
సాక్షి, తిరుమల: టాలీవుడ్ నుంచి కాస్టింగ్ కౌచ్ భూతాన్ని తరిమేసే పోరాటంలో బాధితులకు అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. 1991 నుంచీ తాను చిత్రపరిశ్రమలో ఉన్నానని, ఇప్పటిదాకా కాస్టింగ్ కౌచ్‌పై ఎవరూ ఫిర్యాదు చేయలేదని గుర్తుచేశారు. ఇప్పుడు, ఇకపైనా ఎవరికైనా ఇబ్బందులు కలిగితే నేరుగా వచ్చి ఫిర్యాదు చెయ్యొచ్చన్నారు. అయితే, వ్యక్తిగత లాభం కోసం చిత్రపరిశ్రమలోని వారిపైనో, లేక పవన్ కల్యాణ్‌పైనో దూషణలకు దిగడం మంచిదికాదని హితవుపలికారు.
ఆదివారం తిరుమల వచ్చిన ఎమ్మెల్యే రోజా కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. టీటీడీ పాలకమండలి నియామకాల విషయంలో సీఎం చంద్రబాబు హిందువుల మనోభావలను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇదే టీడీపీ ప్రభుత్వం గతంలో విజయవాడలో ఆలయాలను కూల్చేసి ఘటనలను గుర్తుచేశారు. కనీసం ఇప్పటికైనా టీటీడీ పాలక మండలిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.