సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ వైస్ చైర్మన్ ఎన్నికలతో కేసీఆర్‌కు మోదీకి మధ్య ఉన్న చీకటి సంబంధం బయటపడిందని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఇక్కడ మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక చేతిలో మజ్లీస్, మరో చేతిలో బీజేపీ ని పట్టుకుని తిరుగుతున్నాడని మిమర్శించారు. ఎన్నికల్లో ఎన్డీయే, యూపీయే మధ్య పోటీ జరిగితే కేసీఆర్ ఎన్డీయేకు మద్దతుకు ఇచ్చారని, దీంతో మోదీకి ఆయనకి మధ్య ఉన్నచీకటి అనుబంధం ఏంటో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బీజేపీతో పొత్తు దిశగా వెళ్తోందని ఆరోపించారు. మోదీకి, కేసీఆర్‌కి చీకట్లో ఉన్న వ్యక్తి ఎవరో కూడా నిన్నటి తమిళనాడు పర్యటనలో తేలిపోయిందన్నారు. కేసీఆర్ గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్ అధినేత, పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదాని సొంత ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లాడని, మోదీ కి కేసీఆర్ కు మధ్య అదానీ కీలకంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.
విద్యుత్ కొనుగోలులో అవినీతి
ఛత్తీస్‌గఢ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందని రేవంత్ ఆరోపించారు. మార్వా విద్యుత్ కంపనీకి అదానీ బొగ్గు సరఫరా చేస్తున్నారని, అందుకే అధిక ధరలకు కేసీఆర్ విద్యుత్ కొనుగోలు చేశారని విమర్శించారు. అదానీ కంపనీకి ఆర్ధిక ఇబ్బందులు తొలగడం కోసం కేసీఆర్ అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేశారన్నారు. తన స్వార్ధానికి తెలంగాణ ను అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తన కుటుంబ ఆస్తులు వేల కోట్లు పెంచుకోవడం కోసం విద్యుత్ సంస్థల మీద ఆర్ధిక భారం పెంచుతున్నారని ఆరోపించారు.
కేటీఆర్, హరీశ్‌లను ముందు నిలబెట్టి అడ్డుకో
ఉస్మానియాలో బడుగు, దళిత విద్యార్థులను ముందు పెట్టి రాహుల్ పర్యటన ను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్‌కు దమ్ముంటే కేటీఆర్, హరీశ్‌లకు ముందు నిలబెట్టి రాహుల్ పర్యటనను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్ నాయకుల్ని కింద పడేసి తొక్కి ఓయూ పర్యటన చేస్తారని పేర్కొన్నారు. 1200 మంది మంది బిడ్డలను చంపి సమాధుల్లో పెట్టి కేసీఆర్ పిల్లలను మాత్రం మంత్రులు, పార్లమెంట్ సీట్లల్లో కూర్చొపెట్టారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment