V K Sasikala
-
దినకరన్‌కు కలిసొచ్చింది ఎలాగంటే...
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఓవైపు కొనసాగుతున్న వేళ.. సర్వేలన్నీ శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్‌కు అనుకూలంగా రావటం ఆసక్తికరంగా మారింది. అయితే ఇందుకుగానూ పలు కారణాలను ఆయా సర్వేలు చూపుతున్నాయి. 54 ఏళ్ల దినకరన్ అన్నాడీఎంకే పార్టీలో కీలక నేత. దశాబ్దం క్రితం దాకా జయకు ఆప్తుడిగానే ఉన్నాడు. ఆమె తీసుకున్న కీలక నిర్ణయాల్లో దినకరన్ పాత్ర ఉండేది కూడా. 1999లో పెరియాకులం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు.. తర్వాత 2004-10 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా చేశారు. అయితే 2011లో మన్నార్ గుడి మాఫియా(శశికళ మరియు ఆమె బంధువులు)ను జయలలిత పార్టీ నుంచి బహిష్కరించటంతో ఆయన తెర వెనక్కవెళ్లిపోయారు. చివరకు జయ మరణానంతరం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలతో వారంతా వెనక్కి వచ్చారు. అయితే వచ్చి రాగానే పార్టీని గుప్పిట్లో పెట్టుకోవాలన్న వారి ప్రయత్నం ఫలించలేదు. అయితే జయ అసలైన వారసత్వం అన్న ట్యాగ్ లైన్‌తో పళని స్వామి గ్రూప్ తరపున ఆయన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో నిల్చోగా.. ఓటర్లకు యథేచ్ఛగా డబ్బు పంచిన ఆరోపణలతో ఆ ఎన్నిక కాస్త రద్దు అయ్యింది. కానీ, పరిస్థితులు తర్వాత పూర్తి వ్యతిరేకంగా మారాయి. అక్రమాస్తుల కేసులో శశికళ జైలు పాలయ్యారు. ఆమె వారసుడిగా రంగంలోకి దిగిన దినకరన్‌కు చిక్కులు ఎదురయ్యాయి. ఓవైపు ఎన్నికల్లో అవినీతి కేసు.. మరోవైపు ఫెరా కేసు ఊపిరి సలపకుండా చేశాయి. పళని-పన్నీర్ వర్గాలు కలిసిపోయి.. శశికళ వర్గాన్ని బహిష్కరించాయి. ఒకదాని వెంట ఒకటి దెబ్బలు తగులుతున్న తరుణంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక వచ్చి పడింది. ఇక రెండాకుల గుర్తు కోల్పోవటంతో టోపీ కోసం యత్నించగా.. అది దక్కలేదు. దానికి తోడు జయ మరణం వెనుక ఆమె హస్తం ఉందన్న ప్రచారాన్ని ప్రత్యర్థులు పెద్ద ఎత్తున్న వినిపించారు. ఒక రకంగా ప్రభుత్వం కావాలనే దినకరన్ పై కుట్ర చేస్తోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇన్ని పరిణామాల మధ్య ఎన్నికకు సరిగ్గా ఒక్క రోజు సంచలనానికి తెరలేపారు. అమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీడియోను విడుదల చేశారు. తనకు తెలీకుండా జరిగిపోయిందని దినకరన్ చెబుతున్నప్పటికీ.. ఈ వీడియో ప్రభావంతో సమీకరణాలు మొత్తం మారిపోయాయని వారంటున్నారు. ఆర్కే నగర్ ప్రజల్లో దినకరన్ పై సింపథీ బాగా వర్కవుట్ అయ్యిందని.. అందుకే ఓటింగ్ శాతం కూడా ఓ మోస్తరుగా పెరిగిందని వారంటున్నారు. మరి ఈ పరిణామాలన్నింటిని తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నాడా? విశ్లేషకులు భావించింది జరగుతుందా? జయకు అసలైన వారసుడని ఆర్కే నగర్ వాసులు భావించారా? మరికాసేపట్లోనే తేలనుంది. -
24మంది ఎమ్మెల్యేలు జంప్!
చెన్నై: తమిళనాడు రాజకీయాలు మళ్లీ హైడ్రామాను తలపిస్తున్నాయి. జైలు నుంచి విడుదలైన శశికళ అక్క కొడుకు టీవీవీ దినకరన్ మళ్లీ చక్రం తిప్పుతున్నారు. అధికారిక అన్నాడీఎంకే నుంచి తనను, చిన్నమ్మను దూరం చేసి.. ఏకాకిని చేసేందుకు సీఎం ఎడపాడి పళనిస్వామి వర్గం ప్రయత్నిస్తుండగా.. అందుకు విరుద్ధంగా దినకరన్ బలం నానాటికీ పెరుగుతుండటం గమనార్హం. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వరుసగా దినకరన్‌కు మద్దతు పలుకుతుండటం గమనార్హం. మంగళవారం రాత్రి వరకు దినకరన్‌కు మొత్తం 24మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దీంతో ఎడపాడి వర్గంలో ఉన్న 123 మంది ఎమ్మెల్యేల్లో 24మంది జారుకున్నట్టు అయింది. ఈ పరిణామాలతో లోలోపల ఖుషీ అవుతున్న ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్ అసెంబ్లీ సమావేశాలకు ముందే ఎడపాటి ప్రభుత్వం కూలిపోతుందని అంచనాలు వేస్తున్నారు. అన్నాడీఎంకే అధికారిక గుర్తు ‘రెండాకుల’ కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన కేసులో అరెస్టైన దినకరన్ ఇటీవల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం సోమవారం ఆయన బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న చిన్నమ్మ శశికళను కలిశారు. అప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు పలికారు. సోమవారాం రాత్రి అతను చెన్నైలోని తన నివాసానికి చేరుకొనే సమయంలో ఆయనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. మంగళవారం రాత్రి నాటికి ఏకంగా 24మంది ఎమ్మెల్యేలు ఆయన గూటికి చేరి.. మన్నార్గుడి మాఫియాకు మద్దతు పలికారు. దీంతో స్వరం పెంచిన దినకరన్ ఇప్పటికే పార్టీ అధినేత్రి శశికళేనని, ఆమె గైర్హాజరీలో పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా తానే పార్టీని నడుపుతానని తేల్చిచెప్పారు. పార్టీలోని ఫ్యాక్షన్ గొడవలకు రెండు నెలల్లో చరమగీతం పాడాలని సూచించారు. మరోవైపు బొటాబోటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం ఎడపాటి వర్గంలో తాజా పరిణామాలతో కలవరం మొదలైంది. మరింత ఎమ్మెల్యేలు జారుకుంటే అన్నాడీఎంకే పూర్తిగా దినకరన్ చేతుల్లోకి వెళ్లే అవకాశముందని ఎడపాటి వర్గం భావిస్తున్నది. ఎమ్మెల్యేలు దినకరన్ వైపు వెళ్లకుండా ఎడపాటి చర్యలు తీసుకుంటున్నట్టు పెద్దగా సఫలం కావడం లేదని తెలుస్తోంది. -
శశికళ మేనల్లుడి ఆకస్మిక మరణం
తిరుచ్చి:ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి వికె శశికళను మరో విషాదం వెన్నాడింది. ఆమె మేనల్లుడు టీవీ మహదేవన్ ( 47) శనివారం కుంభకోణంలో గుండెపోటుతో మరణించారు. ఈ వార్త విన్న వెంటనే శశికళ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మేనల్లుడి ఆకస్మిక మరణంతో కన్నీరు మున్నీరయ్యారు. శనివారం ఉదయం తంజావూరులోని మహాలింగేశ్వర టెంపుల్‌కి వెళ్లిన మహదేవన్‌కు గుండెపోటు వచ్చింది. గర్భగుడి ఎదురుగా పూజల అనంతరం బయటికి వస్తుండగా ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని ఆయన ఇంటికి తరలిచారు. అంత్యక్రియలను ఆదివారం నిర్వహించనున్నారు. మరోవైపు మేనల్లుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు శశికళ పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కాగా శశికళ పెద్ద సోదరుడు డా.వినోదగన్ కొడుకు మహాదేవన్ తంజావూరులో ఉంటున్నారు. తంజావూరులో తండ్రి డా. వినోదన్ ఆధ్వర్వంలో స్థాపించిన వినోదగన్ హాస్పిటల్‌కు మహదేవన్ ఎండీగా వున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జయలలిత మరణం తర్వాత పార్టీ ఫోరమ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. శశికళతో అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన, అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయిన సమయంలో ఆమె వెంటే వున్నారు. -
మధుసూదనన్ ను తొలగించిన చిన్నమ్మ
-
మధుసూదనన్ ను తొలగించిన చిన్నమ్మ
తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. ఇన్ని రోజులు శశికళ వర్గంలో ఉంటూ వచ్చిన, పార్టీ సీనియర్ నేత ఇ.మధుసూదనన్ గురువారం పన్నీర్ సెల్వం గూటికి చేరడంతో ఆయనపై చిన్నమ్మ కొరడా ఝుళిపించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో మధుసూదనన్‌ను అన్నాడీఎంకే నుంచి తప్పించింది. ప్రిసీడియం చైర్మన్ పదవితో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు అన్నాడీఎంకే శుక్రవారం ప్రకటించింది. మధుసూదనన్ స్థానంలో సెంగొట్టయ్యన్‌ను నియమిస్తున్నట్టు ప్రటించింది. శశికళ వర్గంలో ఉంటూ వచ్చిన మధుసూదనన్ ఒక్కసారిగా అమ్మ విశ్వాసపాత్రుడు పన్నీర్ వర్గంలో చేరారు. శశికళ కుటుంబసభ్యులు పెత్తనం భరించలేకే తాను అక్కడి నుంచి వచ్చేశానని, పన్నీర్ సెల్వానికి జరిగిన అవమానం రేపు తనకూ జరగొచ్చన్న అంచనాయే తనను బయటకు రప్పించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మధుసూదనన్ పన్నీర్ వర్గంలోకి వెళ్లడంతో ఆయనకు అనూహ్య మద్దతు పెరుగుతూ వస్తోంది. దీంతో మధుసూదనన్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు అన్నాడీఎంకే పేర్కొంది. అయితే పార్టీ నిబంధనల ప్రకారం అన్నాడీఎంకేకు ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టే వాళ్లు ఐదేళ్లు పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా ఉండాలని, యాక్టివ్ మెంబర్ కాకుండానే శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదా చేపట్టినట్టూ మరోవైపు నుంచి చిన్నమ్మపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా చేజారే అవకాశముంటోంది.