సాక్షి, న్యూఢిల్లీ : తమ ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై టీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏర్పడ్డ యూరియా కొరత విషయంపై కేంద్ర మంత్రి సదానంద గౌడతో ఫోన్లో మాట్లాడిన లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవసరానికి మించి తెలంగాణకు యూరియాను కేటాయించిదని, దీనిని ఖరీఫ్ సీజన్‌కు ముందే రాష్ట్రానికి పంపిదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి యూరియాను స్టోరేజీ చేసుకోవడానికి సరిగా గోదాములు లేక ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు కేంద్ర మంత్రి రిపోర్ట్ ఇచ్చారని వెల్లడించారు.
రాష్ట్రంలో కుటుంబ పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయంగా బీజేపీ ఎదుగుతుందని, టీఆర్‌ఎస్ అవినీతిపై బీజేపీ ప్రజా పోరాటం చేస్తుందని లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అవుతోందని అభిప్రాయపడ్డారు. రాష్టంలోని ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నా, కేసీఆర్ ఫామ్ హౌజ్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు కానివ్వడం లేదని, రైతు రుణమాఫీని ఇంత వరకు అమలు చెయ్యలేదని ఆరోపించారు. రైతు బంధు పథకం సరిగా అమలు కావడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చారని, రాష్ట్ర పరిస్థితిపై సమీక్షలు లేవని మండిపడ్డారు. రాష్ట్రంలో మంత్రులకు స్వేచ్ఛ లేదని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment