సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీలోకి దించాలని కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్పీ) నిర్ణయించింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ శాసనసభా పక్షం శుక్రవారం సమావేశమైంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆర్‌సీ కుంతియా, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 12వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ వైఖరిపైనా సమావేశంలో చర్చ జరిగింది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో పెట్టడంపై చర్చించారు. అయితే పోటీ పెట్టడం వల్ల గెలిచే పరిస్థితి లేదని, పోటీలోకి దిగడం అనవసరమని కొందరు వాదించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చెక్ పెట్టినట్టుగా ఉంటుందని, టీఆర్‌ఎస్ ఫిరాయింపు రాజకీయాలను ఎండగట్టడానికి ఉపయోగపడుతుందనే నిర్ణయానికి సీఎల్పీ వచ్చింది. ఈ నేపథ్యంలో సరైన అభ్యర్థిని పోటీలోకి దించాలని నిర్ణయించింది.
వ్యతిరేకతను తప్పుదారి పట్టించేందుకే..
సీఎం కేసీఆర్ వైఫల్యాలను, టీఆర్‌ఎస్ అసమర్థతను, ప్రజల్లో వ్యతిరేకతను తప్పుదారి పట్టించడానికే మూడో కూటమి పేరుతో నాటకం ఆడుతున్నారని సంపత్ విమర్శించారు. దళితులపై జరిగే దాడులు, రైతు సమస్యలు, శాంతి భద్రతల సమస్యలు, రాజకీయ హత్యలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా వెల్లడించారు. మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు ఇవ్వడం లేదని, దీనిపై పోరాడతామన్నారు.
రవీంద్రనాయక్ లేదా అజహరుద్దీన్
రాజ్యసభకు అభ్యర్థిని బరిలో దించాలని నిర్ణయించిన కాంగ్రెస్ దీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. రాజ్యసభ అభ్యర్థి ఎంపిక అధికారాన్ని ఉత్తమ్, జానారెడ్డి, కుంతియాకు సీఎల్పీ అప్పగించింది. అభ్యర్థి ఎవరనేది తేలిన తర్వాత, నామినేషన్ తేదీని ప్రకటిస్తారు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మిగిలిన పార్టీల మద్దతు కోరాలని నిర్ణయించారు. ఎస్సీ లేదా ఎస్టీలకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు అభ్యర్థిగా ఉంటే ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం పార్టీలో ఉంది. మాజీ ఎంపీ రవీంద్రనాయక్ పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. మాజీ ఎంపీ, క్రికెటర్ అజహరుద్దీన్, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు పార్టీ నేతలు వెల్లడించారు.
25 అంశాలపై పోరాటం..
సీఎల్పీ సమావేశం వివరాలను కాంగ్రెస్ విప్ ఎస్‌ఏ సంపత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఇది టీఆర్‌ఎస్‌కు ఆఖరి బడ్జెట్ అని, ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో తేల్చుకుంటామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న 25 అంశాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ టీఆర్‌ఎస్‌కు అనుంబంధ సంస్థగా మారిందన్నారు. అధికార పార్టీ హత్యా రాజకీయాలపై చర్చించామన్నారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలు, హామీల అమలులో వైఫల్యంపై శాసనసభలో నిలదీస్తామన్నారు. ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు అమలుపై పోరాడతామన్నారు. నిరుద్యోగ సమస్యలు, ఉపాధి కల్పనపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మాదిగ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా సంపత్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment