సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ మాజీ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి, టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ బుధవారం ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పార్టీ సభ్యత్వ రశీదును అందజేశారు. అనంతరం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. బీజేపీనే తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తి అని, అందుకే అందరూ బీజేపీలో చేరుతున్నారని మురళీధర్ రావు స్పష్టం చేశారు. అనంతరం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ పోలీసులను ఉసిగొల్పుతోందని ఆరోపించారు. టిఆర్ఎస్ అవినీతి పరిపాలన చేస్తోందని, కుటుంబ పాలనను ఎదుర్కొనేందుకు బీజేపీని ఆదరిస్తున్నారని తెలిపారు. దీన్ని చూసి టీఆర్ఎస్ ఓర్వలేక బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని అన్నారు.
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, యూరియా కృత్రిమ కొరతను సృష్టించి నెపాన్ని కేంద్రంపై నెట్టువేస్తున్నారని దుయ్యబట్టారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎంపీలపై కక్షతో వారి జిల్లాలలో కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యుత్, గ్రానైట్‌లలో అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. రైతులకు యూరియా ఎంత అవసరమనేది లెక్కించి కేంద్రానికి అందజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, రైతులకు అండగా నిలబడేందుకు కేంద్ర ఎరువుల శాఖ మంత్రిని కలుస్తున్నామని లక్ష్మణ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment