ట్రై సైకిల్స్ పంపిణీలో ఎమ్మెల్యే రోజా తదితరులు
నిండ్ర: దివ్యాంగుల మధ్య టీడీపీ చిచ్చు పెట్టేందుకు యత్నిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. సోమవారం ఆమె మండల కేంద్రం నిండ్రలో దివ్యాంగులకు మదర్ థెరీసా డిసేబుల్డ్ డెవలమెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ దివ్యాంగులకు ప్రత్యేకంగా రూ.500 పెన్షన్ అందించిన మొదటి నాయకుడని అన్నారు. అదేవిధంగా ప్రతి మండలంలో రాజీవ్ విద్యామిషన్ ప్రత్యేక ప్రతిభావంతుల కోసం కృషి చేసిన నాయకుడు అన్నారు. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం దివ్యాంగులకు పర్సెంటేజీ ప్రకారం పింఛన్ ఇస్తూ వారి మధ్య గొడవలు పెడుతోందని ఎమ్మెల్యే ఆరోపించారు. దివ్యాంగులకు అందించే పింఛన్ పంపిణీలో కూడా వివక్ష చూపుతోందని విమర్శించారు. దివ్యాంగులైన ప్రతి ఒక్కరికీ సమానంగా పింఛన్ అందించాలని ఆమె తెలిపారు. మదర్ థెరీసా ట్రస్టుకు చెందిన 30 మంది దివ్యాంగులకు ఎమ్మెల్యే రోజా రూ. లక్ష విలువ చేసే ట్రై సైకిల్, వీల్ చైర్స్, స్టిక్స్ తదితర పరికరాలను అందజేశారు.
బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలి..
సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్‌లాగ్ పోస్టులను ప్రస్తుత ప్రభుత్వం తక్షణం భర్తీ చేయాలని అన్నారు. అలాగే వారికందించే రుణాలను పార్టీలకతీతంగా అందించాలని తెలిపారు. అవయవలోపం ఉందని ఎవరూ బాధపడొద్దని, చాలామంది ప్రత్యేక ప్రతిభావంతులు అన్నిరంగాల్లో ముందుకెళ్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని ఆమె వారికి సూచిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మోహన్ వర్మ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి శ్యామ్‌లాల్, మహిళా విభాగం కార్యదర్శి మేరీ, ట్రస్టు సభ్యులు రజని, వసంతరావు, సుబ్రమణ్యంనాయుడు, బసవయ్య, శేఖర్, పాండ్యన్, సర్పంచులు అనిల్‌కుమార్, రేవతి, రామచంద్రయ్య, పవిత్ర, దామోదరం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment