సాక్షి, అమరావతి: అడుగడుగునా ప్రజల్లో కనిపిస్తున్న వ్యతిరేకత, తాను చెప్పే విషయాలకు జనంలో స్పందన కరువవడం.. అన్నింటికీ మించి దేనికీ వెరవకుండా ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యంగా దూసుకుపోతున్న తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వణికిపోతున్నారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఆయనలో ఓటమి భయం అంతకంతకూ పెరిగిపోతోంది. విచక్షణ కోల్పోయి ప్రతిపక్ష నేత జగన్‌పై ఆయన చేస్తున్న అడ్డగోలు ఆరోపణలే ఇందుకు నిదర్శనం. ఎలాగైనా గెలవాలనే ఏకైక లక్ష్యంతో ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెడుతూ తెరచాటు రాజకీయాల్లో వేగం పెంచారు. చంద్రబాబు ప్రసంగాలు చూసిన వారెవరికైనా జగన్‌మోహన్‌రెడ్డిపై మనసులో పెట్టుకున్న కక్ష, తాను ఓడిపోతాననే భయం, గెలవకపోతే తాను ఏమైపోతానో అనే ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. తనలోని భయాలను రాష్ట్ర ప్రజలందరికీ ఆపాదించి.. తాను గెలవకపోతే రాష్ట్రం అన్యాయమైపోతుందని, అభివృద్ధి ఆగిపోతుందని, పింఛన్లు రావని, ప్రాజెక్టులు ఆగిపోతాయనే గోబెల్స్ ప్రచారానికి తెరలేపారు.
విద్వేష ప్రచారం అందుకే..
ఐదేళ్లు పాలించిన ఏ ముఖ్యమంత్రి అయినా తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని అడగడం సాధారణ విషయం. కానీ, తాను ఎంతో అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు.. దాని గురించి మాట్లాడకుండా కేవలం ప్రజల్లో భయాందోళనలు సృష్టించి, ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఆయనలోని ఓటమి భయానికి అద్దంపడుతున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు పెంచి ఈ ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలనే వ్యూహాన్ని 4 నెలల ముందు నుంచే ప్రారంభించిన ఆయన.. ఇప్పుడు దాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. నిత్యం కేసీఆర్‌ను, కేటీఆర్‌ను తిడుతూ, వారితో జగన్‌మోహన్‌రెడ్డి కుమ్మక్కయ్యారని పసలేని ఆరోపణలు పదేపదే చేస్తున్నారు. ఆంధ్రా వాళ్లను హైదరాబాద్‌లో బెదిరిస్తున్నారని, జగన్‌కు కేసీఆర్ సహకరిస్తున్నాడని, వెయ్యి కోట్లు ఇచ్చారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్లను కేసీఆర్ ఖరారు చేస్తున్నారని, జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్లేనని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. కానీ, చంద్రబాబు రాజేయాలనుకుంటున్న ఈ విద్వేషాగ్నికి ప్రజల్లో స్పందన లేకపోవడంతో తన రహస్య మిత్రుడు పవన్‌కళ్యాణ్‌తోనూ ఇవే ఆరోపణలు చేయించడం మొదలు పెట్టారు. అయినా, ఎవరూ పట్టించుకోకపోవడంతో జగన్‌పై ఇష్టానుసారం వ్యక్తిగత ధూషణలకు దిగడం ద్వారా తనలోని భయాన్ని ప్రదర్శించుకుంటున్నారు.
భయంతో జగన్ పథకాలు కాపీ
తాను గొప్పగా చేశానని చెబుతున్న అభివృద్ధిని జనం నమ్మడంలేదని తెలిసి వారిని ఏమార్చేందుకు మళ్లీ ఇష్టానుసారం హామీలు ఇవ్వడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే తాజాగా వృద్ధాప్య పింఛన్‌ను రెండు వేల నుంచి మూడు వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. నిజానికి వృద్ధాప్య పింఛన్‌ను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలకు పెంచుతామని జగన్‌మోహన్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఎన్నికల సభల్లోనూ ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నారు. అయినాసరే, చంద్రబాబు నిస్సిగ్గుగా దాన్ని కాపీకొట్టి పెన్షన్‌ను మూడు వేలకు పెంచుతామని హామీ ఇస్తున్నారు. ఈ హామీని ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పెడతామని చెబుతున్నారు. గతంలో పింఛన్‌ను వెయ్యి నుంచి రెండు వేలకు పెంచుతామని, పింఛన్‌దారుల వయసు అర్హతను 65ఏళ్ల నుంచి 60ఏళ్లకు తగ్గిస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన తర్వాతే చంద్రబాబు దాన్ని కాపీ కొట్టి అమలుచేశారు. ఇలా పింఛన్లు ఒక్కటేకాదు.. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా వంటి పలు పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇంకేమైనా కొత్త పథకాలు ప్రకటిస్తుందేమో, వాటిని కూడా కాపీ కొడదామనే దురుద్దేశంతో తమ మేనిఫెస్టో సిద్ధమైనా ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారు.
సంయమనం కోల్పోయి.. అభద్రతకులోనై..
చంద్రబాబులో అభద్రత, అసహనం తప్ప మరొకటి కనిపించడంలేదని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ప్రత్యర్థులపై నిందలు వేయడం, తననేదో చేస్తారేమోనని ఆందోళన, భయం స్పష్టంగా కనబడుతున్నాయని చెబుతున్నారు. తీవ్ర అసహనంతో సంయమనం కోల్పోయి మాట్లాడుతుండడంతో ఆయనకు బాగా దగ్గరగా ఉండే సీనియర్ నేతలే ఆయన వైఖరి చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఓడిపోతామనే భయమే ఆయనలోని అసహనాన్ని పెంచి తారాస్థాయికి తీసుకెళ్లిందని చెబుతున్నారు. అందుకే పార్టీని వీడి వెళ్లిపోవడానికి సిద్ధపడిన గ్రామస్థాయి నాయకులకు ఫోన్లుచేసి మరీ వెళ్లొద్దని బతిమాలుతున్నారు. తనను ఏకాకిని చేస్తున్నారని, ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని, ఒక్కడిని చేసి ఇబ్బంది పెడుతున్నారని ప్రసంగాల్లో బేలగా మాట్లాడుతున్నారు. తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని, తమ బూత్ కన్వీనర్లు, బూత్ కమిటీ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బెదిరిస్తోందని చెప్పడం ఆయనలోని భయాన్ని తెలియజేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment