హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన నిజాం పాలనను గుర్తుకు తెస్తోందని మాజీ మంత్రి డి.రవీంద్రనాయక్ అన్నారు. ప్రగతిభవన్ లాంటి గడీని నిర్మించుకుని పెత్తందారీ వ్యవస్థను కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. లంబాడీలు ఓటు అనే ఆయుధంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. గిరిజన సమాఖ్య భవన్‌లో తెలంగాణ రాష్ట్ర గిరిజన సమితి ఆధ్వర్యంలో గిరిజన తండా పంచాయతీ చట్టాలపై శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన తండాలన్నింటినీ పంచాయతీలుగా మారుస్తున్నామని, ఇకనుంచి లంబాడీలు కోటీశ్వరులు కావా లని కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. అనంతరం రెండు రోజులకే రాష్ట్ర ఎన్నికల సంఘం పాత పంచాయతీలకే ఎన్నికలు నిర్వహిస్తుందని, కొత్త పంచాయితీలకు ఎన్నికలు జరపదని చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇదంతా కేసీఆర్ ఎత్తుగడలో భాగమే అని ఆయన విమర్శించారు.
లంబాడీలకు గోండ్రు, కోయలకు మధ్య చిచ్చు పెట్టేందుకు ఇవన్నీ చేస్తున్నారని దుయ్యబట్టారు. సబ్బండ జాతుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. లంబాడీ హక్కుల పోరాట సమితి సీనియర్ నాయకుడు ఆర్.శంకర్‌నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సూర్యానాయక్, ఎం.ధర్మనాయక్, ఆర్.శంకర్‌నాయక్, ఎం.బాలునాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment