సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేశ్ పదవి పోతుందనే సరికి భయపడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. 2004లో మండలి అవసరం లేదన్న చంద్రబాబు.. ఇప్పుడు లోకేశ్ పదవి కోసం కావాలంటున్నారని మండిపడ్డారు. ఇక్కడే ఆయన రెండు నాలుకల ధోరణి ప్రతి ఒక్కరికి అర్థమవుతోందన్నారు. శాసనసభ ద్వారా చట్టాలు చేయడమే నిజమైన ప్రజాస్వామ్యం అని స్పష్టం చేశారు. ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి మద్దతు తెలిపారు. సోమవారం అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానంపై రోజా మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని రాజ్యాంగం చెబుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారని గుర్తుచేశారు. వికేంద్రీకరణ బిల్లును నిబంధనలకు విరుద్ధంగా సెలక్ట్ కమిటీకి పంపారని మండిపడ్డారు. శాసనసభలో ఆమోదించిన బిల్లును.. మండలిలో అవమానిస్తారా అని ప్రశ్నించారు.
అధికారం కోల్పోయినా చంద్రబాబు అహంకారంతో వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు విధానాలకు ప్రశ్నిస్తారనే.. ఈ రోజు శాసనసభకు రాకుండా పారిపోయారని విమర్శించారు. మండలి రద్దు చేయాలంటే రెండేళ్లు పడుతుందని చెబుతున్న చంద్రబాబు శాసనసభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పెద్దల సభకు చంద్రబాబు తన ఇంట్లో ఉన్న దద్దోజనాన్ని పంపించారని ఎద్దేవా చేశారు. యనమల రామకృష్ణుడు స్వయం ప్రకటిత మేధావిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్థం కోసం స్పీకర్ వ్యవస్థలను వాడుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని గుర్తుచేశారు. అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని చెప్పారు.
గాయం విలువ తెలిసినవారే.. సాయం చేయగలరు
పెద్దల సభ ప్రజాతీర్పును గౌరవించాలే.. కానీ అపహాస్యం చేయకూడదని అన్నారు. గాయం విలువ తెలిసినవారే.. సాయం చేయగలరని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం వైఎస్ జగన్ ప్రజల గాయాలు తెలుసుకుని.. వారికి సాయం చేస్తున్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని గుర్తుచేశారు. అందుకే అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా ఎదిగారని అన్నారు. 13 జిల్లాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని చెప్పారు. మండలిని చంద్రబాబు తన రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment