సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వెకిలి మాటలతో కేసును పక్కదారి పట్టించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు. టీడీపీ పాలనలోని వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇటీవల జరిగిన వివేకానంద రెడ్డి హత్య, డేటా చోరీలపై చంద్రబాబు ప్రముఖంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలింగ్‌కు మరో 20 రోజులే ఉండటంతో చంద్రబాబు మరింత దిగజారే అవకాశం ఉందన్నారు.
ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీల గురించి ప్రజలు నిలదీస్తారని తెలిసే.. అనేక పన్నాగాలు రచించి టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని సజ్జల ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో నేరుగా గెలవలేకే ఇలాంటి కుట్రలకు చంద్రబాబు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలింగ్‌కు ముందు చంద్రబాబు అండ్ టీం మరిన్ని కుట్రలు చేసే అవకాశం ఉందన్నారు. శాశ్వతంగా సీఎం కుర్చీలోనే కూర్చోవాలనే ప్లాన్ కూడా ఆయన చేశారని.. దీన్ని ప్రజలే తిప్పి కొట్టాలని కోరారు.
టీడీపీనే లక్ష్యంగా నాలుగు రోజుల్లో ఐటీ దాడులంటూ ఆ పార్టీ నేతలు పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. సహజంగానే ఐటీ దాడులు జరిగితే జరగవచ్చని.. కానీ వాటికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే కుట్రలు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గాలు, కుట్రలతో అధికారాన్ని దక్కించుకోవాలని యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment