మధుసూదనన్ ను తొలగించిన చిన్నమ్మ
మధుసూదనన్ ను తొలగించిన చిన్నమ్మ
Published Fri, Feb 10 2017 2:45 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. ఇన్ని రోజులు శశికళ వర్గంలో ఉంటూ వచ్చిన, పార్టీ సీనియర్ నేత ఇ.మధుసూదనన్ గురువారం పన్నీర్ సెల్వం గూటికి చేరడంతో ఆయనపై చిన్నమ్మ కొరడా ఝుళిపించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో మధుసూదనన్ను అన్నాడీఎంకే నుంచి తప్పించింది. ప్రిసీడియం చైర్మన్ పదవితో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు అన్నాడీఎంకే శుక్రవారం ప్రకటించింది. మధుసూదనన్ స్థానంలో సెంగొట్టయ్యన్ను నియమిస్తున్నట్టు ప్రటించింది.
శశికళ వర్గంలో ఉంటూ వచ్చిన మధుసూదనన్ ఒక్కసారిగా అమ్మ విశ్వాసపాత్రుడు పన్నీర్ వర్గంలో చేరారు. శశికళ కుటుంబసభ్యులు పెత్తనం భరించలేకే తాను అక్కడి నుంచి వచ్చేశానని, పన్నీర్ సెల్వానికి జరిగిన అవమానం రేపు తనకూ జరగొచ్చన్న అంచనాయే తనను బయటకు రప్పించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మధుసూదనన్ పన్నీర్ వర్గంలోకి వెళ్లడంతో ఆయనకు అనూహ్య మద్దతు పెరుగుతూ వస్తోంది. దీంతో మధుసూదనన్ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు అన్నాడీఎంకే పేర్కొంది. అయితే పార్టీ నిబంధనల ప్రకారం అన్నాడీఎంకేకు ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టే వాళ్లు ఐదేళ్లు పార్టీలో యాక్టివ్ మెంబర్గా ఉండాలని, యాక్టివ్ మెంబర్ కాకుండానే శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదా చేపట్టినట్టూ మరోవైపు నుంచి చిన్నమ్మపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా చేజారే అవకాశముంటోంది.
Advertisement
Advertisement