కొలువులన్నీ భర్తీ చేస్తాం | YS Jagan election campaign in Kurnool and Anantapur districts | Sakshi
Sakshi News home page

కొలువులన్నీ భర్తీ చేస్తాం

Published Sun, Mar 31 2019 3:45 AM | Last Updated on Sun, Mar 31 2019 9:35 AM

YS Jagan election campaign in Kurnool and Anantapur districts - Sakshi

కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం. ప్రసంగిస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

చంద్రబాబు ఒక్కడు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టా? లేక ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టా? ఎక్కడైనా ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగున్నట్టు భావిస్తారు. మన దగ్గర మాత్రం చంద్రబాబు బాగుంటే చాలు రాష్ట్రం మొత్తం బాగున్నట్టేనని ఎల్లో మీడియా పత్రికల్లో రాస్తున్నారు. చంద్రబాబు కూడా మైకు పట్టుకొని అదే చెబుతున్నాడు.
– నందికొట్కూరు సభలో..

సాక్షి ప్రతినిధి, కర్నూలు/అనంతపురం/అనంతపురం:  ‘‘చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్‌నాథన్‌ కమిటీ వెల్లడించింది. ఈ ఐదేళ్లలో 90 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. దాంతో మొత్తం ఖాళీల సంఖ్య 2.30 లక్షలకు పైమాటే. కానీ, ముఖ్యమంత్రి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేసిన పాపాన పోలేదు. నిరుద్యోగుల కష్టాలు నాకు తెలుసు. అందుకే రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖాళీగా ఉన్న మొత్తం 2.30 లక్షల పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇస్తున్నా. ఉద్యోగాల భర్తీకి ప్రతిఏటా జనవరి 1వ తేదీన క్యాలెండర్‌ విడుదల చేస్తాం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి, చదువుకున్న 10 మంది పిల్లలకు అక్కడే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమిస్తాం. వారికి నెలకు రూ.5 వేల గౌరవ వేతనం అందజేస్తాం’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన శనివారం కర్నూలు జిల్లా నందికొట్కూరు, ఎమ్మిగనూరు, అనంతపురం జిల్లా మడకశిర, పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లిలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో మన పిల్లలకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు గానీ తన కుమారుడు లోకేశ్‌కు మొదట ఎమ్మెల్సీ, తర్వాత మంత్రి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని మండిపడ్డారు. నాలుగు సభల్లో జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే..  

మనం తీసుకొచ్చే మరో విప్లవాత్మకమైన మార్పు ఏమిటంటే. మన దగ్గర ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టాన్ని తీసుకొస్తాం. దీనివల్ల మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండదు. మన దగ్గరే పనిచేసుకోవచ్చు.

ధనిక ముఖ్యమంత్రి పాలనలో పేద రైతులు  
నందికొట్కూరు సభలో..
చంద్రబాబు పాలనలో మన పరిస్థితి ఏమిటో ప్రజలు ఆలోచించాలి. ఐదేళ్ల పాలన తర్వాత దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు మొదటి స్థానం సంపాదించాడు. కానీ, మన రైతులు మాత్రం దేశంలోనే అత్యంత నిరుపేదలని సర్వే నివేదికలే చెబుతున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల రైతుల కంటే మన రాష్ట్రంలోని రైతులే అత్యధిక రుణభారాన్ని మోస్తున్నారని నాబార్డు నివేదిక వెల్లడించింది. చంద్రబాబు సీఎం అయ్యే నాటికి పొదుపు సంఘాల మహిళల రుణాలు రూ.14,200 కోట్లు ఉండేవి. అవన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. మాఫీ చేయకపోవడంతో ఆ రుణాలు వడ్డీలతో కలిపి తడిసిమోపెడై అక్షరాలా రూ.26,000 కోట్లకు ఎగబాకాయి. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య ఈ ఐదేళ్లలో రెట్టింపైంది. ఏ పట్టణానికి వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా నిరుద్యోగులు కనిపిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలి? అన్న అని అడుగుతున్నారు. చంద్రబాబు ఒక్కడు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టా? లేక ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టా? ఎక్కడైనా ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగున్నట్టు భావిస్తారు. మన దగ్గర మాత్రం బాబు బాగుంటే చాలు రాష్ట్రం మొత్తం బాగున్నట్టేనని ఎల్లో మీడియాలో రాస్తున్నారు. బాబు కూడా మైకు పట్టుకొని అదే చెబుతున్నాడు.
 
లక్షల ఉద్యోగాలు ఊడగొట్టాడు..: జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలని ఊదరగొడుతున్నారు. నేను ప్రజలనే అడుగుతున్నా.. జాబు రావాలంటే (బాబు పోవాలి అని జనం కేకలు) చదువులు పూర్తి చేసుకున్న మన తమ్ముళ్లు, చెల్లెళ్లు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. మన రాష్ట్రంలో 1.70 లక్షల ఇళ్లు ఉన్నాయి. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేశాడు. ఒకవేళ ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. 60 నెలలకు గాను ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షలు బాకీ పడ్డాడు. మన యువతకు ఉద్యోగాలు రాలేదు గానీ చంద్రబాబు కుమారుడికి మాత్రం వచ్చింది. బాబు తన కుమారుడికి మొదట ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చుకున్నాడు. తర్వాత ప్రమోషన్‌ ఇచ్చి మంత్రిగా కూడా చేసుకున్నాడు.

ఐదేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు అని అడిగితే చంద్రబాబు నోటిలోంచి మాటలు రావడం లేదు. కానీ, బాబు పాలనలో లక్షలాది ఉద్యోగాలు ఊడిపోయాయి. 30 వేల మంది ఆదర్శ రైతులను తొలగించాడు. గృహ నిర్మాణ శాఖలో 3 వేల మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లను ఇంటికి పంపించాడు. వెయ్యి మంది గోపాలమిత్రలను విధుల నుంచి తొలగించాడు. సాక్షర భారత్‌లో పనిచేస్తున్న 30 వేల మందిని తొలగించాడు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న 85 వేల మంది అక్కచెల్లెమ్మల ఉద్యోగాలను ఊడగొట్టాడు. జీతాలు పెంచండి అని కోరిన ఉద్యోగులపై చంద్రబాబు పోలీసులతో కేసులు పెట్టిస్తున్నాడు. 57 నెలలు అన్యాయం చేసి, చివరి 3 నెలల్లో నిరుద్యోగ భృతి అంటున్నాడు. రాష్ట్రంలో 1.70 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే, చంద్రబాబు మాత్రం కేవలం 3 లక్షల మందికే భృతి ఇస్తానంటున్నాడు. అది కూడా ముష్టి వేసినట్లు నెలకు రూ.వెయ్యి మాత్రమే ఇస్తాడట.   

ప్రతి పథకం నేరుగా ప్రజల ఇంటికే... : చంద్రబాబు సీఎం అయ్యే నాటికి ఏపీలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్‌నాథన్‌ కమిటీ వెల్లడించింది. ఆ పోస్టులను చంద్రబాబు భర్తీ చేస్తాడని నిరుద్యోగులు ఆశించారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌ సెంటర్లలో చేరారు. ఈ ఐదేళ్లలో 90 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. దాంతో మొత్తం ఖాళీల సంఖ్య 2.30 లక్షలకు చేరింది. కానీ, ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయని ఘనత చంద్రబాబుదే. 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో నిరుద్యోగుల కష్టాలను ప్రత్యక్షంగా చూశా, వారి బాధలు విన్నాను. మీకు నేనున్నానని మాట ఇస్తున్నా. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖాళీగా ఉన్న మొత్తం 2.30 లక్షల పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇస్తున్నా. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రతిఏటా జనవరి 1న క్యాలెండర్‌ విడుదల చేస్తాం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి చదువుకున్న 10 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్‌ను నియమిస్తాం. వారికి నెలకు రూ.5 వేల గౌరవ వేతనం అందజేస్తాం. తన పరిధిలోని 50 ఇళ్ల బాధ్యత ఆ వలంటీర్‌దే. రేషన్‌కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు నవరత్నాల్లోని సంక్షేమ పథకాలను నేరుగా ప్రతి ఇంటికీ చేరవేస్తాడు. ప్రజలకు మేలు చేసే విషయంలో కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు చూడం అని భరోసా ఇస్తున్నా.   

హోదా ఇస్తామన్న పార్టీకే కేంద్రంలో మద్దతు..: పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను మన పిల్లల్లో పెంపొందించడానికి ప్రతి జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు నెలకొల్పుతాం. ఆ సెంటర్లలో పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తాం. ఆర్టీసీతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలు ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి బస్సులు, కార్లను అద్దెకు తీసుకుంటున్నాయి. మన ప్రభుత్వం వచ్చాక ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతకే కల్పిస్తాం. వారు బస్సులు, కార్లు కొని ప్రభుత్వానికి అద్దెకు ఇచ్చుకోవచ్చు. ఆయా వాహనాలు కొనుక్కోవడానికి సబ్సిడీ కూడా ఇస్తాం. ఇందులోనూ 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకే ఇస్తాం. 25 లోక్‌సభ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంటే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన పార్టీకే కేంద్రంలో మద్దతు ఇస్తాం. హోదా వస్తే ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఎన్నో పరిశ్రమలు, హోటళ్లు, ఆసుపత్రులు వస్తాయి. యువతకు ఉద్యోగాలు దక్కుతాయి.  

చంద్రబాబుకు మరోసారి ఓటేస్తే ఇక ప్రభుత్వ స్కూళ్లు ఉండవు. ప్రతి గ్రామానికి నారాయణ స్కూళ్లు వస్తాయి. ఇప్పటికే నారాయణ స్కూళ్లలో ఎల్‌కేజీ చదవాలంటే ఏడాదికి రూ.20 వేలు గుంజుతున్నారు. మళ్లీ చంద్రబాబు వస్తే ఎల్‌కేజీకి రూ.లక్ష చెల్లించాల్సి వస్తుంది. ఇంజనీరింగ్‌ చదవాలంటే ఏడాదికి రూ.5 లక్షల దాకా చెల్లించక తప్పదు

ప్రాజెక్టులంటే బాబుకు పట్టదా?  
నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంలో 80 శాతం పనులు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మిగిలిన 20 శాతం పనులను పూర్తి చేయలేదు. మొత్తం 12 పంపులకు గాను, 4 పంపులు బిగించారు, అందులో కేవలం రెండే పని చేస్తున్నాయట. అవి కూడా అరకొరగానే నీటిని పంపు చేస్తున్నాయట. కేసీ కెనాల్‌ కింద మార్చి వరకు రెండో పంటకు కూడా సాగునీరు ఇవ్వాలి. కానీ, మొదటి పంటకు కూడా సరిగ్గా నీళ్లు ఇవ్వలేని అధ్వాన్నమైన పరిస్థితి ఉంది. బనకచర్ల వద్ద రెగ్యులేటర్‌ విస్తరణ చేపట్టాలని, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పూర్తి చేయాలని, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చాలని దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. బనకచర్ల రెగ్యులేటర్‌ విస్తరణ పనులు ఆయన హయాంలోనే 80 శాతం పూర్తయ్యాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. హంద్రీ–నీవా నుంచి మిడతూరు, నందికొట్కూరు, జూపాడుబంగ్లా మండలాల్లోని చెరువులకు ఎత్తిపోతల ద్వారా నీరిచ్చేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మాట ఇచ్చాడు. ఇది జరిగిందా? అని అడుగుతున్నా.  

రైతుకు మద్దతు ధర కలేనా?   
చంద్రబాబు పాలనలో రైతన్నల పరిస్థితి దారుణంగా మారింది. వరికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,750 అంటున్నారు. కానీ, రైతన్న చేతికి రూ.1,200 కూడా రావడం లేదు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.1,700. కానీ, రైతులకు రూ.1,100 కూడా దక్కడం లేదు. శనగకు కనీస మద్దతు ధర రూ.5,200. రైతులకు రూ.3,500 కూడా రావడం లేదు. జూపాడుబంగ్లా మండలాన్ని మెగా అల్ట్రా ఫుడ్‌పార్కుగా మారుస్తామని హామీ ఇచ్చారు. నందికొట్కూరులోని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఒక్కటైనా అమలు కాలేదు. ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తి ఇచ్చిన మాటకే దిక్కూదివాణం లేకుండా పోయింది.   

చేనేత కార్మికులకు ఇళ్లు, రుణాలిస్తాం
ఎమ్మిగనూరు సభలో..
చేనేత కార్మికులకు రుణమాఫీతో పాటు వారిని అన్ని విధాలా ఆదుకుంటానని చంద్రబాబు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మోసం చేశాడు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేతలకు సున్నా వడ్డీకే రూ.లక్ష వరకు రుణం అందజేస్తాం. ప్రతి చేనేత కార్మికుడికి ఆర్టిజాన్‌ కార్డు, ఐడీ కార్డు ఇస్తాం. అంతేకాకుండా వారికి ఇళ్లు, మగ్గాలకు షెడ్లూ నిర్మించి ఇస్తాం. మగ్గం ఉన్న ప్రతి ఇంటికి సంవత్సరానికి రూ.24 వేలు ఇస్తాం.
 
రైతులను దగా చేసిన ఏకైక సీఎం బాబే  
కరువు వచ్చి, రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నా సర్కారు పట్టించుకోకపోవడం దారుణం. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. పంటలు నష్టపోతే బీమా సొమ్ము ఇవ్వకుండా అన్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో చంద్రబాబే. బాబు పాలనలో ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేదు. చంద్రబాబు తన హెరిటేజ్‌ కంపెనీ లాభాల కోసం దళారులతో చేతులు కలిపాడు. రైతుల నుంచి తక్కువ ధరకే పంటలు కొనుగోలు చేసి, తన దుకాణాల్లో అధిక ధరలకు అమ్ముకుంటున్నాడు. అన్నదాతలను దగా చేస్తున్నాడు. బాబు ఐదేళ్ల పాలనలో మనం చూసింది మోసం.. మోసం.. మోసం.  

మరో 12 రోజులు ఓపిక పడితే చాలు   
మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు చూపని డ్రామా ఉండదు, చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు. బాబు కుట్రలను ఛేదించాలి. ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి చంద్రబాబు ప్రతి గ్రామానికీ డబ్బు మూటలు పంపిస్తాడు. ప్రతి ఓటర్‌ చేతిలో రూ.3 వేలు పెట్టి, ఓట్లు కొనేయాలని చూస్తాడు. మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని ప్రతి ఒక్కరికీ చెప్పండి. 12 రోజులు ఓపిక పట్టండి, మన అందరి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ‘అమ్మ ఒడి’ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తాడని అక్కచెల్లెమ్మలకు చెప్పండి. ఎన్ని రూ.లక్షలు ఖర్చయినా సరేమన పిల్లలను అన్న ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్‌ వంటి పెద్ద చదువులు ఉచితంగా చదివిస్తాడని చెప్పండి. ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళలకు అప్పు ఎంతైతే ఉంటుందో అంతే సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాడని, ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారులను చేస్తాడని తెలియజేయండి.

45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఉచితంగా ఇస్తాడని చెప్పండి. పెట్టుబడి కోసం ‘రైతు భరోసా’ కింద ప్రతి ఏడాది మే నెలలో నేరుగా ప్రతి రైతన్న చేతిలో రూ.12,500 పెడతాడని చెప్పండి. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తాడని చెప్పండి. పంటలకు గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఇస్తాడని చెప్పండి. 12 రోజులు ఓపిక పడితే మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు, పెన్షన్‌ను రూ.3 వేల దాకా పెంచుకుంటూ పోతాడని ప్రతి అవ్వాతాతకు చెప్పండి. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని నిరుద్యోగ యువతకు, చదువుకుంటున్న పిల్లలకు చెప్పండి. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అన్న భర్తీ చేస్తాడని తెలియజేయండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు అన్న ఇల్లు కట్టిస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. మనం ప్రకటించిన నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని ప్రతి ఇంటికీ చేర్చండి.   

రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేతలకు సున్నా వడ్డీకే రూ.లక్ష వరకు రుణం అందజేస్తాం. ప్రతి చేనేత కార్మికుడికి ఆర్టిజాన్‌ కార్డు, ఐడీ కార్డు ఇస్తాం. అంతేకాకుండా వారికి ఇళ్లు, 
మగ్గాలకు షెడ్లూ నిర్మించి ఇస్తాం. మగ్గం ఉన్న ప్రతి ఇంటికీ సంవత్సరానికి రూ.24 వేలు ఇస్తాం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం 
మడకశిర సభలో..
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నాకు తెలుసు. వారి సమస్యలను పరిష్కరిస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తాం. చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడిచి, 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నాడు. ఇప్పుడు ప్రజలను ఓట్లు అడగడానికి ధైర్యం లేక ఢిల్లీ నుంచి నాయకులను తెచ్చుకుంటున్నాడు. గత ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో 650 హామీలిచ్చాడు. ప్రతి కులానికీ ఒక పేజీ కేటాయించాడు. ఐదేళ్లలో ప్రతి కులాన్ని మోసం చేశాడు. ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి మేనిఫెస్టోను మాయం చేశాడు.   

నారావారి సారా పారిస్తున్నాడు  
జాబు రావాలంటే బాబు రావాలన్నారు. బాబు వచ్చాడు.. ఉన్న జాబులన్నీ ఊడగొట్టాడు.  డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టాడు.  బాబు పాలనలో నేరగాళ్లకు తప్ప ప్రజలకు భద్రత లేదు. మహిళల పట్ల రాక్షసంగా ప్రవర్తించిన టీడీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎస్సీ, ఎస్టీల భూములను లాక్కున్నారు. బీసీలపై ప్రేమ ఉందని చంద్రబాబు చెబుతాడు. అదే బీసీ పిల్లలు చదువుకునే అవకాశం లేకుండా హాస్టళ్లను ఎత్తేస్తున్నాడు. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో 6 వేల ప్రభుత్వ బడులను మూసేశారు. కానీ, ప్రతి గ్రామంలోనూ వీధివీధిన మద్యం దుకాణాలు ఏర్పాటు చేశాడు. తాగడానికి మంచినీళ్లు ఇవ్వలేదు గానీ నారావారి సారా పారిస్తున్నాడు.

రాష్ట్రంలో పోలీసు స్టేషన్లు పెరగలేదు గానీ ప్రతి గ్రామానికో జన్మభూమి కమిటీ మాఫియాను తయారు చేశాడు. చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతుంటాడు. కానీ ‘108’కు ఫోన్‌ కొడితే అంబులెన్స్‌ వస్తుందో రాదో తెలియదు. మంత్రి యనమల రామకృష్ణుడికి పంటినొప్పి వస్తే సింగపూర్‌కు పంపడానికి బాబు దగ్గర డబ్బులుంటాయి. కానీ, పేదవాడికి గుండెనొప్పి వచ్చి పక్క రాష్ట్రానికి వెళ్లి ఆపరేషన్‌ చేయించుకోవాలంటే ఆరోగ్యశ్రీ వర్తించదు అని చెబుతున్నాడు. రాజధానికి అమరావతి అని పేరు పెట్టారు. కానీ. అక్కడ అమరేశ్వరుడి భూములను కొల్లగొట్టారు. రాజధాని నిర్మాణంలో బాహుబలి సినిమా చూపించారు. సీఎం రాజధాని ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటున్నాడు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని బాబు హామీ ఇచ్చాడు. అది అమలు చేయకుండా రూ.లక్షల కోట్లతో లోకేశ్‌ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసుకున్నాడు.  

సీఎం హోదాలో ఇచ్చిన హామీలకే దిక్కు లేదు  
మడకశిర నియోజకవర్గంలో హంద్రీ–నీవా ద్వారా నీళ్లు ఇవ్వడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.250 కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు పూర్తి చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మిగిలిన 20 శాతం పనులు కూడా పూర్తి చేయలేదు. మడకశిరలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. మడకశిరకు బాబు ఇచ్చిన హామీలకు దిక్కు లేదు. పరిశ్రమల కోసం 1,600 ఎకరాలు సేకరించారు. ఒక్క పరిశ్రమైనా స్థాపించారా? అమరాపురం, గుడిబండలో డిగ్రీ కళాశాలలు కట్టిస్తానని హామీ ఇచ్చి విస్మరించాడు. 22 కిలోమీటర్ల రింగురోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కనీసం రెండు కిలోమీటర్లయినా ఏర్పాటు చేశారా? మడకశిర నియోజకవర్గంలో చింతపండు, పట్టుగూళ్లు, వక్క పంటలు అధికంగా పండిస్తారు. వాటికి గిట్టుబాటు ధరలు రావడం లేదు. చంద్రబాబు హయాంలో ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. చంద్రబాబు సీఎం అయ్యే నాటికి రైతుల అప్పులు రూ.87,612 కోట్లు ఉండేవి. బాబు వాటిని మాఫీ చేయకపోవడంతో వడ్డీలతో కలిపి ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లకు చేరాయి.  

‘కియా’ పేరుతో కుంభకోణాలు  
సోమందేపల్లి సభలో..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొరియాకు వెళ్లి అక్కడి ప్రధానితో చర్చించడం వల్ల కియా మోటార్స్‌ సంస్థ వచ్చింది. ‘కియా’ పేరుతో మన రాష్ట్రంలో జరిగిన కుంభకోణాలు అన్నీఇన్నీ కావు. కియాకు రైతులు తమ భూములు ఇచ్చారు. కానీ, రైతులకు ఇచ్చిన పరిహారం చూస్తే చెనక్కాయలకు బెల్లం ఇచ్చినట్లుగా ఇచ్చారు. అనంతపురం జిల్లాలో కియా సంస్థ వస్తుందని ముందే తెలిసి ప్రభుత్వ పెద్దలు చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతుల నుంచి భూములు తక్కువ ధరకే కొనేశారు. అప్పటికే చదునుగా ఉన్న ఆ భూమిని చదును చేసే కాంట్రాక్టుకు ఎల్‌అండ్‌టీ సంస్థకు కట్టబెట్టారు. 600 ఎకరాలకు రూ.177 కోట్లు ఖర్చు చేశారు. ఎల్‌అండ్‌టీ సంస్థ చంద్రబాబుతో కుమ్మక్కై టీడీపీ నేతలకు సబ్‌కాంట్రాక్ట్‌లు ఇచ్చింది. ఇంత దారుణంగా రాష్ట్రాన్ని దోచేస్తున్న వీరిని పాలకులు అనాలా? రాక్షసులు అనాలా? ప్రభుత్వ పెద్దల లంచాలు, కమీషన్ల దెబ్బకు వచ్చే పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయి. 2015 సెప్టెంబర్‌లో ‘భెల్‌’ వస్తోందన్నారు. నాసన్‌ కంపెనీ వస్తుందన్నారు. ఎయిర్‌బస్‌ కూడా వస్తుందన్నారు. కానీ, ఏదీ రాలేదు.  

బాబుకు ఓటేస్తే అంతే సంగతులు  
చంద్రబాబుకు పొరపాటున మళ్లీ ఓటేస్తే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలే ఉండవు. ఇప్పటికే ఐదేళ్లలో 6 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసేశారు. బాబుకు ఓటేస్తే ప్రతి గ్రామానికి నారాయణ స్కూళ్లు వస్తాయి. నారాయణ స్కూళ్లలో ఎల్‌కేజీ చదవాలంటే ఏడాదికి రూ.20 వేలు గుంజుతున్నారు. మళ్లీ చంద్రబాబు వస్తే ఎల్‌కేజీకి రూ.లక్ష చెల్లించాల్సి వస్తుంది. ఇంజనీరింగ్‌ చదవాలంటే ఏడాదికి రూ.5 లక్షల దాకా చెల్లించక తప్పదు. ఇప్పటికే ఆర్టీసీ చార్జీలు, కరెంట్‌ చార్జీలు, ఇంటి పన్నులు, పెట్రోలు, డీజిల్‌ రేట్లు చూస్తే బాదుడే బాదుడు. మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే బాదుడు కాదు, ఇక వీర బాదుడే.  చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తే పింఛన్లు రద్దు చేస్తాడు. రేషన్‌ కార్డుల్లో కోత వేస్తాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా ఇవ్వడు.  

ప్రజలకు భూములు, ఇళ్లు మిగలవు  
చంద్రబాబుకు ఓటేస్తే పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు తీసుకునే రుణాలపై వడ్డీ మామూలుగా ఉండదు. బాదుడే బాదుడు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పేరు చెప్పి రైతులకు రుణాలు రాకుండా చేస్తాడు. ఇప్పటికే రైతులకు సున్నావడ్డీ పథకం ఎగిరిపోయింది. బాబు పాలనలో భూములు, ఇళ్లను ఆక్రమించుకునేందుకు భూసేకరణ చట్టానికి సవరణ చేశారు. వెబ్‌ల్యాండ్‌ను తీసుకొచ్చారు. భూముల రికార్డులను తారుమారు చేస్తున్నారు. రికార్డులు మాయం చేసే కుట్రలు జరుగుతున్నాయి. బాబుకు మళ్లీ ఓటేస్తే ప్రజలకు భూములు, ఇళ్లు మిగలవు. ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, నదులను కూడా దోచేస్తాడు. ఇప్పటికే గ్రామాల్లో జన్మభూమి కమిటీ మాఫియాలు రాజ్యమేలుతున్నాయి. పింఛన్‌ కావాలంటే లంచం, రేషన్‌ కార్డులు, ఇళ్లు, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వనిదే పని జరగట్లేదు. బాబుకు ఓటేస్తే బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉద్యోగాలు ఉండవు. బతికే హక్కు ఉండదు. బీసీలకు శక్తి సామర్థ్యాలు ఉండవు, వారిని జడ్జిలుగా నియమించొద్దని  బాబు లేఖలు రాశాడు. ఆయనకు మళ్లీ పొరపాటున ఓటేస్తే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఎవరూ బతకరు.  

ఒక్క పరిశ్రమైనా వచ్చిందా?   
కరువు ఎలా ఉంటుందో చూడాలనుకుంటే రాజస్థాన్‌ తర్వాత అనంతపురం జిల్లాకు రావాలి. ఈ జిల్లాకు ఏదైనా మేలు జరిగిందంటే అది దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే. జిల్లాకు నీళ్లు రావాలని చిత్తశుద్ధితో పని చేశారు. ఆయన హయాంలోనే గొల్లపల్లి రిజర్వాయర్‌కు శ్రీకారం చుట్టారు. 1,100 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. శరవేగంగా పనులు చేశారు. హంద్రీ–నీవా మొదటి దశలో 80 శాతం పనులు వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో పూర్తయ్యాయి. మిగిలిన 20 శాతం పనులు, పిల్లకాలువలను కూడా చంద్రబాబు పూర్తి చేయలేదు. గోరంట్ల మండల కేంద్రంలో తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేవు. పెనుకొండ నియోజకవర్గానికి నీళ్లివ్వాలనే ఆలోచన తెలుగుదేశం పాలకులకు లేదు. కానీ, నియోజకవర్గంలోని పెన్నా, జయమంగళ, చిత్రావతి నదుల నుంచి ఇసుకను యథేచ్ఛగా దోచేశారు. పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల మండలాల్లో వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించింది. కానీ, ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా?   

బాబుకు ఓటేశాం.. ఐదేళ్లు అనుభవించాం  
ఎన్నికల ముందు చంద్రబాబు చూపించే సినిమాలు, డ్రామాలు, టీవీ చానళ్లలో వచ్చే ప్రకటనలను నమ్మితే నరమాంసం తినే అందమైన రాక్షసిని నమ్మి మోసపోయినట్లు ఉంటుంది. బాబును ఇప్పటికే ఒకసారి నమ్మి ఓటు వేశాం. దారుణంగా మోసపోయాం, ఐదేళ్లు అనుభవించాం. బాబు చెప్పే మాటలు విని మరోసారి మోసపోవద్దు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదానికి అర్థం రావాలి. రాజకీయ నాయకుడు ఫలానా పని చేస్తానని హామీ ఇచ్చి, గెలిచిన తర్వాత చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకురావాలి. ఎన్నికలు దగ్గరకొచ్చే కొద్దీ చంద్రబాబు రోజుకో అబద్ధం చెబుతున్నాడు. అదే నిజమని ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తాయి. టీవీ5తో పాటు ఇతర అమ్ముడుపోయిన టీవీ చానళ్లు చూపిస్తాయి. ఇవాళ మనం యుద్ధం చేస్తున్నది ఒక్క చంద్రబాబుతోనే కాదు. ఈనాడుతో, ఆంధ్రజ్యోతితో, టీవీ5తో, ఇతర అమ్ముడుపోయిన చానళ్లతోనూ యుద్ధం చేస్తున్నాం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement