40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని అస్తమానం చెప్పుకునే చంద్రబాబు పాలనలో ఆం్ర«దప్రదేశ్ ప్రజలు నిలువునా మోసపోయారు. ఆయన అనుభవం మొత్తం మోసం, దగా, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, హత్యలతో నిండిపోయింది. బూటకపు హామీలతో గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ప్రజలను పట్టించుకోలేదు. గట్టిగా బుద్ధి చెప్పడానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని జనం ఎదురు చూస్తున్నారు’ అని సినీ నటుడు పృథ్వీ అన్నారు. ఎన్నికల వేళ ఆయన తన అభిప్రాయాలను ’సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
బాబు పాలనలో మోసపోయిన ప్రజలు...
రైతులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, అంగన్‌వాడీలు, విద్యార్థులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది...ఇలా అన్ని వర్గాలు బాబు ఎన్నికల హామీలతో మోసపోయారు. నిరుద్యోగులు చిన్నిచిన్న ఉద్యోగాలకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. ఉన్న ఊళ్లో ఉపాధి లేక కన్నవాళ్లను, సొంత ఊరిని వదిలి వలస పోతున్న వారు లక్షల్లో ఉన్నారు. దీనికంతటికి చంద్రబాబే కదా కారణం.
హామీలు గాలిలో...
రైతు రుణమాఫీ అన్నారు. నామమాత్రంగా ఇచ్చారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ..రెండు, మూడో తడవ ఇంకా అందలేదు. ఇచ్చింది.. వడ్డీ చెల్లింపులకే సరిపోయింది. నిరుద్యోగ భృతి...దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నాలుగున్నరేళ్లు ఊరించి ఎన్నికల వేళ స్వల్పంగా అదికూడా 10 శాతం మందికి కూడా ఇవ్వలేదు. కుల కార్పొరేషన్లకు వేల కోట్లు అన్నారు. అన్నీ గాలికొదిలేశారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడమే...
అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేసి చట్టాన్ని, న్యాయాన్నితుంగలో తొక్కేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోరు. తనపై కేసులు పడతాయేమోననే భయంతో సీబీఐనే రాష్ట్రంలోకి రానివ్వకుండా చేశారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కూడా వాటిపని వాటిని చేసుకోనివ్వరు. ఇన్‌కంటాక్స్ తనిఖీలు వద్దంటాడు. ఎందుకు భయం. పెద్ద దొంగ, చిన్నదొంగలుగా సీఎం, మంత్రులూ ఉన్నారు.
నాయకుడి లక్షణాలేవీ బాబులో లేవు.
చంద్రబాబు పాదయాత్ర ద్వారా ఏం తెలుసుకున్నారు? సీఎం అయ్యాక వైఎస్, ఎన్టీఆర్‌లా ప్రజలకు పనికొచ్చే పథకం ఒక్కదాన్నైనా చేపట్టారా? ఓటర్లను ప్రలోభపెట్టే పథకాలను మాత్రమే ప్రవేశపెట్టారు. ప్రజలు అన్నీ మర్చిపోతారనే ధీమా ఆయనది. బీసీలకు 120 హామీలిచ్చి ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు. ఎమ్మెల్యేలు మహిళా అధికారులను జుట్టుపట్టుకుని కొట్టినా వెనకేసుకొచ్చారంటే ఆయన వైఖరి అర్థంచేసుకోవచ్చు. భజనపరులకే ఆయన లీడరు. జనాలకు కాదు. అబద్దాలు చెప్పడంలో, వ్యవస్థలు మేనేజ్ చేయడంలో, దోచుకోవడంలో లీడర్. ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కడంలో పరిణతి చెందాడు.
ప్రభుత్వ ధనంతో దొంగ పోరాటం
తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ ధనంతో ధర్మపోరాటాలంటూ దొంగ దీక్షలు చేసి ప్రజలను మభ్యపెట్టారు. మొన్నటి వరకూ ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీలను స్వాగతించిన వ్యక్తి. ప్రత్యేకహోదా అడిగితే కాళ్లు విరగ్గొట్టి స్టేషన్లలో వేయించి, కోర్టుల చుట్టూ తిప్పమని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చిన ప్రతిపక్షనేత జగన్ దానిలో పాల్గొనడానికి వెళుతుంటే వైజాగ్ విమానాశ్రయంలోనే అరెస్ట్ చేయించి, ఉద్యమాన్ని అణగదొక్కిన వ్యక్తి. చివరకు వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో ప్రజా ఉద్యమం తీవ్రం కావడంతో యూటర్న్ తీసుకుని ప్రజాధనంతో అబద్ధాలు ప్రచారం చేయడం ఆయనకే చెల్లు. ప్రత్యేక హోదా అంశం ఇంకా బతికుందంటే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వల్లే.
సీఎంగా బాబు సాధించిందేముంది...
ఓటుకు నోటు కేసులో భయపడి, పాతిక కేసులపై స్టే తీసుకుని కాలం గడుపుతున్న చరిత్ర చంద్రబాబుది. అతను ఆ ఒక్క దాంట్లోనే ముందున్నాడు. రాజ్యాంగ వ్యవస్థలతోపాటు అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేసి ఎంతో తీవ్రమైన కేసుల దర్యాప్తు జరగకుండా స్టేలు తెచ్చుకుని అడ్డుకున్నాడు. అలా జరగడానికి అమరావతినుంచి ఢిల్లీదాకా సామాజికవర్గం వారినే ముందు చూపుతో నింపుకున్నాడు. ఆ కేసుల్లో దర్యాప్తు జరిగితే ఈ పాటికి సెంట్రల్ జైల్లో ఉండేవాడు. మోదీలాంటి గొప్ప ప్రధానిని ఎప్పుడూ చూడలేదంటాడు. కాంగ్రెస్‌తో జతకట్టి ఢిల్లీలో తాకట్టు పెడుతున్నాడు. కుళ్లు రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేసే సీఎం దేశంలో ఎవరయ్యా అంటే స్కూలుకెళ్లే పిల్లాడుకూడా చంద్రబాబు పేరు చెబుతాడు.
దోచుకునేందుకే పోలవరం బదలాయింపు
వేల కోట్లు బినామీ పేర్లతో స్వాహా చేసేందుకు పోలవరం ప్రాజెక్టును కేంద్రంనుంచి తీసుకుని తనవాళ్ల పేరుతో చంద్రబాబు కాంట్రాక్టులు చేయిస్తున్నాడు. ఇటీవల ఐటీ దాడులు జరిగినపుడు అన్ని నిజాలు బైటపడ్డాయి. అందుకే చంద్రబాబు గగ్గోలు పెట్టాడు. కొడుకుతోనూ పెట్టించాడు. తన సామాజిక వర్గానికి చెందిన వారికి వేల కోట్లు దోచి పెట్టడానికే ప్యాకేజీ పేరుతో నిధులు రాబట్టుకున్నాడు. ఘన కార్యం చేసినట్లు రాష్ట్రంలోని జనాన్నంతా తీసుకువచ్చి విహార యాత్రలా చూపించాడు. ఈ ప్రచారంకోసమే కోట్లు ఖర్చుపెట్టాడు.
పేదలు పేదలుగానే ఉన్నారు...
బాబు పాలనలో పేదలు పేదలుగానే ఉండిపోయారు. ఎన్నికల వచ్చేసరికి తాయిలాలు వేస్తున్నట్లు నటిస్తున్నాడు. పసుకుకుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో చెల్లని చెక్కులిచ్చి మోసం చేస్తున్నాడు. డ్వాక్రా మహిళలను నిలువుగా ముంచాడు. ఇంతకాలం ఉండి ఇప్పుడు జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో భయపడి తాయిలాలు ప్రకటించాడు.
టీడీపీ గొడుకు కింద పవన్, మాజీ జేడీ
టీడీపీ గొడుగు కింది పవన్, జేడీ లక్ష్మీనారాయణ సేదతీరుతున్నాడు. ధైర్యంగా చంద్రబాబు పక్కన ఉన్నామని చెప్పుకోలేక ఈ నాటకాలెందుకు. ఏ సందేశమిస్తున్నారు మీరు.
ప్రజాసంకల్ప యాత్రతో జనానికి చేరువైన జగన్...
పేదవాడి కష్టం నాది అని జగన్ అన్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకూ వారికోసమే తపించి, వారి కష్టనష్టాలు తెలుసుకుంటూ ఏడాదికి పైగా వారిలో కలిసిపోయాడు. వారి కష్టాలు ఎలా తీర్చాలనే సంకల్పంతో ఉన్నాడు. లీడర్‌గా ఎదిగాడు. ఆయన సంకల్ప బలాన్ని జాతీయ స్థాయి నాయకులు మెచ్చుకుంటున్నారు. పాదయాత్ర చివర్లో జాతీయ మీడియా దీన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఎల్లో మీడియాకు మాత్రం ఇది కనపడదు. పదేళ్లుగా జనం మధ్యే ఉన్నాడు. ప్రజలు ఈయనను నమ్మారు. జగన్ అంటే ఓ నమ్మకం. ఓ భరోసా. ఓ అండ. ఓ ఓదార్పు.
విలువలకు, విశ్వసనీయతకే ఓటేయండి...
పేదప్రజలు, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్‌గారు. విలువలకు, విశ్వసనీయతకు ఓటేయండి. మాయలు చేసే మోసగాడు చంద్రబాబు బుట్టలో పడొద్దు. ఆయనకు ఓటేస్తే మన జీవితాలు నాశనమవుతాయి. త్వరలోనే నరకాసురుడి చరిత్ర అంతం కాబోతుంది. ఆరోజే దీపావళి. మన జీవితాల్లోవెలుగులు.
వాళ్లు రియల్ హీరోస్...వీళ్లు రీల్....
వైఎస్సార్, ఎన్టీయార్ రియల్ హీరోస్. చిరంజీవి, పవన్‌తదితరులు రీల్ హీరోస్. ప్రజల కష్టనష్టాలను పట్టించుకున్నావారే రియల్ నాయకులు. సినీ పరిశ్రమనుంచి ఎన్టీయార్ తరువాత రాజకీయాల్లోకి వచ్చిన వారికి అంత ఆదరణ లేదు. స్వలాభం, అధికారం కోసం పార్టీలు పెట్టేవారిని, ఎన్నికలయ్యాక కనిపించని రీల్ హీరోలను ప్రజలు గుర్తించరు. ఓడిస్తారు కూడా. ఏరోజూ ప్రజల సమస్యల గురించి పట్టించుకోని వారు వచ్చి పార్టీలు పెట్టి, సీఎంను చేయండి అని దేబిరిస్తున్నారు. 2009లో పంచెలూడదీసి కొడతామన్నారు. దానికి రిటన్ గిఫ్ట్‌గా ప్రజలు నిజమైన సినిమా చూపించారు. దాంతో 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి ప్రశ్నిస్తామన్నారు. వీళ్లు మద్దతిచ్చిన టీడీపీని ప్రజలు చీదరించుకునే సరికి బైటకు వచ్చి అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టినట్లు నటిస్తున్నారు. ఇపుడు రంగు మార్చి తాటతీస్తాం అంటున్నారు. మాకు మద్దతిస్తే అండగా ఉంటామని టీడీపీతో చీకటి ఒప్పందం చేసుకుని నాటకాలు ఆడుతున్నారు. ప్రజలకు అర్థమైంది. వారే కర్రుకాల్చి వాతలు పెడతారు.
Comments
Please login to add a commentAdd a comment