ravindra naik
-
TS Election 2023: అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..
సాక్షి, భద్రాద్రి: భారతీయ జనతా పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో జిల్లా నుంచి ఇల్లెందు, భద్రాచలం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడిగా ఉన్న ధారావత్ రవీంద్రనాయక్‌కు ఇల్లెందు టికెట్ దక్కింది. స్థానిక నేతలతో పాటు పలు ప్రాంతాలకు చెందిన 18 మంది దరఖాస్తు చేసుకోగా బంజారాల గాంధీగా పేరున్న రవీంద్రనాయక్‌ను ఎంపిక చేశారు. రవీంద్రనాయక్ రెండు దఫాలు ఎమ్మెల్యేగా, ఒకసారి రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా పని చేశారు. 1998లో ఖమ్మం లోక్‌సభ స్థానానికి పోటీ చేయడంతో రవీంద్రనాయక్‌కు ఉమ్మడి జిల్లాతో అనుబంధం ఏర్పడింది. బంజారాలను ఎస్టీ జాబితాలో కలిపేందుకు పోరాడిన నేతగా, ఉన్నత విద్యావంతుడిగా రవీంద్రనాయక్‌కు పేరుంది. అయితే ఆయన స్థానికేతరుడు కావడం ప్రతికూల అంశంగా చెప్పుకుంటున్నారు. ఇల్లెందు నుంచి మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య, గుగులోత్ రాంచందర్ నాయక్, హతీరాం నాయక్, పూన్యానాయక్, సురేందర్ నాయక్ బీజేపీ టికెట్ ఆశించారు. వీరందరినీ పక్కన పెట్టి స్థానికేతరుడైన రవీంద్రనాయక్‌కు కేటాయించడం గమనార్హం. రవీంద్రనాయక్ బయోడేటా.. ప్రస్తుత జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయికుంటలో 1952 ఆగస్టు 15న రవీంద్రనాయక్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు డీటీ నాయక్ – జానకీబాయి. భార్య నందానాయక్ కాగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందారు. 1972 – 76 మధ్య కాలంలో తెలంగాణ లంబాడా – ఎరుకుల యూత్ స్టూడెంట్ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. 1978లో నల్లగొండ జిల్లా దేవరకొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 1983లో మరోసారి దేవరకొండ నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989 నుంచి 92 వరకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పని చేశారు. 1998లో బీజేపీ అభ్యర్థిగా ఖమ్మం లోక్‌సభ స్థానానికి పోటీ చేసి 1.20 లక్షల ఓట్లు సాధించారు. 2004లో వరంగల్ ఎంపీగా ఎన్నికయ్యారు. భద్రాచలం అభ్యర్థిగా ధర్మా.. భద్రాచలం బీజేపీ అభ్యర్థిగా కుంజా ధర్మాకు టికెట్ కేటాయించారు. గతంలో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మా భార్య కుంజా సత్యవతి ఇటీవల మృతి చెందగా, ప్రస్తుతం ధర్మాను అభ్యర్థిగా ప్రకటించారు. ఇంటర్ వరకు చదివిన ధర్మా 2008 వరకు సీపీఎంలో కీలక నేతగా పని చేశారు. 2009లో భార్య సత్యవతితో కలిసి కాంగ్రెస్‌లో చేరి పలు పదవులు చేపట్టారు. 2010 నుంచి 2012 వరకు వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పని చేసి, 2012లో కాంగ్రెస్‌లో చేరి రెండేళ్ల పాటు డీసీసీ సభ్యుడిగా, 2014–17వరకు భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేశారు. 2017లో బీజేపీలో చేరిన ధర్మా కొద్దిరోజులు జిల్లా ఉపాధ్యక్షుడిగా, ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్‌గా పనిచేస్తున్నారు. -
ఎంపీ సోయం బాపూరావు క్షమాపణలు చెప్పాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: లంబాడాల రిజర్వేషన్లపై మాట్లాడుతున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు. బాపూరావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కును పార్లమెంట్ సభ్యుడైన ఆయన ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. ‘రిజర్వేషన్లపై సోయం మాట్లాడటం ఆయన వ్యక్తిగతం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టత ఇచ్చారు. అసలు బాపూరావు వర్గం ప్రాబల్యం రెండు జిల్లాల్లోనే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. తెలంగాణలో లంబాడాలు 90 నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరు’అని పేర్కొన్నారు. ఎల్బీనగర్ గిరిజన మహిళ అంశంపై శనివారం ఢిల్లీలో తెలంగాణకు చెందిన గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రవీంద్ర నాయక్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారని తెలిపారు. తెలంగాణలో శాంతి భద్రతలు లేవని, అగ్రవర్ణాలకు ఒక న్యాయం, బడుగులకు ఒకరకమైన న్యాయం దక్కుతోందని రవీంద్ర నాయక్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలోని మహిళలపై గిరిజన మహిళపై జరిగిన విధంగా అత్యాచారాలు జరిగితే నష్టపరిహారం తీసుకొని వదిలేస్తారా? అని ప్రశ్నించారు. గిరిజనుల మాన, ప్రాణాలకు కేసీఆర్ ప్రభుత్వం వెలకట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గిరిజన మహిళ లక్షి్మకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగబోదని రవీంద్ర నాయక్ తేల్చిచెప్పారు. -
ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం నాటకాలు
పంజగుట్ట (హైదరాబాద్): సీఎం కేసీఆర్ అవినీతి బయటపడుతుండడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు బీఆర్ఎస్ పార్టీ అని.. ఎమ్మెల్యేల కొనుగోలు.. అని కొత్త నాటకాలకు తెర లేపుతున్నారని మాజీ ఎంపీ రవీందర్ నాయక్ ఎద్దేవా చేశారు. ఆయన సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ .. ఎన్నో ఆకాంక్షలతో నెరవేర్చుకున్న తెలంగాణ ఒక వ్యక్తి కుటుంబం చేతిలో బందీ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల బడ్జెట్ రూ.15 లక్షల కోట్లు, రుణాలు మరో రూ.5 లక్షల కోట్లు.. మొత్తం రూ.20 లక్షల కోట్లు కాగా.. ప్రజలకు పథకాల ద్వారా అందజేసింది కేవలం రూ.50 వేల కోట్లని ఆయన స్పష్టం చేశారు. మిగిలిన దాంట్లో సింహభాగం సీఎం కుటుంబానికే వెళ్లిందని.. దీనిపై కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశార -
మంథని లిఫ్ట్ పనుల్లో అలసత్వం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: మంథని లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా సాగునీరు అందిస్తామని ప్రభుత్వం పదేపదే చెప్తున్నా పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు రవీంద్రనాయక్, విఠల్‌రెడ్డి, అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సాగునీటి గురిం చిన చర్చ జరిగింది. జీవో 111కు సంబంధించి హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల పరీవాహక ప్రాంతంపై కమిటీ అక్బరుద్దీన్ వివరాలు కోరారు. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెరువుల పరిస్థితి, మిషన్ కాకతీయలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు తీసుకున్న చర్యల గురించి పీఏసీ చర్చించింది. సాగునీటి ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ సరిగా లేదంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కడెం, నాగార్జునసాగర్, సరళాసాగర్, మూసీ ప్రాజె క్టు మరమ్మతు, నిర్వహణ వివరాలను కమిటీ చైర్మన్ కోరారు. కాగా కాళేళ్వరం ప్రాజెక్టు లాగా ఇతర ప్రాజెక్టుల పనులు త్వరితగతిన ఎందుకు పూర్తి చేయడం లేదని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఏఐబీపీ కింద ఎస్ఆర్ఎస్పీ రెండో దశ, దేవాదుల వరద కాలువ పనుల్లో ఆలస్యం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రశ్నిం చారు. కాగా, హుజూరాబాద్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ ఎవరిని నిర్ణయించినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని శ్రీధర్‌బాబు అన్నారు. -
బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్ర నాయక్
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ మాజీ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి, టీఆర్ఎస్ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ బుధవారం ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పార్టీ సభ్యత్వ రశీదును అందజేశారు. అనంతరం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. బీజేపీనే తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తి అని, అందుకే అందరూ బీజేపీలో చేరుతున్నారని మురళీధర్ రావు స్పష్టం చేశారు. అనంతరం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ పోలీసులను ఉసిగొల్పుతోందని ఆరోపించారు. టిఆర్ఎస్ అవినీతి పరిపాలన చేస్తోందని, కుటుంబ పాలనను ఎదుర్కొనేందుకు బీజేపీని ఆదరిస్తున్నారని తెలిపారు. దీన్ని చూసి టీఆర్ఎస్ ఓర్వలేక బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని అన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, యూరియా కృత్రిమ కొరతను సృష్టించి నెపాన్ని కేంద్రంపై నెట్టువేస్తున్నారని దుయ్యబట్టారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎంపీలపై కక్షతో వారి జిల్లాలలో కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యుత్, గ్రానైట్లలో అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. రైతులకు యూరియా ఎంత అవసరమనేది లెక్కించి కేంద్రానికి అందజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, రైతులకు అండగా నిలబడేందుకు కేంద్ర ఎరువుల శాఖ మంత్రిని కలుస్తున్నామని లక్ష్మణ్ పేర్కొన్నారు. -
తండాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చాలి
పాలకవీడు (హుజూర్నగర్) : గ్రామపంచాయతీలుగా మార్చిన తండాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చాలని మాజీ మంత్రి రవీంద్రనాయక్ అన్నారు. మండలంలోని జాన్‌పహాడ్ దర్గా వద్ద జేపీఎస్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 72ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 10కోట్ల మంది గిరిజనులు ఉన్నారని వీరంతా గోర్బోలీ భాష మాట్లాడుతున్నారన్నారు. అలాగే రాష్ట్రంలో 40లక్షల మంది గిరిజనులు ఉన్నారని అన్నారు. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో గిరిజనులను ఎస్టీలుగా గుర్తించారని మిగిలిన రాష్ట్రాల్లో మాత్రంషెడ్యూల్ కులాలుగా పరిగణిస్తున్నారన్నారు. దేశంలో 20శాతం ఉన్న ఇతర ఆదివాసీ కులాలను 80శాతం ఉన్న గిరిజనుల్లో వీరిని కలపడం వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై సుదీర్ఘ పోరాటం చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీని వెంటనే ప్రారంబించాలని కోరారు. గిరిజన యువకులకు వెంటనే నిరుద్యోగ భృతి అందించి వారు నిస్పృహలకు లోను కాకుండా చూడాలన్నారు. నేటి నుంచి తలపెట్టిన గిరిజన చైతన్య యాత్రను వాయిదా వేస్తున్నట్లు తిరిగి ఆగస్టు 15న ఈ గిరిజన ప్రజాచైతన్య యాత్రను పాలకవీడు మండలం జాన్‌పహాడ్ దర్గా నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో గిరిజన సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు నాగునాయక్, మధునాయక్, పీకేనాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారావు, హరియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన జేఏసీ నిరసన
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించి నాలుగేళ్లు గడిచినా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభను వ్యతిరేకిస్తూ ఆదివారం నిరసన తెలిపారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో దళిత గిరిజనులు దగాపడ్డారని అన్నారు. 12 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోవడంతో విద్యా, ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తే అణచివేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం రానున్న ఎన్నికలకు ముందే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన జేఏసీ కన్వీనర్ గణేశ్ నాయక్, జేఏసీ నాయకులు టీక్యా నాయక్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. పలువురు నాయకుల అరెస్ట్.. ప్రగతి నివేదన సభను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న గిరిజన జేఏసీ కన్వీనర్ గణేశ్‌నాయక్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులను సైతం వాహనం ఎక్కించేందుకు పోలీసులు యత్నించారు. సీఐ భీంరెడ్డి, ఎస్సైలు ఆంజనేయులు, రంగారెడ్డితోపాటు ఇతర సిబ్బంది నిరసన తెలుపుతున్న వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి
సాక్షి, హైదరాబాద్: కులాల మధ్య చిచ్చు పెట్టే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేయా లని తెలంగాణ గిరిజన జేఏసీ డిమాండ్ చేసింది. గోండు, కోయ, లంబాడీల మధ్య ఘర్షణలను సృష్టిస్తూ వారిని అభద్రతాభావంలోకి నెట్టిందని గిరిజన జేఏసీ నేతలు రవీంద్రనాయక్, ఎం.సూర్యనాయక్, శంకర్‌నాయక్, అంగోతు గణేశ్‌నాయక్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజనుల్లో ప్రభుత్వం భయాం దోళనలను సృష్టిస్తోందని, ఇటువంటి ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని తెలిపారు. కన్నన్ వంటి ఐఏఎస్ అధికారులు, కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్రకు పాల్పడటం దారుణమన్నారు. లంబాడీలపై సాగుతున్న కుట్రలను అడ్డుకోవడంలో టీఆర్ఎస్కు చెందిన గిరిజన ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎస్టీల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచి గోండు, కోయ కులాలకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. అటవీ కార్పొరేషన్ పదవిని గోండు, కోయలకు ఇవ్వాలని కోరారు. గిరిజనుల మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పర్యటించి వారి మధ్య ఐక్యత కోసం కృషి చేయాలన్నారు. -
నిజాం తరహాలోనే కేసీఆర్ పాలన
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన నిజాం పాలనను గుర్తుకు తెస్తోందని మాజీ మంత్రి డి.రవీంద్రనాయక్ అన్నారు. ప్రగతిభవన్ లాంటి గడీని నిర్మించుకుని పెత్తందారీ వ్యవస్థను కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. లంబాడీలు ఓటు అనే ఆయుధంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. గిరిజన సమాఖ్య భవన్లో తెలంగాణ రాష్ట్ర గిరిజన సమితి ఆధ్వర్యంలో గిరిజన తండా పంచాయతీ చట్టాలపై శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన తండాలన్నింటినీ పంచాయతీలుగా మారుస్తున్నామని, ఇకనుంచి లంబాడీలు కోటీశ్వరులు కావా లని కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. అనంతరం రెండు రోజులకే రాష్ట్ర ఎన్నికల సంఘం పాత పంచాయతీలకే ఎన్నికలు నిర్వహిస్తుందని, కొత్త పంచాయితీలకు ఎన్నికలు జరపదని చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇదంతా కేసీఆర్ ఎత్తుగడలో భాగమే అని ఆయన విమర్శించారు. లంబాడీలకు గోండ్రు, కోయలకు మధ్య చిచ్చు పెట్టేందుకు ఇవన్నీ చేస్తున్నారని దుయ్యబట్టారు. సబ్బండ జాతుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. లంబాడీ హక్కుల పోరాట సమితి సీనియర్ నాయకుడు ఆర్.శంకర్‌నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సూర్యానాయక్, ఎం.ధర్మనాయక్, ఆర్.శంకర్‌నాయక్, ఎం.బాలునాయక్ పాల్గొన్నారు. -
‘రాజ్యసభ’ బరిలో కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీలోకి దించాలని కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్పీ) నిర్ణయించింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ శాసనసభా పక్షం శుక్రవారం సమావేశమైంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్సీ కుంతియా, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 12వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ వైఖరిపైనా సమావేశంలో చర్చ జరిగింది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో పెట్టడంపై చర్చించారు. అయితే పోటీ పెట్టడం వల్ల గెలిచే పరిస్థితి లేదని, పోటీలోకి దిగడం అనవసరమని కొందరు వాదించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చెక్ పెట్టినట్టుగా ఉంటుందని, టీఆర్ఎస్ ఫిరాయింపు రాజకీయాలను ఎండగట్టడానికి ఉపయోగపడుతుందనే నిర్ణయానికి సీఎల్పీ వచ్చింది. ఈ నేపథ్యంలో సరైన అభ్యర్థిని పోటీలోకి దించాలని నిర్ణయించింది. వ్యతిరేకతను తప్పుదారి పట్టించేందుకే.. సీఎం కేసీఆర్ వైఫల్యాలను, టీఆర్ఎస్ అసమర్థతను, ప్రజల్లో వ్యతిరేకతను తప్పుదారి పట్టించడానికే మూడో కూటమి పేరుతో నాటకం ఆడుతున్నారని సంపత్ విమర్శించారు. దళితులపై జరిగే దాడులు, రైతు సమస్యలు, శాంతి భద్రతల సమస్యలు, రాజకీయ హత్యలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా వెల్లడించారు. మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు ఇవ్వడం లేదని, దీనిపై పోరాడతామన్నారు. రవీంద్రనాయక్ లేదా అజహరుద్దీన్ రాజ్యసభకు అభ్యర్థిని బరిలో దించాలని నిర్ణయించిన కాంగ్రెస్ దీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. రాజ్యసభ అభ్యర్థి ఎంపిక అధికారాన్ని ఉత్తమ్, జానారెడ్డి, కుంతియాకు సీఎల్పీ అప్పగించింది. అభ్యర్థి ఎవరనేది తేలిన తర్వాత, నామినేషన్ తేదీని ప్రకటిస్తారు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మిగిలిన పార్టీల మద్దతు కోరాలని నిర్ణయించారు. ఎస్సీ లేదా ఎస్టీలకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు అభ్యర్థిగా ఉంటే ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం పార్టీలో ఉంది. మాజీ ఎంపీ రవీంద్రనాయక్ పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. మాజీ ఎంపీ, క్రికెటర్ అజహరుద్దీన్, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు పార్టీ నేతలు వెల్లడించారు. 25 అంశాలపై పోరాటం.. సీఎల్పీ సమావేశం వివరాలను కాంగ్రెస్ విప్ ఎస్ఏ సంపత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఇది టీఆర్ఎస్కు ఆఖరి బడ్జెట్ అని, ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో తేల్చుకుంటామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న 25 అంశాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ టీఆర్ఎస్కు అనుంబంధ సంస్థగా మారిందన్నారు. అధికార పార్టీ హత్యా రాజకీయాలపై చర్చించామన్నారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలు, హామీల అమలులో వైఫల్యంపై శాసనసభలో నిలదీస్తామన్నారు. ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు అమలుపై పోరాడతామన్నారు. నిరుద్యోగ సమస్యలు, ఉపాధి కల్పనపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మాదిగ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా సంపత్ వెల్లడించారు. -
గిరిజనులను మోసగిస్తున్న సీఎం కేసీఆర్: రవీంద్రనాయక్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో లంబాడీలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ డి.రవీంద్రనాయక్ శనివారం విమర్శించారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు, గిరిజనులు, లంబాడీలు నివసించే తాండా లు, గూడేలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి అభివృద్ధి చేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తాండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి, అభివృద్ధి కోసం రూ.5 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రాంతంలో గిరిజనుల సంస్కృతికి ఎలాంటి హాని జరగకుండా అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. -
సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పండి
సాక్షి, హైదరాబాద్: లంబాడీలు, ఆదివాసీల మధ్య చిచ్చు పెట్టిన సీఎం కేసీఆర్‌కు గిరిజనులు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎంపీ డి.రవీంద్రనాయక్ సోమవారం కోరారు. మోసపూరిత ప్రకటనలతో గిరిజనులను మభ్యపెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎవరూ మద్దతు ఇవ్వొద్దని సూచించారు. గిరిజనుల మధ్య మారణకాండకు కారణమైన టీఆర్ఎస్ను ఆ పార్టీ ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు ప్రశ్నించటం లేదని నిలదీశారు. వారు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమ్మక్క సారలమ్మ జాతరలో సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. తండాల్లో మౌలిక వసతులు కల్పించకుండా ఒట్టి మాటలు చెబితే ప్రయోజనం ఉండదన్నారు. -
కేసీఆర్ అవినీతి పవన్‌కు కనిపించ లేదా?
సాక్షి, హైదరాబాద్: అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. వాటి మీద అసలు మాట్లాడటమే లేదని కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు విమర్శించారు. ప్రాణహిత ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి సీఎం కేసీఆర్ రూ.38 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు. గాంధీభవన్‌లో బుధవారం వీహెచ్ విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాసిచ్చిన స్పీచ్‌నే పవన్ చదివారని ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకుని కేసీఆర్‌కు భజన చేయడం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ కోసం పోరాడిన కోదండరాం, మంద కృçష్ణల అక్రమ అరెస్టులు పవన్‌కు కనపడలేదా అని ప్రశ్నించారు. ఆదివాసీల సమస్యల పరిష్కారంలో విఫలం మాజీ ఎంపీ రవీంద్రనాయక్ సాక్షి, హైదరాబాద్: ఆదివాసీలు, లంబాడీల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ విమర్శించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆదివాసీలను లంబాడీలపైకి కొన్ని శక్తులు ఉసిగొల్పుతున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగానే లంబాడీలను ఎస్టీల్లో చేర్చారన్నారు. దీనిపై త్వరలోనే రాష్ట్రపతికి మెమోరాండం అందజేయనున్నట్లు రవీంద్ర నాయక్ చెప్పారు. -
గిరిజనులు కొట్టుకుంటుంటే కేసీఆర్ సంబరాలు
సాక్షి, హైదరాబాద్: గిరిజనులైన ఆదివాసీలు, లంబాడీలు పరస్పరం కొట్టుకుని చస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నీరో చక్రవర్తిలా వ్యవహారస్తూ సంబరాల్లో మునిగితేలుతున్నాడని మాజీ ఎంపీ డి.రవీంద్రనాయక్ విమర్శించారు. గాంధీభవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయకపోవడమే గిరిజనుల్లో చిచ్చుకు ప్రధాన కారణమని అన్నారు. ఆదిలాబాద్‌లో జరుగుతున్న సంఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్టీల మధ్య చిచ్చుపెట్టిన కేసీఆర్ కపటనాటకాన్ని గిరిజనులు గుర్తించాలని రవీంద్రనాయక్ కోరారు. -
ఎస్టీల గొడవను పరిష్కరించరే?
సాక్షి, హైదరాబాద్: ఎస్టీల్లోని ఆదివాసీలు, లంబాడీల మధ్య గొడవను ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడం లేదని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ప్రశ్నించారు. గాంధీభవన్‌లో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడుతూ.. లంబాడీలతో తమకు నష్టం జరుగు తోందని ఆదివాసీలు, గోండులు, కోయలు అపోహతో మాట్లాడుతున్నారన్నారు. రిజర్వేషన్లలో లంబాడీలు, ఆదివాసీల మధ్య పోరు తీవ్రం కాకముందే ఈ గొడవను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. ఇది శాంతిభద్రతల సమస్యగా మారకముందే సీఎం, గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి గిరిజనుల మధ్య గొడవను ప్రభుత్వం పెంచి పోషిస్తోందని ఆరోపించారు. గిరిజనుల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీలకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ మామ, సీఎం కేసీఆర్ వియ్యంకుడు ఎస్టీ సర్టిఫికెట్తో ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని రవీంద్రనాయక్ ప్రశ్నించారు. -
గిరిజనుల మధ్య చిచ్చుపై మౌనమేల?
