బీసీలకు అందరికన్నా వైఎస్ రాజశేఖరరెడ్డి బాగా చేశారు. రాజకీయంగా కూడా బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చింది ఆయన మాత్రమే. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు, స్కాలర్‌షిప్పుల మంజూరును సంతృప్త్త స్థాయికి తీసుకు రావడం, గురుకులాలు ఎక్కువ చేయడం, ప్రతీ అసెంబ్లీ పరిధిలో బాలికలు, బాలుర హాస్టళ్లు పెట్టడంలో అగ్రస్థానంలో ఉన్నారు. దీంతో పేదకులాల వారు పెద్ద చదువులు చదువుకునే అవకాశం ఏర్పడింది. అభివృద్ధి, సంక్షేమంలో పెద్ద కదలిక వచ్చింది. అన్ని బీసీ కులాలకు 12 ఫెడరేషన్లు, కార్పొరేషన్లు పెట్టారు. వీటితో బెనిఫిట్ ఎక్కువైంది. కానీ రాజశేఖరరెడ్డిగారితోనే అవి ఆగిపోయాయి. ఆ తర్వాత వచ్చిన సీఎంలు బీసీలకు ఏమీ చేయలేదు.
యర్రా యోగేశ్వరరావు, ఎలక్షన్ డెస్క్, సాక్షి :‘మీ పిల్లలు చదువుకోవాలి. డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు, అఫీసర్లు కావాలి. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలి. అప్పుడే పేదరికం నుంచి బయట పడతారు. అది జరగాలంటే బాగా చదువుకోవాలి. దానికయ్యే ఖర్చంతా నేనే భరిస్తా. భోజనం, పుస్తకాలు, ఇతర ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు.. చిన్నారులను బడికి పంపిస్తే వారి తల్లి ఖాతాలో రూ.15 వేలు వేస్తామంటున్న జగన్ గొప్ప నేత అంటున్నారు బీసీ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య. ఈ ఎన్నికల్లో బీసీలు వ్యవహరించాల్సిన తీరు, బాబు మోసం తదితర విషయాలపై ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.
పార్లమెంట్‌లో బీసీ బిల్లు ఘనత వైఎస్సార్‌సీపీదే
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని 1994 నుంచి ప్రధానంగా ఎక్కువగా పోరాటాలు చేస్తున్నా. అదే నా జీవితాశయం. హాస్టళ్లను రెండు నెలల్లో, గురుకులాలను రెండేళ్లలో ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యాము. స్కాలర్‌షిప్‌లను సంతృప్త స్థాయిలో సాధించాము. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నాలుగేళ్ల పోరాటంలో కృతకృత్యులయ్యాం. కానీ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం 1994 నుంచి పోరాటం చేస్తున్నాం. మూడుసార్లు అసెంబ్లీలలో తీర్మానం చేసినా ప్రధాని వద్దకు ఎవరూ పోలేదు. పార్లమెంటులో ఎవరూ చర్చించలేదు. 36 రాజకీయ పార్టీల నాయకులను కలిశాను. ప్రతీ పార్లమెంట్ సమావేశాల్లో కనీసం 200 మంది ఎంపీలను కలిసి వారిపై ఒత్తిడి తెచ్చాను.
వైఎస్‌జగన్.. బీసీల కోసం పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టడాన్ని ఎవరూ నమ్మలేకపోయారు. వైఎస్సార్‌సీపీ బీసీ బిల్లు పెట్టడమేంటి? బీసీలకు అనుకూలమని చెప్పుకునే డీఎంకే, పీఎంకే, ఏఐఏడీఎంకే, అప్నాదళ్, లోక్‌దళ్, ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ వంటి పార్టీలు బిల్లు పెట్టకపోవడమేంటి? 62 ఏళ్ల పార్లమెంటు చరిత్రలో ఏ ఒక్క పార్టీ బీసీ బిల్లు పెట్టలేదు. జగన్ పెట్టడంతో హర్షం వ్యక్తం చేశాం. బీసీల్లో ఆయనపై నమ్మకం పెరిగింది. ‘బీసీలకు ఏంకావాలి.. ఎలా డెవలప్ చేయాలి.. మీరు రాజమండ్రి బీసీ గర్జనకు రండి.. చీఫ్ గెస్ట్‌గా ఉండండి. మీ డిమాండ్లు చెపితే మానిర్ణయాన్ని మీముందే ప్రకటిస్తాం. అధికారంలోకి వస్తే వాటన్నింటినీ అమలు చేస్తాం’ అని జగన్ చెప్పారు. చెప్పిన మేరకే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఆయన మద్దతు పలికారు. 130 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ కాంట్రాక్టులన్నింటిలో 50 శాతం బీసీలకు ఇస్తామని ప్రకటించారు. బీసీ కమిషన్ వేసి, వారి సంక్షేమం కోసం ఏటా రూ.75 వేల కోట్లు బడ్జెట్‌లో ఇస్తామన్నారు. ప్రతి కుంటుంబానికి రూ.5 లక్షల నుంచి కోటి దాకా సున్నా వడ్డీ రుణాలు, కుల వృత్తుల వారికి ఉపాధి పథకాలు ప్రవేశపెడతామన్నారు. 45–60 వయసున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఏడాదికి రూ.75 వేలు చెల్లిస్తామన్నారు. ఆయన నిర్వహించిన బీసీ గర్జన చరిత్రాత్మకం.
వైఎస్సార్‌సీపీ వస్తే చట్టసభల్లో 50 శాతంరిజర్వేషన్లు వస్తాయని గట్టిగా నమ్ముతున్నాంబీసీ డిక్లరేషన్‌లోని అంశాలు అమలు చేస్తే బీసీల సమూల, సర్వతోముఖాభివృద్ధికి, వికాసానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, రాజకీయంగా ఎదిగే స్కీంలు దానిలో ఉన్నాయి. అన్ని రంగాల్లో.. విద్య, వైద్యం, ఉపాధి, ఇళ్లు, పింఛన్లు ఇలా పేదకులాలకు ఉపయోగపడే ఎన్నో పథకాలు ఉన్నాయి. చంద్రబాబు మాత్రం మీరు బర్లెకాడకు, గొర్లెకాడకు పోండి, ఒడ్డెరోళ్లకు బరిసెలిస్తా, కమ్మరోళ్లకు కొలిమెలిస్తా, గౌండ్లకు చెట్లు ఇస్తా, మీరిట్లనే బతకండని అంటున్నాడు. అధికారంలో మేం ఉంటాం అంటున్నాడు. మా బిడ్డలు బాగా చదువుకోవాలి. మంచి ఉద్యోగాలు చేసుకోవాలని బీసీలు కోరుకుంటున్నారు.
జగన్ బీసీలు శాశ్వతంగా, సమగ్రంగా అభివృద్ధి చెందాలని పథకాలను ప్రవేశబెట్టబోతున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు వస్తాయని గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే అధికారంలో లేనప్పుడే పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టండని చెబితే జగన్ దానిని ప్రాక్టికల్‌గా చేసి చూపించాడు. అందువల్ల ఆయన అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించినవి ఈ నవరత్నాలు. నిరుద్యోగులు, యువకులు, రైతులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీల సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడతాయి. హైదరాబాద్‌లో ఆంధ్రా వాళ్లపై ఎక్కడా దాడులు జరగలేదు. అదిదుష్ప్రచారం. సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ఎన్నికల్లో లాభపడాలని చేసే దుర్మార్గపు ఎత్తుగడ.
జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దాం
మాటతప్పని వ్యక్తి జగన్. ప్రాక్టికల్‌గా రాజశేఖరరెడ్డి పాలన చూశాం. ఆయన చాలా చక్కగా పరిపాలించారు. ప్రతీ పథకం అందరికీ అందే స్థాయికి తీసుకెళ్లారు. పాలన అంటే ఇలా ఉండాలని అందరూ అనుకునేలా చేశారు. ఆయన అడుగుజాడల్లోనే జగన్ నడుస్తున్నాడు. మాటిస్తే ఎంత కష్టమైనా నెరవేరుస్తారని నమ్ముతున్నాం. అందుకే ఒక అవకాశం ఆయనకు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కుల మతాలకు అతీతంగా అలోచించడం, మాట ఇస్తే తప్పక నెరవేర్చడం. మంచిగుణాలు ఉన్నాయి. అందరికీ ఎంతో కొంత చేయాలనే తపన, స్థిరనిశ్చయం ఉంది. మరి జగన్ మొత్తం ఫీజులు చెల్లిస్తానంటున్నాడు. ఈ పరిస్థితులో బీసీలు ఆయనకే ఓటు వేయాలి.
బాబు మాట నిలుపుకోలేదు
రాజకీయాల్లోకి రావాలని నేనెపుడూ అనుకోలేదు. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉండగా.. 40 ఏళ్ల క్రితమే మంత్రి పదవిని ఆఫర్ చేశారు. ఎన్టీఆర్ కూడా ఇస్తానన్నారు. ఆ తర్వాత నలుగురు సీఎంలు అడిగారు. బీసీలందరి సమగ్ర సంక్షేమమే నా పథం. అందుకే రాజకీయాలవైపు వెళ్లలేదు. 2014లో చంద్రబాబు తన ముఖ్యమైన అనుచరులను నా వద్దకు పంపారు. ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ ‘తెలంగాణకు నేను రాలేను. మేము సర్వే చేశాం. మీకు ప్రజాదరణ ఎక్కువుంది. పార్టీ గెలిస్తే మిమ్మల్ని సీఎంను చేస్తా. ఒకవేళ హంగ్ వస్తే వాళ్లతో చెప్పి నిన్నే సీఎంను చేస్తా.’ అని చెప్పి ఎల్బీనగర్ టికెట్ ఇచ్చారు. ఎన్నికలైన తెల్లారినుంచే చంద్రబాబు ప్లేట్ ఫిరాయించాడు. ఫ్లోర్ లీడర్‌ను కూడా చేయలేదు. టీఆర్‌ఎస్ నుంచి ఆఫర్ వచ్చినా నేను పోలేదు. గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది వెళ్లిపోయారు. నేను మాత్రం వెళ్లలేదు.
బీసీలను తొక్కేయడమే బాబు విధానం
బీసీ ఉద్యమం బలపడకూడదనేది చంద్రబాబు విధానం. ఆయన నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వెనుక ఆయన స్వార్థం ఉంది. జనాభాలో బీసీలు కీలకం. నా ద్వారా అయన రాజకీయ లబ్ధి పొందాలనే నాకు సీటు ఇచ్చాడు. బీసీలకు ముఖ్యమంత్రి అంటే బీసీలంతా ఒక్కటవుతారు కదా. ఏపీలో బీసీలంతా తనకు ఓటేస్తారన్న కుయుక్తితో నన్ను వాడుకున్నాడు. బీసీలను ఉపయోగించుకుని ఏపీలో సీఎం కాగానే అవసరం తీరాక విదిలేశాడు. చంద్రబాబు వాడుకుని వదిలేసే గుణాన్ని అక్కడి, ఇక్కడి బీసీలు గ్రహించారు. అది తెలిసి ఆయనకు ఓటమి భయం పట్టుకుంది. ఇపుడు కొత్త ప్లేకార్డు ఆడుతున్నాడు. డబ్బులు వెదజల్లుతున్నాడు. అట్లా ఎప్పటికప్పుడు పత్తాలాడినట్లు కార్డులను మారుస్తుంటాడు. అందుకోసమే ఇపుడు బీసీలను తొక్కుతున్నాడు. ఏపీ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం గుర్తింపును రద్దు చేయడానికి కారణం నేను గౌరవాధ్యక్షునిగా ఉండటమే. అప్పటికి నేను టీడీపీ ఎమ్మెల్యేనే. అక్కడి నాయకులంతా వెళ్లి అధికారులను ఈ విషయాన్ని అడిగితే, సీఎం గారు చెప్పారని బదులిచ్చారు. గౌరవాధ్యక్షునిగా ఉన్న కృష్ణయ్యను తొలగిస్తేనే గుర్తింపు కొనసాగుతుందని చెప్పారు. దీంతో సంఘం నాయకులు ఈ అంశాన్ని జనరల్ బాడీలో పెట్టారు. సభ్యులంతా ఎదురుతిరిగారు. మాకు గుర్తింపు లేకున్నా మాకు నాయకుడు కృష్ణయ్యేనని తీర్మానించారు. దీంతో చంద్రబాబు ఆ సంఘంలో కొందరిని ప్రలోభాలతో చీల్చి, వారివల్ల కొన్ని రాయితీలు ఇస్తున్నట్టు ప్రకటించారు. బాబుకు అలవాటు కదా చీల్చడం. కులాలను, మతాలను చీల్చి కుట్రలతో సీఎం పదవిని కాపాడుకుంటున్నాడు. ఆయన ఎంత బీసీ వ్యతిరేకో జనాలు అర్థం చేసుకోవాలి. ఆయన ఎన్ని బీసీ వ్యతిరేక పనులు చేసినా ఓపికతో భరిస్తున్నాం. ఎప్పుడైతే మాలోనే చీలికలు తెస్తున్నాడో అప్పటినుంచే వ్యతిరేకిస్తున్నాం.
చేసిన అప్పుంతా ఎక్కడికెళ్లింది?
ఐదేళ్లు ప్రజావ్యతిరేక చర్యలు తీసుకుని, మాయమాటలు చెప్పడం, మోసం చేయడం. ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో రూ.10 వేలు ఇస్తున్నాడు కానీ, ఒక్కో కుటుంబం పేరు మీద రూ.2 లక్షల అప్పు చేసిండు. ప్రజలను ఈ విధంగామోసం చేస్తున్నడు. చేసిన అప్పంతా ఎక్కడ పోయింది. గత ప్రభుత్వాలు 65 ఏళ్లలో చేయని అప్పు చంద్రబాబు ఈ ఐదేళ్లలో చేశాడు. 65 ఏళ్లలో గతంలో ఒక్కో కుటుంబంపై రూ.50 వేలు అప్పు ఉంటే నేడు రూ.2 లక్షలకు చేరింది. ఈ అప్పు ఆయన కడతాడా? బీసీ సబ్‌ప్లాన్ కేటాయింపుల్లో సగం కూడా ఖర్చుపెట్టలేదు. ఒక్క హాస్టల్ బిల్డింగ్‌గాని, స్కూల్ బిల్డింగ్‌గాని కట్టలేదు. సబ్‌ప్లాన్ నిధులను వేరేవాటికి వాడుకుంటున్నారు. అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేయొచ్చో అయనకుతెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు పేద ప్రజలకు పనికొచ్చే పని ఏదీ చేయలేదు. కానీ తన మీడియా ద్వారా ఏదో చేసినట్టు హైప్ క్రియేట్ చేస్తున్నాడు.
♦ ఫీజుల కోసం రక్తాన్ని అమ్ముకుంటున్న పీజీ విద్యార్థులు కూడా ఉన్నారంటే బీసీల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లను కాలేజీల్లోనే వదిలి నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. హాస్టల్ పిల్లలు ముతక బియ్యంతో అన్నం తింటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రూ.10 వేలు పెంచుతున్నట్టు చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించి,
దాన్ని అమలు చేయలేదు.
♦ బీసీలందరికీ నేను అదే విజ్ఞప్తి చేస్తున్నా. దేశ చరిత్రలో ఏ నాయకుడూ చేయని విధంగా, ధైర్యంగా మనకోసం అన్నీ చేస్తానని చెబుతున్నాడు. కనుక జగన్‌ను గెలిపిస్తే బీసీల పోరాట ఫలితం అందుతుంది. చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తాయి. అవసరమైతే ఇతర పార్టీల ఎంపీలను కూడా ఒప్పించి మద్దతు కూడగట్టగల సమర్థుడు. అనుకుంటే దేన్నయినా సాధించగల సత్తాగల నాయకుడు.
♦ బీసీ రిజర్వేషన్ బిల్లుపై అఖిలపక్షంతో ప్రధాని వద్దకు వెళ్లి ఒత్తిడి తెద్దామని చంద్రబాబును కోరా. ఆయన బీజేపీతో మిత్రపక్షంగా ఉండి 42 సార్లు పీఎంను కలిసినా బీసీ బిల్లును
ప్రస్తావించలేదు. టీడీపీ ఎంపీలు కూడా ఆ విషయాన్ని పార్లమెంటులో నోరెత్తి అడగలేదు. బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీలో ధర్నాలు చేసినా, అఖిలపక్షాన్ని కలవాలనుకున్నా టీడీపీకి సహకరించవద్దని తన ఎంపీలను చంద్రబాబు హెచ్చరించారు. ఇపుడు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇతర పార్టీల కన్నా తక్కువ సీట్లు ఇచ్చాడు.
♦ చంద్రబాబు పాలనలో బీసీలకు ఎలాంటి మేలు జరగలేదు. అంతా కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, కార్పొరేట్ సంస్థలకే బెనిఫిట్ తప్ప ప్రజలకు లేదు. ఇపుడు 5 ఏళ్లు, అంతకు ముందు 9 ఏళ్లు పరిపాలించిండు. బీసీల అభివృద్ధికి ఏమైనా ఇచ్చిండా? గడ్డపారలు, బర్రెలు, గొర్రెలు, సుత్తెలు, బుట్టలు, చిన్నచిన్న కులవృత్తులు చేసుకుంటూ అర్ధాకలితో బతకమని.. ఇవే కదా ఇస్తానన్నాడు. వాళ్లు మంచి ఉద్యోగాలు సంపాదించేందుకు ఏమైనా చేసిండా? కనీసం ఫీజు రీయింబర్స్‌మెంటునైనా పూర్తిగా ఇవ్వలే.
♦ మారుతున్న సమాజానికి అనుగుణంగా బీసీలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యం జగన్‌కు ఉంది. చంద్రబాబు ఆలోచన ఎంతసేపూ బీసీలు కుల వృత్తులను నమ్ముకొని అలాగే ఎదగకుండా ఉండాలని ఉంది. జగన్ ఆలోచన మంచిదా? చంద్రబాబు దురాలోచన మంచిదా? బీసీలుతేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.
♦ చంద్రబాబు పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దాన్ని గ్రహించి రాజకీయ ఎత్తులు వేస్తున్నాడు. ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని అవసరానికి తగ్గట్టు వాడుకుంటాడు. పోయిన సారి నన్ను, పవన్ కల్యాణ్‌ను వాడుకున్నాడు. ఇప్పుడు కొత్తవాళ్లను ఉపయోగించుకుంటున్నాడు. ఆయనది అవకాశవాదం. కులాలు, మతాల మధ్య పంచాయితీ పెట్టి పబ్బం గడుపుకోవడం దుర్మార్గం.
Comments
Please login to add a commentAdd a comment