
పాడేరులో కిడారి సర్వేశ్వరరావు అంతిమయాత్ర
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బితుకుబితుకుమంటున్నారు. ఇన్నాళూŠల్ మన్యంలో ఉంటున్న నేతలే ఆందోళన చెందేవారు. ఇప్పుడు అధికార పార్టీ నేతలు కొందరిని దళసభ్యులు టార్గెట్ చేసినట్టు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారంతో మైదానంలో ఉన్నవారూ తీవ్ర భయాదోళనలు చెందుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని వీరిని పోలీసులు కూడా హెచ్చరించడంతో మరింతగా కలవరపడుతున్నారు. ఎమ్మెల్యే కిడారి పార్టీ ఫిరాయించిన నాటి నుంచి మావోయిస్టులు అతనిపై గుర్రుగా ఉన్నారు.
ఏజెన్సీలోని మరో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కూడా కన్నెర్ర చేస్తున్నట్టు సమాచారం. ఆమెను కూడా మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు గత ఏప్రిల్‌లో ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. 2004లో మంత్రి మణికుమారి భర్త వెంకట్రాజును కూడా పలుమార్లు హెచ్చరించి ఆ తర్వాత పాడేరులో పట్టపగలే మావోయిస్టులు హతమార్చారు. గతంలో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడు శ్రీను గొలుగొండ మండలం జోగంపేట వద్ద మావోయిస్టులు హత్య చేశారు. కొన్నాళ్ల నుంచి నర్సీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న లేటరైట్ తవ్వకాల్లో భాగస్వామ్యం ఉందంటూ అయ్యన్న తనయుడిని కూడా మావోయిస్టుల పేరిట హెచ్చరికలు వచ్చాయి. ఇలా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల లక్ష్యంగా మావోయిస్టులు గురిపెడుతుండడంతో వారిలో తీవ్ర కలవరం రేకెత్తుతోంది.
Comments
Please login to add a commentAdd a comment