సాక్షి, రాజన్న సిరిసిల్ల : ‘నీ బిడ్డ బతుకమ్మ ఆడితే రూ.10 కోట్లు ఇచ్చినావు.. కవితమ్మ బతుకమ్మ ఆడక పోతే అర్ధ రూపాయి కూడా ఇవ్వవా’ అంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండి పడ్డారు. సోమవారం చందుర్తి ప్రజాచైతన్య సభకు హాజరైన రేవంత్ రెడ్డి.. వేముల వాడ కూటమి అభ్యర్ధి ఆది శ్రీనివాస్‌ను భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించాలంటూ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2006లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.1730 కోట్ల రూపాయలతో గోదావరి జలాలు తీసుకొచ్చి మీ కాళ్ళు కడగాలన్న కోరికను ఆలస్యం చేసింది ఈ చెన్నమనేని కుటుంబం కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో, కేటీఆర్ అమెరికాకు, చెన్నమనేని రమేష్ బాబు జర్మనీకి పోతారంటూ ఎద్దెవా చేశారు.
కేసీఆర్ నిన్ను నా చెప్పుతో కాదు అమర వీరుల అమ్మల చెప్పులతో కొడతానంటూ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ కోసం చనిపోయిన కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని ఏనాడైనా ఓదార్చావా అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. అమరుల రక్తం తడి ఆరకముందే తెలంగాణ ద్రోహులైన తలసాని, తుమ్మలకు మంత్రి పదవులు ఇచ్చిండు కేసీఆర్.. ఇంతటి దారిద్య్రం ఎక్కడైనా ఉంటదా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కవితమ్మ బతుకమ్మ ఆడుడు, బోనాలు ఎత్తుకునుడు తప్ప ఇంకేమైనా చేసిందా అంటూ ప్రశ్నించారు. నీ బిడ్డ బతుకమ్మ ఆడితే 10 కోట్లు ఇచ్చినావు, కవితమ్మ బతుకమ్మ ఆడక పోతే అర్ధ రూపాయి కూడా ఇవ్వవా అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరీష్ రావు, కేటీఆర్‌లకు దమ్ముంటే అమరవీరుల స్తూపం దగ్గర తనతో చర్చకు రావాలంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. రైతులు ఎవరు కూడా రుణం కట్టోద్దని కోరారు. డిసెంబర్ 11న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. అధికారంలోకి రాగానే రైతులకు రెండులక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి 30 కిలోల సన్నబియ్యం, 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. మహిళా సంఘాలకు లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తాం,10 లక్షల రివాల్వు ఫండ్ ఇస్తామని తెలిపారు. అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment