పట్నా : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, బిహార్ సీఎం నితీష్ కుమార్ ఎపిసోడ్ ముగియక ముందే ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్‌ను కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు తమవైపుకు తప్పికునేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగానే బిహార్‌లో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ ఆహ్వానం పంపింది. ప్రశాంత్ కిషోర్‌ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. పలువురు ఆర్జేడీ నేతలూ ఆయన్ని సంప్రదించేందుకు మంతనాలు చేస్తున్నారని సమాచారం. ఇదిలావుండగా.. తేజ్ ప్రతాప్ ప్రకటన ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. (ప్రశాంత్ కిషోర్, నితీష్ మధ్య బయటపడ్డ విభేదాలు..!)
మరోవైపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో ఆయన చేరతారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుపై ఇప్పటికిప్పుడు తానేమీ మాట్లాడనని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 11న పట్నాలో జరిగే సమావేశంలో తన ప్రణాళికలు గురించి వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు. కాగా నితీష్, ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకోవడంతో.. ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఎన్డీయేలో జేడీయూ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశాంత్ వ్యవరిస్తున్నారు. బిహార్ అసెంబ్లీకి సమయం దగ్గర పడుతుండంతో ఇరుపార్టీల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉందని భావించిన ఇరు పార్టీల నేతలు ముందస్తు జాగ్రత్తగా ఆయన్ని తప్పించినట్లు తెలుస్తోంది. (పీకే బహిష్కరణ.. మీరు మళ్లీ సీఎం కావాలి!)
Comments
Please login to add a commentAdd a comment