
సజ్జల రామకృష్ణా రెడ్డి
సాక్షి, విజయవాడ : మైనారిటీలకు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మేలు ఎవరూ మరవలేరని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఇక్కడ పార్టీ కార్యలయంలో జరిగిన మైనారిటీ విభాగం రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మైనారిటీల జీవితాల్లో ఎలా వెలుగులు నింపాలి అని తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి యోచిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బీసీలు, ఎస్సీ, మైనారిటీలు, మహిళలు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. చంద్రబాబు పైఎత్తులను ధీటుగా ఎదుర్కొవాలన్నారు.
అందరికి అభివృద్ధి ఫలాలు అందేజేయడంతోనే దివంగత నేత వైఎస్సార్ కోట్లాది మంది హృదయాల్లో గుడికట్టుకున్నారని తెలిపారు. సంతలో పశువులు కొన్నట్లు చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలను కొన్నా.. జననేత వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా పోరాటాలే పార్టీని నిలబెట్టాయన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి పోరాటాలు చేసిన పార్టీ మరొకటి లేదని, ఒక ప్రాంతీయ పార్టీ ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడడం మాములు విషయం కాదన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కిపోయి, పాలన స్తంభించిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు చరిత్రంతా వంచన మోసం, దగానేనని మండిపడ్డారు. ముక్కుసూటితనం, స్వచ్ఛమైన రాజకీయాలు చేయడమే వైఎస్ జగన్ వ్యవహారశైలి అని పేర్కొన్నారు.