సాక్షి, హైదరాబాద్: గిరిజన తెగల మధ్య అదృశ్య శక్తులు చిచ్చు పెట్టాయని, సామ రస్యంగా సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని మాజీ ఎంపీ డి.రవీంద్రనాయక్ విమర్శించారు. గాంధీ భవన్లో గురువారం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 11 గిరిజన తెగలున్నాయని, వాటిలో లంబాడా, ఎరు కల తెగలు కలిపి 80% ఉంటారని చెప్పా రు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గిరిజనుల మధ్య కొట్లాట శాంతిభద్రతల సమస్యగా మారిందన్నారు. దీనిపై ప్రభు త్వం ఉదాసీనంగా ఎందుకున్నదో అర్థం కావడం లేదన్నారు. ఈ సమస్యకు గల కారణం, కారకులు ఎవరో గుర్తించేందుకు గవర్నర్ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. -
‘సీఎం కేసీఆర్ మాటల మాంత్రికుడు’
► ప్రచారం తప్ప చేసింది శూన్యం ► ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు ► మాజీ ఎంపీ, టీపీసీసీ అధికార ప్రతినిధి రవీంద్రనాయక్ కొడకండ్లః పిట్ట కధలతో బూరడి కొట్టిస్తూ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ మాటల మాంత్రికునిగా సీఎం కేసీఆర్ ఖ్యాతి గడించాడని మాజీ ఎంపీ, టీపీసీసీ అధికార ప్రతినిధి ధరావత్ రవీంద్రనాయక్ విమర్శించారు. ఆదివారం కొడకండ్ల శివారులో జరిగిన వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. సమైక్య పాలనలో నిధులు, నీళ్లు, వనరుల దొపిడికి గురైన తెలంగాణలోని సబ్బండ వర్గాల వారు తెలంగాణ వస్తే తమ ఆశలు నేరవేరుతాయని వినూత్న తరహాలో ఎన్నో ఉద్యమాలు చేసారని గుర్తు చేశారు. భూపోరాట యోధుడు జాటోత్ ఠానునాయక్ నుంచి ప్రవీణ్‌కుమార్‌నాయక్, శ్రీకాంతచారి లాంటి అనేకమంది తమ ప్రాణాలను త్యాగం చేసి తెలంగాణను సాధించుకొంటే ప్రజల ఆశలు ఆడియాసలు చేస్తూ కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నాడని విమర్శించారు. సబ్బండ జాతుల పోరాటంతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబ అధికారాన్ని అనుభవిస్తూ ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తూ పరిపాలన చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడేళ్లలో వందలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే కనీసం ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించలేదన్నారు. దళిత, గిరజనులకు మూడెకరాల భూమి ఆటకెక్కించారని, ఇంటికో ఉద్యోగం, డబుల్బెడ్రూం ఇళ్ల ఊసేలేదని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్, తండాలు గ్రామ పంచాయతీలు వంటి హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని రవీంద్రనాయక్ దుయ్యబట్టారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వడం లేదని, ప్రశ్నించే వారిపై ఎదురుదాడి సంస్కృతిని అవలంభిస్తున్నారని తెలిపారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్ పేరుతో పనులు చేపట్టకుండా కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కై మోసం చేస్తుందని, హరితహారం పేరిట రూ.వెయ్యి కోట్ల దుర్వినియోగంతో పాటు కృష్ణా, గోదావరి పుష్కరాల పేరిట మరో 1200 కోట్ల నిధులు వృధా చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్టాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను కేసీఆర్ విమర్శించడం సిగ్గుచేటన్నారు. ప్రచార ఆర్భాటాలు మాటల గారడితో బూరడి కొట్టిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పేందుకై తెలంగాణ ప్రజలు సంసిద్దులై ఉన్నారని అన్నారు. కులవృత్తులకు సంబంధించిన కార్పోరేషన్లకు బడ్జేట్‌లో నిధులు కేటాయించకుండా గొర్రెలు, బర్రెలు, పందుల పధకాలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.40 లక్షల ఉద్యోగాలు భర్తి చేయకుండా నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తుందని తెలిపారు. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు క్యాబినేట్లో స్థానం కల్పించకుండా మహిళలను అవమానపరుస్తూ కేసీఆర్ మోసం చేస్తున్నాడని రవీంద్రనాయక్ మండిపడ్డారు. తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో తండాలు అభివృద్ది చేందే అవకాశం ఉన్నా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ మాయమాటలకు మోస పోయిన ప్రజలు మరోసారి మోసపోయే దుస్థితిలో లేరని సమయం కోసం వేచిచూస్తున్నారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో నంగారాభేరి నాయకులు భూక్య శ్రీనునాయక్, శంకర్‌రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ వాటా కోసం పోరాడుదాం: ఎమ్మెల్యే తాటి
హైదరాబాద్: తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా కోసం పోరాడదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు- శాసనసభలో అన్నారు. ఈ విషయంలో తెలంగాణ బిడ్డగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన వాటా రావాల్సిందేనని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యపై ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో తీవ్రంగా ఉన్న విద్యుత్ సమస్యను పరిష్కారించాల్సిన అవసరముందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. రాష్ట్రం విడపోవడానికి అప్పటి ప్రభుత్వాలే కారణమని ఆయన విమర్శించారు.