మోడుబారిన బతుకుల్లో చిగురించిన ఆశలు | Sakshi Special Story On YSR Rythu Bharosa Scheme | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 2 2019 8:50 AM | Last Updated on Wed, Jan 2 2019 5:36 PM

Sakshi Special Story On YSR Rythu Bharosa Scheme

ఎటుచూసినా నెర్రెలిచ్చిన నేలలు.. వరస కరవులు.. రాష్ట్రంలో సగానికి పైగా మండలాలు నిరంతరం కరవులోనే.. పసిబిడ్డలు తల్లిపాల కోసం ఏడుస్తున్న తీరుగా నీళ్ల కోసం రైతుల ఎదురు చూపులు.. పశువులు కబేళాలకు.. కడుపు నింపుకోవడానికి పొలాలను తెగనమ్ముకుని కూలీల అవతారమెత్తుతున్న రైతులు.. వ్యవసాయ కూలీలు పొట్ట చేత పట్టుకుని పని కోసం రాష్ట్రేతర ప్రాంతాలకు వలసలు.. ప్రతికూల పరిస్థితుల్లో ఏటికి ఎదురీది పంట పండించినా, కనీస మద్దతు ధరా దక్కని దౌర్భాగ్యపు పరిస్థితి.  దళారులు ఆడింది ఆట.. పాడింది పాట.. పాలకులే దళారుల అవతారం ఎత్తిన వేళ ధరల స్థిరీకరణ కలగా మారిన దుస్థితి. రుణమాఫీ సొమ్ము వడ్డీలకు కూడా సరిపోక, కొత్త అప్పు పుట్టక.. బ్యాంకర్ల దృష్టిలో దొంగలన్న అపవాదే మిగిలింది.

సున్నా, పావలా వడ్డీ జాడ లేక.. ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులే దిక్కయిన వేళ అప్పుల కుప్పలే మిగిలిన దయ నీయ పరిస్థితి.. పర్యవసానం.. పూటకో రైతు బలవన్మరణం.. నేలను గుంజుకుంటున్నోడు ఆకాశానికి ఎగబాకుతుంటే, నమ్ముకున్నోడు అదే నేలలో కలిసిపోతున్నాడు. ఈ పరిస్థితి మార్చడానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలను ప్రకటించారు. ఎప్పటికప్పుడు అందరి సూచనలు, సలహాలతో ప్రజా రంజకముగా వాటికి మెరుగులు దిద్దారు. ఈ నవరత్నాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటం ఖాయం అని వివిధ రంగాల నిపుణులు స్పష్టీకరిస్తున్న తరుణంలో నేటి నుంచి ‘సాక్షి’ వాటిని ప్రజల ముంగిటకు తీసుకువస్తోంది. ఈ ప్రయత్నంలో వైఎస్సార్‌ రైతు భరోసా పథకం వివరాలు.. ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులు..     –సాక్షి, అమరావతి

రైతుల కష్టాలన్నింటినీ కళ్లారా చూశారు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. తిరిగి వైఎస్సార్‌ స్వర్ణ యుగాన్ని తెచ్చేందుకు కంకణం కట్టుకున్నారు. ‘రైతు కంట కన్నీరు పెడితే దేశానికే అరిష్టం’ అని వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో.. ఆయన కంటే ఒకడుగు ముందుకేసి ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ అనే రత్నాన్ని (పథకాన్ని) ప్రకటించారు.  

చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం తుమ్మరకుంట పంచాయతీ నావాబ్‌ కోట గ్రామానికి చెందిన గంగులప్పకు మూడెకరాల పొలం ఉంది. టమాటా సాగు చేశాడు. దిగుబడి ఉన్నా ధర లేదు. దీంతో చేసిన అప్పు తీరలేదు. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పెట్టుబడుల కోసం చేసిన అప్పు రూ.1.10 లక్షలయింది. అప్పు ఇచ్చిన ప్రైవేటు వ్యక్తులు ఒత్తిడి చేయడంతో 2017 ఆగస్టు 5న పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన లోవరాజు వరి పండిస్తాడు. గత ఖరీఫ్‌లో పండిన పంటను అమ్ముకోవడానికి పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. పంట చేతికి వచ్చేంత వరకు రూ.1300 పలికిన వడ్ల బస్తా పంట చేతికి వచ్చాక రూ.1100కు పడిపోయింది. దళారుల మాయాజాలంలో చిక్కిన రైతులు చేసేది లేక అయిన కాడికి అమ్ముకుని వడ్డీకి తెచ్చిన అప్పులు తీర్చుకోవాల్సివచ్చింది. ఫలితంగా బస్తాకు సగటున రూ.200 నష్టపోవాల్సి వచ్చింది. క్వింటాల్‌ వరికి ప్రకటించిన మద్దతు ధర రూ.1580 అయితే రైతుకు దక్కింది మాత్రం రూ.1100 కావడం గమనార్హం. రాష్ట్రంలోని రైతులందరిదీ ఇదే దుస్థితి. ఒక్కో రైతుది ఒక్కో దీనగాధ. పంట అమ్ముకోలేక కొందరు, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినా పరిహారం రాక మరికొందరు.. పాలకుల మాయ మాటలు నమ్మి ఇంకొందరు అప్పులపాలయ్యారు. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 

రుణాలు మాఫీ కాక రైతులు కుదేలు 
అధికారంలోకి రావడానికి అడ్డమైన, అలివికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక రైతులను నట్టేట ముంచింది చంద్రబాబు ప్రభుత్వం. రైతుల రూ.87,612 కోట్ల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి, తుదకు ఆ పథకం కింద ఇచ్చిన సొమ్ము వడ్డీలకు కూడా సరిపోక రైతులు డిఫాల్టర్లుగా మిగిలారు. అపరాధ వడ్డీలు కట్టాల్సిన దుస్థితిలోకి వచ్చారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వక పోవడం, పంటల బీమా సొమ్మును ఇతర పనులకు మళ్లించడం, గిట్టుబాటు ధర కల్పించక పోవడం ప్రధానంగా రైతాంగాన్ని కుంగదీసింది. మామిడి, మిర్చి, టమాటా, ఉల్లి, వరి.. పంట ఏదైనా కష్టం రైతుదైతే, లాభం మాత్రం దళారికే.  

భరోసా కరువై.. బతుకు బరువై.. 
వాస్తవానికి రైతులు లక్ష రూపాయల లోపు పంట రుణాన్ని సకాలంలో చెల్లించగలిగితే ఎటువంటి వడ్డీ ఉండదు. ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.3 లక్షల లోపు పంట రుణాలను పావలా వడ్డీకి ఇప్పించాలి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆ మేరకు వడ్డీ రాయితీని బ్యాంకులకు చెల్లించక పోవడంతో సున్నా వడ్డీ, పావలా వడ్డీ పథకాలు అమలు కావడం లేదు. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతులు ధర లేక తమ పంటను రోడ్లపై పోసి నిరసన తెలపడం.. మిర్చి, కంది రైతులు రోడ్డెక్కడం చూశాం. కూలి కూడా గిట్టుబాటు కాక టమాటా రైతులు పంటను రోడ్డుపై పారబోసిపోవడమూ చూశాం. తుపాన్లప్పుడు పంట తుడిచి పెట్టుకుపోవడం కూడా చూశాం. ఈ బాధలు పడలేక రైతు ఆత్మహత్య చేసుకోని రోజంటూ లేదు. 

చంద్రబాబు చెప్పిందిదీ.. 

  • అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాల మాఫీ చేస్తాం (2014 టీడీపీ ఎన్నికల ప్రణాళికలో, బహిరంగ సభల్లో) 
  • 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ 
  • రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి 
  • రైతు వారీగా ఇన్సూరెన్స్‌  
  • చౌకధరలకు మేలు రకం విత్తనాలు 
  • ప్రతి జిల్లాలో ఒక మెగా ఫుడ్‌ పార్క్, ప్రతి మండలంలో ఆగ్రో ప్రాసెసింగ్‌ సెంటర్‌ 
  • రైతులకు మేలు చేసేలా పంటల బీమా  
  • పాడైపోయిన ట్రాన్స్‌ఫార్మర్లకు 24 గంటల్లో మరమ్మతులు  
  • స్వామినాథన్‌ నివేదిక ఆధారంగా కనీస మద్దతు ధరను ప్రకటిస్తాం. (ఎన్నికల ప్రణాళిక పేజీ 13)
  • ప్రత్యేక విత్తన చట్టం తెస్తాం. బీటీ పత్తి విత్తనాలను సబ్సిడీపై అందజేస్తాం. 
  • కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించి రుణ సౌకర్యం కల్పిస్తాం 
  • రైతులకు కాంప్లెక్స్‌ ఫెర్టిలైజర్స్‌ సరఫరా నిమిత్తం రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి 

చంద్రబాబు చేసిందిదీ.. 

  • పదవీ కాలం ముగుస్తున్నా పూర్తి స్థాయిలో మాఫీ కాలేదు. ఈ పథకం కింద ఇచ్చిన మొత్తం రైతులు తీసుకున్న అప్పులకు సంబంధించి వడ్డీలకు కూడా సరిపోలేదు. ఈ విషయమై వేలాది మంది రైతులు వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.  
  • 7 గంటలకు కోత వేసి రెండు షిఫ్టులుగా సరఫరా.. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చంద్రబాబుకే ఎరుక. అసలు ఈ విషయాన్నే మరచిపోయారు. 
  • పంటల బీమాకే దిక్కులేదు.. ఇక రైత్వారీ ఎక్కడో? 
  • ప్రభుత్వం ఇచ్చే విత్తనాల కన్నా బహిరంగ మార్కెట్‌లోనే చౌక 
  • దివిటీ పట్టుకుని వెతికినా కనిపించవు 
  • ప్రస్తుతం అమల్లో ఉన్నది ప్రధాన మంత్రి పంటల బీమానే.. బాబు చేసిందేమీ లేదు 
  • 24 గంటలు కాదు.. 48 గంటలైనా దిక్కులేదు) 
  • గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్డెక్కుతుంటే పోలీసులను పురమాయించి లాఠీలతో కొట్టించారు 
  • ఆ చట్టం టీడీపీ చుట్టమైంది. ఇంత వరకు బయటకు రాలేదు. 
  • 16.5 లక్షల మందికి ఇస్తామని చెప్పారు. నాలుగున్నరేళ్లలో ఇచ్చింది 6 లక్షల మందికే. ఇందులో సగానికిపైగా గత ప్రభుత్వం ఇచ్చినవే. 
  • కనీసం ఇలాంటి ఆలోచనే చేయలేదు 

ఇదీ వైఎస్‌ జగన్‌ భరోసా

  • ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు సాయం. రెండవ ఏడాది నుంచి మే నెలలోనే రూ.12,500 చొప్పున నాలుగేళ్ల పాటు  అందిస్తారు.   
  • వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల  పాటు ఉచిత విద్యుత్‌  
  • ప్రతి రైతుకు వడ్డీ లేకుండా, సున్నా వడ్డీ రుణాలు  
  • రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తారు.  
  • పంట వేయడానికి ముందే గిట్టుబాటు ధర ప్రకటన. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి.   
  • రూ.4 వేల కోట్ల (కేంద్ర, రాష్ట్రాలు చెరిసగం భరిస్తాయి)తో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి.   
  • పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి.  
  • తొలి ఏడాది మూతపడ్డ సహకార డెయిరీల పునరుద్ధరణ. ఆ తర్వాత వీటికి పాలు పోసిన రైతులకు లీటరుకు రూ.4 çసబ్సిడీ  
  • అనుకోకుండా ఏ రైతు అయినా ఈ లోకాన్ని వీడిపోతే అప్పుల వాళ్లు అతని కుటుంబంపై పడి పీడించకుండా ప్రత్యేక చట్టం. రూ.5 లక్షలు ఆ కుటుంబానికి వారంలోగా అందజేసి తోడుగా ఉంటారు. ఈ రూ.5 లక్షలు ఆ కుటుంబ ఆస్తిగా పరిగణిస్తారు.  
  • రైతుల వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ నుంచి మినహాయింపు  
  • ఆక్వా రైతులకు కరెంటు చార్జీ యూనిట్‌ రూ.1.50కి తగ్గింపు 
  • (వీటన్నింటి ద్వారా ప్రతి రైతుకు ఏటా రూ.12,500 నుంచి రూ.లక్ష వరకు లబ్ధి కలిగేలా ప్రణాళిక)  



పంట నష్టపోయినా దిగులుండదు
నాపేరు గుర్రం  శ్రీనివాసులు. నాకు 10 ఎకరాల భూమి ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఏటా వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. దీంతో పంట కోసం ఏటా అప్పులు చేయాల్సి వస్తోంది. మా కష్టాలు పాలకులకు పట్టలేదు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పాదయాత్రతో రైతుల కష్టాలు తెలుసుకుంటున్నారు. మా కష్టాలను కళ్లారా చూసి రైతు భరోసా పథకం తీసుకొస్తామని చెప్పారు. నిజంగా ఈ పథకం అద్భుతం. ప్రతి రైతుకు ఉచితంగా బోర్లు, పంట పెట్టుబడుల కోసం ఏటా రూ.12,500 మే నెలలోనే రైతు చేతికి ఇవ్వనుండటం, తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్‌.. ఇలా అన్ని అంశాలు ఆభినందించదగ్గవే. పంట నష్టపోయినా భయం ఉండదు. ఇంతగా రైతుల శ్రేయస్సు కోరే నాయకుడు జగనే ముఖ్యమంత్రి కావాలని మా రైతులందరం కోరుకుంటున్నాము.    
–శ్రీనివాసులు, రైతు,షేక్షానిపల్లి, ఉరవకొండ నియోజకవర్గం, అనంతపురం జిల్లా.

దళారి వ్యవస్థ తగ్గుతుంది
రైతు భరోసా పథకం చాలా బాగుంది. ఈ పథకం అమలైతే అన్నదాతలకు చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా దళారి వ్యవస్థ తగ్గుతుంది. రైతుల వద్ద నుంచి అధికారులు గుంజే లంచాలు తగ్గుతాయి. రైతులు స్థిమితంగా ఉంటూ తమకు ఇష్టమైనప్పుడు పంటను అమ్ముకునే అవకాశం ఉంది. 
–వి. వెంకటేశ్వర్లు, రైతు, మాచవరం, నర్సరావుపేట నియోజకవర్గం, గుంటూరు జిల్లా




పెట్టుబడి  సొమ్ముతో రైతుకు మేలు
జగన్‌ తీసుకున్న నిర్ణయాలు సమర్థనీయం. పెట్టుబడి మొత్తం బాగా ఉపయోగపడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 35 లక్షల మంది (అధికారిక లెక్కల ప్రకారం 17 లక్షలు) కౌలు రైతులు ఉన్నారు. వాళ్లకూ మేలు చేకూరే ఆలోచన చేయాలి. 
– రావుల వెంకయ్య, పి.జమలయ్య, ఏపీ రైతు సంఘం నేతలు 


ధరల స్థిరీకరణ నిధి ఉంటేనే అండ 
ఇంతవరకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కాలేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్‌ జగన్‌ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని ప్రకటించడం హర్షణీయం. ప్రతి ఏటా దీన్ని పెంచుకుంటూ పోవాలి.  
– డాక్టర్‌ డి.నరసింహారెడ్డి, వ్యవసాయ రంగ నిపుణులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement