandhi birth | Sakshi
Sakshi News home page

పుట్టిందిక్కడే.. నేనే సాక్ష్యం

Published Sat, May 4 2019 4:24 AM | Last Updated on Sat, May 4 2019 8:52 AM

Retired Nurse Rajamma Vavathil Says i Witness to Rahulgandhi birth - Sakshi

కొచ్చి (కేరళ): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పౌరసత్వ హోదాను ఎవరూ ప్రశ్నించలేరని రిటైర్డ్‌ నర్సు రాజమ్మ వవాతిల్‌ స్పష్టం చేశారు. రాహుల్‌ 1970 జూన్‌ 19న ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో పుట్టారని, అప్పుడు విధుల్లో ఉన్న నర్సుల్లో తానూ ఒకరినని ఆమె తెలిపారు. తాను ఆ సమయంలో ట్రైనీ నర్సుగా ఉన్నట్లు చెప్పారు. రాహుల్‌ను మొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న కొద్దిమందిలో తానూ ఉన్నట్లు రాహుల్‌ పోటీ చేసిన వయనాడ్‌ నియోజకవర్గ ఓటరు కూడా అయిన 72 ఏళ్ల నర్సు రాజమ్మ చెప్పారు.

అలా ఎత్తుకోవడం ఎంతో అదృష్టంగా భావించానన్నారు. ‘బాబెంతో ముద్దుగా ఉన్నాడు. ప్రధాని ఇందిరా గాంధీ మనవడిని చూడటం నాకు, ఆ మాటకొస్తే మా అందరికీ ఎంతో ఉత్సుకత కలిగించింది. ఆ రోజు ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. సోనియాగాంధీ డెలివరీ సమయంలో ఆస్పత్రి లేబర్‌ రూమ్‌ బయట రాహుల్‌ తండ్రి రాజీవ్‌గాంధీ, బాబాయ్‌ సంజయ్‌గాంధీ వేచి ఉండటం గురించి నేను తరచూ నా కుటుంబానికి చెబుతూ ఉంటాను..’అని ఆమె ఫోన్‌లో పీటీఐకి తెలిపారు. రాహుల్‌ పౌరసత్వంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఫిర్యాదు చేయడం తనకు బాధ కలిగించిందని చెప్పారు.

భారతీయ పౌరుడిగా రాహుల్‌ గుర్తింపును ఎవరూ ప్రశ్నించలేరన్నారు. స్వామి ఆరోపణ ఆధార రహితమని చెప్పారు. రాహుల్‌ పుట్టుకకు సంబంధించిన రికార్డులన్నీ ఆస్పత్రిలో ఉంటాయన్నారు. హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వవాతిల్‌ మిలటరీ ఆస్పత్రిలో నర్సుగా చేరారు. వీఆర్‌ఎస్‌ తీసుకుని 1987లో కేరళ తిరిగివచ్చిన ఆమె కల్లూరులో స్థిరపడ్డారు. రాహుల్‌ ఈసారి వయనాడ్‌ వచ్చినప్పుడు కలుస్తాననే ఆశాభావం ఆమె వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement