జగన్‌ యాత్రకు భయపడే ‘పోలవరం’ డ్రామా | Sajjala Ramakrishna Reddy comments on Chandrababu and Polavaram Project | Sakshi
Sakshi News home page

జగన్‌ యాత్రకు భయపడే ‘పోలవరం’ డ్రామా

Published Tue, Jun 12 2018 2:44 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

Sajjala Ramakrishna Reddy comments on Chandrababu and Polavaram Project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి భయపడే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు వద్ద హడావుడి చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్‌ యాత్రకు బెంబేలెత్తి చంద్రబాబు ఈ డ్రామా ఆడుతున్నట్టుందన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని చంద్రబాబు అక్రమార్జనకు బంగారు బాతులా మార్చుకున్నారని మండిపడ్డారు. ఈ భారీ ప్రాజెక్టు జాతీయ స్కాంలా తయారైందని విమర్శించారు. దొంగలెక్కలు చూపే ప్రైవేటు కాంట్రాక్టర్‌ మాదిరిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది ఎన్నికల్లోగా పోలవరాన్ని ఎలా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పూర్తికాని ప్రాజెక్టును జాతికి అంకితమివ్వడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే నీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులు తిన్న మొత్తాన్ని కక్కిస్తామన్నారు.  

బాబుది అంతా వ్యాపారధోరణి
చంద్రబాబు ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్ని వ్యాపార ధోరణితో చూస్తారనే విషయం ఆయన రాసుకున్న మనసులో మాట పుస్తకాన్ని చూస్తే అర్థమవుతుందని సజ్జల చెప్పారు. అటువంటి వ్యక్తి ఈ రోజు ప్రాజెక్టులు, జలాశయాలు తన కల అంటూ ప్రజల్ని మోసపుచ్చాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పూర్తికాని పోలవరం వద్దకు వెళ్లి పునాదిరాయి వద్ద నిలబడి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించడం ప్రజల్ని మభ్యపెట్టడమేనన్నారు. 2018 ఖరీఫ్‌లోగా పోలవరాన్ని పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లు అందిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు మాటమార్చి 2019కి వాయిదా వేశారని చెప్పారు. నిజానికి చంద్రబాబు అధికారం 2019 మేనెల వరకే అయినా కూడా ఆయనకు సంబం«ధం లేని అంశాలపై వాగ్ధానాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

కమీషన్ల కోసమే తాత్కాలిక ప్రాజెక్టులు
కమీషన్ల కోసమే చంద్రబాబు తాత్కాలిక ప్రాజెక్టులను చేపడుతున్నారని సజ్జల అన్నారు. 2018 నాటికే పోలవరాన్ని పూర్తి చేస్తానని ఓ పక్క చెబుతూ మరోపక్క తాత్కాలిక ప్రాజెక్టులైన పట్టిసీమ, పురుషోత్తపట్నం కోసం రూ. 3,400 కోట్లు ఖర్చు చేశారన్నారు. పట్టిసీమ ఎత్తిపోతలకు కరెంట్‌ ఖర్చు మరో రూ. 1400 కోట్లు అని.. ఈ మొత్తం కలిపి దాదాపు రూ. 4,800 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. ఒకపక్క 2018కి పోలవరం పూర్తి చేస్తామంటూ మరోపక్క ఈ తాత్కాలిక ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. కాగ్‌ లెక్క ప్రకారమే ఈ పథకాల్లో రూ. 350 కోట్ల అవినీతి జరిగిందని తెలిపారు.  

నిధులెలా తెస్తారు..?
ప్రస్తుత అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ. 58 వేల కోట్లు దాటిందని, ఇందులో ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 13 వేల కోట్లు ఖర్చు చేశాయని సజ్జల చెప్పారు. ఆ మిగతా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? తెచ్చే ప్రణాళికలు ఏమిటి? ఒకవేళ కేంద్రం ఇవ్వకపోతే ఎలా పూర్తి చేస్తారో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. ఏడాదిలో ఎన్నికలు వస్తాయి కాబట్టే చంద్రబాబు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. 2003లో కూడా చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు దేవాదుల ప్రాజెక్టుకు హడావుడిగా భూమి పూజ చేసి అంతటితో ముగించేశారని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు పూర్తయిన పనులు 54 శాతం అయితే అందులో 39 శాతం పనులు రూ. 5,135 కోట్లతో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగాయని మిగిలిన కొద్ది శాతం పనులు మాత్రమే ఈ నాలుగేళ్లలో జరిగాయని సజ్జల వివరించారు. కేంద్రం ఒక బడ్జెట్‌లో వంద కోట్లు, మరో బడ్జెట్‌లో అసలేమీ ఇవ్వకున్నా చంద్రబాబు నోరు మెదపకపోవడానికి కారణం అవినీతి, కమీషన్లు, బినామీ కాంట్రాక్టులేనని విమర్శించారు. చంద్రబాబు తీరు చూస్తుంటే ఆనాటి రష్యన్‌ సమాజంలోని పొటెంకిన్‌ గ్రామ కథ (ఇతరులను మోసం చేసేందుకు ఉద్దేశించిన కల్పిత గ్రామ కథ) గుర్తుకువస్తోందని చెప్పారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్నట్టు చెబుతున్నా.. సుజనాచౌదరి వంటి వాళ్ల వ్యవహారాల్ని చూస్తుంటే అంతర్గతంగా  సంబంధాలు కొనసాగుతున్నట్లు అందరికీ అనుమానం కలుగుతోందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement