ఢిల్లీ: కేంద్ర మోటారు వాహనాల చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయనని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడెలా అమలు చేస్తారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. బీజేపీ హైకమాండ్ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేస్తామని సీఎం కేసీఆర్ కార్మికులను భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ ఆర్టీసీ సంస్థకు లాభం చేకూరిస్తే.. తాము ఎంత మాత్రం వ్యతిరేకం కాదన్నారు.
పోలీసులు తమ బాధ్యత విస్మరించి బీజేపీ ఎంపీ బండి సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించారని అసహనం వ్యక్తం చేశారు. హిందూ మతాచారాలకు విరుద్ధంగా మఫ్టీలో పోలీసులు డ్రైవర్ బాబు శవాన్ని ఎత్తుకెళ్లారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ తన వ్యాఖ్యలతో పుండు మీద కారం చల్లుతున్నారని విమర్శించారు. హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వానికి మొట్టి కాయలు వేసినా.. ముఖ్యమంత్రి వాటిని పట్టించుకోవడం లేదని హేళన చేశారు.
తెలంగాణలో పరిపాలన సంక్షోభంలో ఉందని, గవర్నర్ జోక్యం చేసుకుని అధికారులతో మాట్లాడినా కేసీఆర్‌కు సోయి లేదన్నారు. కోర్టుకు తప్పుడు నివేదికలు ఇచ్చి అధికారులు బలవుతున్నారని బాధ పడ్డారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఫలితాలు నిరుత్సాహపరిచినా.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైనే తాము దృష్టి సారించామని అన్నారు. డెంగీ జ్వరాలు విజృంభిస్తున్న పట్టించుకోవడం లేదని.. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతు బంధు, రుణ మాఫీ, నిరుద్యోగ భృతిని కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment