సాక్షి, అమరావతి : వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో భారీ విజయం కట్టబెట్టిన ప్రజలకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిక్షణం తపిస్తున్నారని చెప్పారు. వికేంద్రీకణతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం అన్న అంశంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల రాష్ట్ర ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని విమర్శించారు. చంద్రబాబువి స్ట్రీట్ పాలిటిక్స్ అయితే, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసేది స్ట్రెయిట్ పాలిటిక్స్ అని చెప్పారు. చంద్రబాబు సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలు, దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం వైఎస్ జగన్ పడుతున్న కష్టాన్ని, చేపడుతున్న పథకాలను, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విద్యార్థి, యువజన లోకం సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ గుంటూరు జిల్లా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment