
సాక్షి, కృష్ణా: రైతు భరోసా పథకంతో దేశంలోనే చారిత్రాత్మక ఘట్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారని తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచుతున్నట్టు సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి ఆయన ప్రశంసించారు. ఆదివారం ఎమ్మెల్యే తిరువూరులో రైతులతో కలిసి బాణాసంచా పేల్చి ఆనంద వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు దివంగత నేత వైఎస్సార్ పాలనను సీఎం జగన్ పాలనలో చూస్తున్నారని పేర్కొన్నారు. గత పాలనలో రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు రైతులను మోసం చేశారని విమర్శించారు. కాగా సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 85 శాతం నెరవేర్చారని రక్షణనిధి తెలిపారు.