
సాక్షి, హైదరాబాద్: అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. వాటి మీద అసలు మాట్లాడటమే లేదని కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు విమర్శించారు. ప్రాణహిత ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి సీఎం కేసీఆర్ రూ.38 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు. గాంధీభవన్‌లో బుధవారం వీహెచ్ విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాసిచ్చిన స్పీచ్‌నే పవన్ చదివారని ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకుని కేసీఆర్‌కు భజన చేయడం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ కోసం పోరాడిన కోదండరాం, మంద కృçష్ణల అక్రమ అరెస్టులు పవన్‌కు కనపడలేదా అని ప్రశ్నించారు.
ఆదివాసీల సమస్యల పరిష్కారంలో విఫలం
మాజీ ఎంపీ రవీంద్రనాయక్
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీలు, లంబాడీల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ విమర్శించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆదివాసీలను లంబాడీలపైకి కొన్ని శక్తులు ఉసిగొల్పుతున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగానే లంబాడీలను ఎస్టీల్లో చేర్చారన్నారు. దీనిపై త్వరలోనే రాష్ట్రపతికి మెమోరాండం అందజేయనున్నట్లు రవీంద్ర నాయక్ చెప్పారు.