సికింద్రాబాద్ బోయిన్‌పల్లి మార్కెట్‌లో మూటలు మోస్తున్న రేవంత్‌రెడ్డి
కంటోన్మెంట్: ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం 6.00 గంటలకే బోయిన్‌పల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్కెట్ యార్డుకు చేరుకున్న ఆయన హమాలీలు, రైతులు, వ్యాపారాలను పలుకరించి వచ్చే ఎన్నికల్లో తనకు ఓటేయాల్సిందిగా అభ్యర్థించారు. అనంతరం జింఖానా మైదానాన్ని సందర్శించి వాకర్స్‌తో మాట్లాడారు. మల్కాజ్‌గిరి ఎంపీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే జింఖానా, పోలో మైదానాలు కనుమరుగువుతాయన్నారు. తాను ఎంపీగా గెలిస్తే జింఖానా మైదానంలో క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తానన్నారు. ఎట్టిపరిస్థితుల్లోను ఇక్కడ సెక్రటేరియెట్ నిర్మించకుండా అడ్డుకుంటానన్నారు.
టీడీపీ నేతల మద్దతు కోసం..
కంటోన్మెంట్ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ముప్పిడి మధుకర్‌తో పాటు, పలువురు టీడీపీ నేతలను కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. బోయిన్‌పల్లిలో టీడీపీ కార్యాలయానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి ఎన్నికల వ్యూహంపై టీడీపీ నేతలతో చర్చించారు. మంత్రి మల్లారెడ్డి నివాసం పరిధిలోని బూత్‌లలోను కాంగ్రెస్‌కు గణనీయమైన ఓట్లు సాధించేలా కృషి చేయాలని సూచించారు. అంతకు ముందు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, మర్రి అమరేందర్‌రెడ్డిని కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరగా, వారు సున్నితంగా తిరస్కరించారు.
మర్రి రాఘవయ్యను కలిసిన రేవంత్‌రెడ్డి
రాంగోపాల్‌పేట్: మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి మంగళవారం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ కార్మిక సంఘం నాయకులు మర్రి రాఘవయ్యను కలిశారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరిచేలా రైల్వే ఉద్యోగులు, కార్మికుల మద్దతు కూడగట్టాలని కోరారు. రైల్వే ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment