సాక్షి, అమరావతి: మార్పు కావాలి. మార్పు తేవాలి. మార్పుతోనే ముందడుగేయాలి... ఇది జనాభిమతం. ఐదేళ్లుగా వెంటాడిన అనుభవాలు కళ్లముందు కదలాడుతుండగా.. గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్న భావావేశంలో ఎవరిని కదిపినా వినిపిస్తున్న భావోద్వేగమిది. ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా నాడిని పసిగట్టేందుకు రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ‘సాక్షి’ ‘రోడ్ షో’ చేపట్టింది.
దారి పొడవునా సాగిన ఈ రాజకీయ చర్చలో రాష్ట్రంలో మార్పు చారిత్రక అవసరమన్న అభిప్రాయం వ్యక్తమైంది. అధికార పార్టీ అక్రమాలపై ఉక్కుపాదం మోపి, ఐదేళ్లు న్యాయ పోరాటం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి ఓవైపు... ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ మరోవైపు ఇక్కడ బరిలో ఉన్నారు. స్థానిక అభ్యర్థులే కాదు... రాష్ట్రంలో ఏ పార్టీని గెలిపిస్తే బాగుంటుందనే వాద ప్రతివాదాలూ స్థానికంగా జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా జనం మనసులో మాటేంటో నిర్మొహమాటంగా బయటపడుతోంది.
నేతన్నను ఆదుకునేదెవరు?
పాత మంగళగిరిలోని పద్మశాలి నగర్ సెంటర్‌లో ఓ సెలూన్ షాప్ దగ్గర జనం మాట్లాడుకుంటున్నారు. ఆ పక్కనే టిఫిన్ సెంటర్ నుంచి, అటుగా వెళ్తున్న మరికొందరితో అక్కడ క్షణాల్లో గుంపు పెరిగింది. ‘ఐదేళ్లవుతోంది. అప్పుల పాలయ్యామని ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పలేదు. విన్నారా? కాలనీ సమస్యలు ఎన్ని చెప్పినా పట్టించుకున్నదెవరు? మళ్లీ ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించాలి?’ నాగరాజు మాటల ఆవేశంతో తోకల బాలరాజు, కారంపూడి శ్రీనివాసరావు జోడీ కట్టారు.
‘ఈ గ్రాఫిక్స్ మాయాజాలం ఇంకా నమ్మొద్దు పెద్దయ్యా. నేను ఎంటెక్ చదివాను. ఏదీ ఉద్యోగం...?’ జీరబోయిన స్వరంతో కారంపూడి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. చేనేత సమస్యలు తీరుస్తానంటున్నాడు జగన్. ఉద్యోగాలిచ్చి తీరుతానంటున్నాడు. ఒక్క అవకాశం ఇద్దాం..’ అని తోకల బాలాజీ, దాసరి వినయ్‌తో పాటు పలువురు అభిప్రాయం వెలిబుచ్చారు.
ఐటీ బాబొస్తే... అంతా పోతుందేమో!
లక్ష్మీనర్సింహ స్వామి కాలనీలో అంతా పేదలే. ‘ఐదేళ్లు ఏం చేసిందయ్యా ఈ ప్రభుత్వం. చూడండి మా కాలనీ. ఏమాత్రమైనా బాగు చేశారా? పైగా అదిగో ఆ పక్క ఐటీ పార్క్ పెడతారట. ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చిన మా భూములూ లాక్కుంటారట. మేం కట్టుకున్న ఇళ్లూ కూల్చేస్తారట...’ రాజేశ్వరి, మంగతాయారు, సూర్యలక్ష్మి భయంతో అన్న మాటలివి. ఇక్కడ లోకేష్ పోటీ చేస్తున్నాడంటేనే తమకు భయమేస్తోందని వారు చెప్పారు. ‘వైసీపీ అభ్యర్థి ఆర్కేను గెలిపించుకున్నాం.
ఎప్పుడైనా సమస్య చెప్పుకునే వీలుంది. లోకేష్ దగ్గరకు మేం వెళ్లగలమా?’ అని ప్రశ్నించాడు నీలి శ్రీకాంత్. ‘మేమీ కాలనీలో ఈ మాత్రం ఉన్నామంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమే. మళ్లీ అలాంటి మంచి రోజులు జగన్ వల్లే సాధ్యం’ అని పేరం నాగమణి చెప్పింది. పేదల ఆవాసాలున్న రత్నాల చెరువు, లక్ష్మీనర్సింహ కాలనీపై ప్రభుత్వం కన్ను పడిందట అని అక్కడి జనం నమ్ముతున్నారు.
ఒక్క అవకాశమిద్దాం
పెదవడ్లపూడి చౌరస్తాలో వృద్ధులు, యువకులు తాజా రాజకీయాలపై జోరుగా చర్చించుకోవడం కన్పించింది. రైతులే ఎక్కువగా ఉన్న ఆ గ్రామంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ అక్కడ చర్చను నిశితంగా పరిశీలిస్తే వాళ్లలో ఏదో తెలియని అసంతృప్తి. ‘పెద్ద దిక్కు అవుతాడని ఓట్లేశాం. ఏమైంది. ఏం పంటకు గిట్టుబాటు ధరొచ్చింది. మన పిల్లల్లో ఎవరికి ఉద్యోగాలొచ్చాయి.
చంద్రబాబు అనుభవం ఏమైనట్టు?’ కోటా ప్రసాద్ నోటివెంట వచ్చిన మాటిది. ‘మార్పు తెస్తానంటున్న జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుంది’ అని పరిమినేని మహేష్ అన్నారు. రైతు కూలీ పిచ్చయ్య కూడా ‘ఈసారి మార్పు రావాల్సిందే’ అన్నాడు. ప్రజల గురించి పట్టించుకునే పార్టీ గెలవాలని వారు కోరుకుంటున్నారు. ఆ సత్తా జగన్‌కు ఉందనేది ప్రజాభిమతం అని వారు తెలిపారు.
అందుబాటులోఉండాలి
గెలిచిన ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏ సమస్యయినా నేరుగా ఆయనకు చెప్పుకొనే పరిస్థితి ఉండాలి. మేం గెలిపించుకున్న నేత కోసం మేమే నిరీక్షించే దుస్థితిని కోరుకోవడం లేదు.
–తోకల బాలాజీ, చిరు వ్యాపారి (మంగళగిరి)
రాజన్న రాజ్యం వస్తుందనే ఆశ
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే ఎంతో అభిమానం. లక్ష్మీనర్సింహ కాలనీలో ఆయన హయాంలోనే పట్టాలొచ్చాయి. దీనికి కృతజ్ఞతగానే ఇక్కడ ప్రతిఒక్కరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పని చేశారు. దురదృష్టం కొద్దీ 2014లో జగన్‌ను గెలిపించుకోలేకపోయాం. ఈసారి మాత్రం జనానికి మంచి జరిగే ప్రభుత్వం వస్తుందని, రావాలని కోరుకుంటున్నాం. జనం కోరుకునే మార్పు సాధ్యమనే భావిస్తున్నాం.
– పేరం నాగమణి, లక్ష్మీనర్సింహ కాలనీ
ఉద్యోగం... ఉపాధి ఇచ్చే సర్కారు కావాలి
ఎంటెక్ చదివా. కాళ్లరిగేలా తిరిగినా ఐదేళ్లుగా ఉద్యోగం రాలేదు. చూస్తుంటే ఆశలన్నీ అడియాశలవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు మమ్మల్ని బతికిస్తున్నాయి. అధికారంలోకి వస్తుందని, మాలాంటి నిరుద్యోగులకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది. ఆ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం.
– దాసరి వినయ్, ఎంటెక్ విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment