మాజీ ఎమ్మెల్యే రాజేందర్ ఆధ్వర్యంలో ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి
మల్కాజిగిరి: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని మల్కాజిగిరి లోక్‌సభ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మల్కాజిగిరిలో ఆదివారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో రాంచంద్ర ఎన్‌క్లేవ్‌లో జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... మల్కాజిగిరిలో అభివృద్ధి గ్రామాల్లో కన్నా అధ్వానంగా ఉందన్నారు. నడిమి చెరువు (సఫిల్‌గూడ చెరువు) వద్ద నిల్చుంటే ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏపాటిదో తెలుస్తుందన్నారు. గతంలో ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి ఐదు సంవత్సరాల్లో ఎంపీ నుంచి మంత్రి అయ్యారే తప్ప ఏనాడూ సమస్యలపై మాట్లాడిన దాఖలాలు లేవని ఆయన ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ కుటుంబం అబద్దాలు చెబుతూ రాజకీయాలు చేస్తోందన్నారు. ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ.. రాహుల్ గాంధీ మధ్యనే ఉంటాయని ప్రాంతీయ పార్టీల ప్రమేయం తక్కువగా ఉంటుందన్నారు. ‘నేను ఓడిపోతే నాకొక్కనికే నష్టం.. గెలిస్తే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గెలిచినట్లే’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే హైదరాబాద్‌ను దేశానికి రెండవ రాజధానిగా చేసేందుకు మొదటి ప్రైవేట్ తీర్మానం ప్రవేశపెడతానన్నారు. అంబేడ్కర్ ఆనాడే ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో రెండవ రాజధాని ఉండాలని సూచించారన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అధిష్ఠానాన్ని రెండవ రాజధాని ఏర్పాటుకు ఒప్పిస్తామన్నారు. ఆకుల రాజేందర్ మాట్లాడుతూ... ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి మూడు సార్లు మల్కాజిగిరికి వచ్చినా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి నందికంటి శ్రీదర్, జి.డి.శ్రీనివాస్‌గౌడ్, నాయకులు వెంకటేష్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, విఠోబా,కుద్దూస్, ఉమేష్‌సింగ్,గపూర్, శ్యామ్, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.
అందరి మద్దతు కోరుతూ...
రేవంత్‌రెడ్డి ఉదయం సఫిల్‌గూడ ట్యాంక్ బండ్‌పై వాకర్స్‌తోపాటు లాఫింగ్ క్లబ్ సభ్యులను నియోజకవర్గ ఇన్‌చార్జి నందికంటి శ్రీధర్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. అనంతరం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మండల రాధాకృష్ణ యాదవ్‌ను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లోని ప్రముఖ న్యాయవాది ముఖీమ్, ఆయన సోదరుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫయూమ్‌ను కలిసి మద్దతు కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, గుత్తి చందు, వేణునాయుడు, ఆలి,సానాది శంకర్, పోల్కం వెంకటేష్, వెంకటేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment