సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఓవైపు కొనసాగుతున్న వేళ.. సర్వేలన్నీ శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్‌కు అనుకూలంగా రావటం ఆసక్తికరంగా మారింది. అయితే ఇందుకుగానూ పలు కారణాలను ఆయా సర్వేలు చూపుతున్నాయి.
54 ఏళ్ల దినకరన్ అన్నాడీఎంకే పార్టీలో కీలక నేత. దశాబ్దం క్రితం దాకా జయకు ఆప్తుడిగానే ఉన్నాడు. ఆమె తీసుకున్న కీలక నిర్ణయాల్లో దినకరన్ పాత్ర ఉండేది కూడా. 1999లో పెరియాకులం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు.. తర్వాత 2004-10 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా చేశారు. అయితే 2011లో మన్నార్ గుడి మాఫియా(శశికళ మరియు ఆమె బంధువులు)ను జయలలిత పార్టీ నుంచి బహిష్కరించటంతో ఆయన తెర వెనక్కవెళ్లిపోయారు.
చివరకు జయ మరణానంతరం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలతో వారంతా వెనక్కి వచ్చారు. అయితే వచ్చి రాగానే పార్టీని గుప్పిట్లో పెట్టుకోవాలన్న వారి ప్రయత్నం ఫలించలేదు. అయితే జయ అసలైన వారసత్వం అన్న ట్యాగ్ లైన్‌తో పళని స్వామి గ్రూప్ తరపున ఆయన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో నిల్చోగా.. ఓటర్లకు యథేచ్ఛగా డబ్బు పంచిన ఆరోపణలతో ఆ ఎన్నిక కాస్త రద్దు అయ్యింది. కానీ, పరిస్థితులు తర్వాత పూర్తి వ్యతిరేకంగా మారాయి.
అక్రమాస్తుల కేసులో శశికళ జైలు పాలయ్యారు. ఆమె వారసుడిగా రంగంలోకి దిగిన దినకరన్‌కు చిక్కులు ఎదురయ్యాయి. ఓవైపు ఎన్నికల్లో అవినీతి కేసు.. మరోవైపు ఫెరా కేసు ఊపిరి సలపకుండా చేశాయి. పళని-పన్నీర్ వర్గాలు కలిసిపోయి.. శశికళ వర్గాన్ని బహిష్కరించాయి. ఒకదాని వెంట ఒకటి దెబ్బలు తగులుతున్న తరుణంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక వచ్చి పడింది. ఇక రెండాకుల గుర్తు కోల్పోవటంతో టోపీ కోసం యత్నించగా.. అది దక్కలేదు. దానికి తోడు జయ మరణం వెనుక ఆమె హస్తం ఉందన్న ప్రచారాన్ని ప్రత్యర్థులు పెద్ద ఎత్తున్న వినిపించారు. ఒక రకంగా ప్రభుత్వం కావాలనే దినకరన్ పై కుట్ర చేస్తోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఇన్ని పరిణామాల మధ్య ఎన్నికకు సరిగ్గా ఒక్క రోజు సంచలనానికి తెరలేపారు. అమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీడియోను విడుదల చేశారు. తనకు తెలీకుండా జరిగిపోయిందని దినకరన్ చెబుతున్నప్పటికీ.. ఈ వీడియో ప్రభావంతో సమీకరణాలు మొత్తం మారిపోయాయని వారంటున్నారు. ఆర్కే నగర్ ప్రజల్లో దినకరన్ పై సింపథీ బాగా వర్కవుట్ అయ్యిందని.. అందుకే ఓటింగ్ శాతం కూడా ఓ మోస్తరుగా పెరిగిందని వారంటున్నారు. మరి ఈ పరిణామాలన్నింటిని తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నాడా? విశ్లేషకులు భావించింది జరగుతుందా? జయకు అసలైన వారసుడని ఆర్కే నగర్ వాసులు భావించారా? మరికాసేపట్లోనే తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment